భారతదేశంలో ఉన్న వివిధ నదులపై నిర్మించిన ఆనకట్టలు, రిజర్వాయర్లు శతాబ్దాల కాలం నుంచే వివిధ రకాలుగా ప్రజలకు ఉపయోగపడుతూ వ్యవసాయానికి, విద్యుత్ ఉత్పత్తికి, పరిశ్రమలు స్థాపనకు సందర్శనా ప్రదేశాలుగా పేరు పొందాయి . సింధూ నది నాగరికత కాలంలోనే మనదేశంలో ఉన్న నదులపై ఆనకట్టలు నిర్మించినట్లు తెలుస్తోంది. ప్రాచీన కాలంలో ఆనకట్టలు కేవలం వ్యవసాయానికి, నీరు నిల్వ చేయడానికి మాత్రమే నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. అయితే, తదనంతరం ఆధునిక కాలంలో వ్యవసాయానికి, నీటిని నిల్వ చేయడానికే కాకుండా, జల విద్యుత్ ఉత్పత్తికి, వరదల నియంత్రణకు, వివిధ కాలాల్లో నీటి ఎద్దడిని నివారించడానికి ద్రృష్టిలో ఉంచుకుని ఆనకట్టలు రిజర్వాయర్లు నిర్మాణం చేపట్టారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 1963లో పూర్తి చేసిన సట్లేజ్ నదిపై నిర్మించిన అతి పెద్ద ఆనకట్ట ” భాక్రా నంగల్ డ్యాం” దేశ నదీ చరిత్రలో అత్యంత కీలకమైనది. ఇక సింధూ నది నాగరికత కాలంలోనే సింధూ, దీని ఉపనదులుపై మట్టి, రాయి, ఇటుకలతో వ్యవసాయానికి ఉపయోగపడే విధంగా డ్యామ్స్ నిర్మించినట్లు హరప్పా మెహాంజోదారోలో కనుగొన్న చారిత్రక ఆధారాలు బట్టి తెలుస్తోంది.
తదుపరి దేశాన్ని పాలించిన మౌర్యులు, చోళులు, మొఘలులు కూడా వ్యవసాయానికి, నదీ పరీవాహక ప్రాంతంలో నిర్మించిన పట్టణాలకు నీళ్ళు అందించడానికి వివిధ నదులపై ఆనకట్టలు నిర్మించారు. దీనికి చక్కటి ఉదాహరణ క్రీ.శ 2వ శతాబ్దంలో తమిళనాడులో చోళ రాజైన కరికలన్ నిర్మించిన ” కళ్ళానై డ్యాం”. మౌర్యుల కాలంలో ఉత్తర ప్రదేశ్ లోని వారణాసి వద్ద ఉన్న” బిట్వా” నదిపై నిర్మించిన” రాజ్ ఘాట్ డ్యాం”…హరప్పా నాగరికత కాలంలోనే గుజరాత్ లోని ” ధోలవీర” వద్ద నిర్మించిన” ధోలవీర రిజర్వాయర్లు, 11వ శతాబ్దంలో పాలించిన పరమారా వంశపు “కింగ్ భోజ్” భోపాల్ , మధ్య ప్రదేశ్ లో నిర్మించిన” భోజ్ తల్ (అప్పర్ లేక్) డ్యాం మొదలైనవి.తదుపరి బ్రిటిష్ కాలంలో వ్యవసాయానికి, రవాణా మార్గాలకు, విద్యుత్ ఉత్పత్తికి కొన్ని ఆనకట్టలు నిర్మించారు. వీటిలో ముఖ్యంగా కేరళా లోని ” ముల్లు పెరియార్ డ్యాం”, మహారాష్ట్ర లోని “కడకవాస్లా డ్యాం ” , గోదావరి నదిపై రాజమండ్రి ధవళేశ్వరం వద్ద నిర్మించిన ధవళేశ్వరం బ్యారేజి ( కాటన్ బ్యారేజి) చెప్పవచ్చు. ఎక్కువగా బ్రిటిష్ వారికి ఉపయోగపడే విధంగా నిర్మాణాలు చేపట్టారు కానీ ఆ ప్రాంతపు ప్రజల అవసరతలను పరిగణనలోకి తీసుకోలేదు అని తెలుస్తోంది.
దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత, వ్యవసాయానికి , విద్యుత్ ఉత్పత్తికి, వరదల నియంత్రణకు, నీటి సరఫరాకు ఆనకట్టలు నిర్మాణాలు చేపట్టారు. ముఖ్యంగా హిమాచల్ ప్రదేశ్ లోని సట్లేజ్ నదిపై భాక్రా నంగల్ డ్యాం , ఉత్తరాఖండ్ లోని భగీరథి నదిపై నిర్మించిన తెహ్రీ డ్యాం, గుజరాత్ లోని నర్మదా నదిపై నిర్మించిన సర్ధార్ సరోవర్ డ్యాం, క్రృష్ణా నదిపై నిర్మించిన నాగార్జునసాగర్ ప్రాజెక్టు, శ్రీశైలం ప్రాజెక్టు, ఒరిస్సా లోని హీరాకుడ్ డ్యాం, తుంగభద్ర ప్రాజెక్టు, ఇందిరా సాగర్ వంటివి ప్రసిద్ధమైనవి. తెలంగాణాలో కూడా మూసి , కడెం ప్రాజెక్టు, శ్రీరాం సాగర్ ప్రాజెక్టు, ఇటీవల నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు వంటివి కూడా వ్యవసాయానికి విద్యుత్ ఉత్పత్తికి, వరదల నియంత్రణకు వివిధ పట్టణాలకు నీటి సరఫరా కోసం నిర్వహించివే… ఆంధ్రప్రదేశ్ లో గోదావరి నదిపై ” పోలవరం ప్రాజెక్టు” కూడా నిర్మాణంలో ఉన్న విషయం తెలిసిందే.. అయితే ఈ ఆనకట్టలు కట్టే సందర్భాల్లో అనేక సమస్యలు కూడా వెంటాడుతూనే ఉన్నాయి. ముఖ్యంగా పర్యావరణ సమస్యలు, అనేక పక్షులు జంతువులు కనుమరుగు కావడం, వివిధ గిరిజన ప్రాంతాలు, ప్రజలకు ఇక్కట్లు, స్థలాలు పొలాలు పోగొట్టుకున్న వారికి సరైన సహకారం, నష్టపరిహారం అందకపోవడం వల్ల సామాజిక ఉద్యమాలు నడుస్తున్నాయి. డ్యాంలు, రిజర్వాయర్లు నిర్మించే సమయంలో ప్రభుత్వాలు సరైన ప్రణాళికతో ముందుకు వెళ్ళాలి. నదీ పరీవాహక ప్రాంతంలో నిర్మించిన ఆనకట్టలు రిజర్వాయర్లు తరచూ పర్యవేక్షణ చేయాలి. ఇసుక మేటలు తీయించాలి. మరమ్మతులు చేయించాలి. ఆధునీకరణ పనులు చేపట్టాలి. తగినంత నిధులు మంజూరు చేయాలి. సరిపడా ఇంజనీర్లు, ఆధునిక టెక్నాలజీ, పనిముట్లు వాడుతూ ఆనకట్టలు పదికాలాలపాటు పనికి వచ్చేటట్లు, ప్రజలకు ఉపయోగపడే విధంగా చూడాలి. అదే సమయంలో పర్యాటకులకు దర్శినీయ స్థలాలుగా తీర్చిదిద్దాలి… భూకంపాలు సంభవించే ప్రాంతాల్లో నిర్మించే ఆనకట్టలు పట్ల సరైన శాస్త్రీయ పద్ధతిలో నిర్మాణం చేపట్టాలి. ప్రజలకు, రైతులకు, జంతుజాల రక్షణకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలి.
ఈవిధంగా దేశంలో ప్రవహించే వివిధ నదులు, వాటి ద్వారా లభించే నీటిని మానవులు అవసరం కోసం, పలు జంతువులు పక్షులు కోసం, పరిశ్రమలు స్థాపనకు, ఆర్థికంగా అభివృద్ధి సాధించడానికి మానవుడు ఆనకట్టలు, రిజర్వాయర్లు నిర్మిస్తూ ముందుకు సాగుతున్నారు. మంచిదే, కానీ అదే సందర్భంలో జీవవైవిధ్యాన్ని కాపాడాలి. ఆయా ప్రాంతాల ప్రజల సమస్యలు తీర్చాలి. అభివృద్ధి పేరుతో స్వార్థంతో ప్రకృతితో చెలగాటం ఆడరాదు.. కాలుష్యాన్ని పెంచరాదు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా నీటి సామర్థ్యం పెంచుకోవడానికి ప్రాజెక్టుల నిర్మాణం అవసరమే. సుమారు 144 కోట్ల ఉన్న ప్రస్తుత మనదేశంలో అందరికీ నీరు, విద్యుత్, ఆహారం అందించడానికి నదులను శాస్త్రీయ పద్ధతిలో అనుసంధానం చేయాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమాలోచనలు జరపాలి. ఇప్పటికే నదీ జలాల పంపిణీపై అనేక రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం లేదు. తరచూ వివాదాలు చోటు చేసుకుంటున్నాయి. వీటిని పరిష్కరించే దిశగా కేంద్రం కసరత్తు చేయాలి. వ్రుధాగా పోతున్న నీటిని నదులపై ఆనకట్టలు రిజర్వాయర్లు నిర్మించుట ద్వారా శాశ్వత పరిష్కారం చూడాలి. దేశంలో అనేక పంటలు పుష్కలంగా పండుతున్నా, మూడో వంతు ప్రజలకు మూడు పూటలా తిండి దొరకడం లేదు. అదే విధంగా దేశం వివిధ నదుల్లో పుష్కలంగా నీరు ఉన్నా సరైన ఆనకట్టలు రిజర్వాయర్లు లేక నీరు వ్రృధా అవుతూ, ఎండాకాలం కనీసం తాగేందుకు నీళ్లు లేక కోట్ల మంది భారతీయులు అల్లాడుతున్నారు. కావున భవిష్యత్తు తరాలకు అవసరమైన ఆహారం పండించడానికి, సరిపడా నీరు అందించేందుకు దేశంలో ప్రవహించే వివిధ నదులపై ఆనకట్టలు రిజర్వాయర్లు నిర్మించే బాధ్యత మన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలుపై ఉంది…ఆ దిశగా సంయుక్తంగా సమాలోచనలు చేసి, కరువులు నివారించడానికి, దాహార్తిని , క్షుద్బాధ నుంచి ప్రజలను విముక్తి కలిగించే దిశగా అడుగులు వేయాలి. ప్రజలు, దేశం సుభిక్షంగా, ఆయురారోగ్యాలతో ఉండటానికి, ఆర్థికంగా అభివృద్ధి సాధించడానికి నదులపై ఆనకట్టలే శరణ్యం అని అనుటలో అతిశయోక్తి లేదు.
రచయిత: ఐ.ప్రసాదరావు 9948272919