శేరిలింగంపల్లి జోన్ చందానగర్ సర్కిల్ పరిధిలో అక్రమ నిర్మాణాలను కూల్చివేతలు చేపట్టారు. సర్కిల్‌లోని మాదాపూర్ డివిజన్ అయ్యప్ప సొసైటీలో పెద్ద ఎత్తున అక్రమ నిర్మాణాలు చోటు చేసుకుంటున్నాయి అని అధికారులకు ఫిర్యాదులు అందుతున్నాయి.
అయ్యప్ప సొసైటీలో మంగళవారం పదుల సంఖ్యలో అక్రమ నిర్మాణాలు కూల్చివేశారు. పిల్లర్లను తొలగించటంతో పాటు స్లాబ్‌లను నేలమట్టం చేశారు. కమిషనర్ గారి ఆదేశాల మేరకు జోనల్ టౌన్ ప్లానింగ్ అధికారుల పర్యవేక్షణలో పెద్ద ఎత్తున యంత్రాలతో తెల్లవారు జాము నుంచే అక్రమ కట్టడాలను పూర్తిస్థాయిలో కూల్చివేశారు.
అనుమతులు లేకుండా ఎటువంటి నిర్మాణాలు చేపట్టినా కూల్చివేతలు తథ్యమని అధికారులు స్పష్టం చేశారు.గడిచిన వారం రోజులుగా అయ్యప్ప సొసైటీలో ఈ కూల్చివేతలు కొనసాగుతున్నాయి. కొన్ని నిర్మాణాలు ప్రాథమిక దశలో ఉన్నప్పుడే వాటిని కూల్చి వేస్తున్నారు. సంవత్సరాల తరబడి ఇక్కడ అక్రమ కట్టడాలు నిరాటంకంగా కొనసాగుతున్నాయి.
వాటిపై అధికారులు కఠిన చర్యలకు ఉపక్రమించడంతో అనుమతుల్లేకుండా నిర్మాణాలు చేపడుతున్న వారి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.ఖానామెట్ లో సర్వే ఆఫ్ ఇండియాలో ఓపెన్ ప్లాట్, అయ్యప్ప సొసైటీలో పలు ప్లాట్ నెంబర్ లలో అక్రమ నిర్మాణాలు కూల్చివేశారు. ఇకపై ఎటువంటి అక్రమ నిర్మాణాలను ఉపేక్షించేది లేదని, కూల్చివేత లను వేగవంతం చేయాలని ఆదేశించడం జరిగింది.