మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కాప్రా మండలం, జవహర్ నగర్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న హెచ్‌ఎండిఏ ప్రభుత్వ భూముల్లో అనుమతి లేకుండా జరుగుతున్న అక్రమ నిర్మాణాలను భారీ పోలీసు బలగాలతో తొలగించారు. హెచ్‌ఎండిఏ తహసీల్దార్ దివ్య రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, హెచ్‌ఎండిఏ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జవహర్ నగర్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోని సర్వే నంబర్ 706లో కొందరు భూమిని అక్రమంగా ఆక్రమించి, నిర్మాణాలు చేపట్టారని ఫిర్యాదులు అందాయని తెలిపారు. వారానికి ముందు ఫీల్డ్ అధికారులు వివిధ ప్రాంతాల్లో పరిశీలన నిర్వహించి, అక్రమ నిర్మాణాలపై నివేదికను అధికారులు అందుకున్నారని వెల్లడించారు.ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 18 (మంగళవారం) నాడు పోలీసు బలగాలు, రెవెన్యూ యంత్రాంగం సహాయంతో సర్వే నంబర్లు 706, 701, 702, 703లలో నిర్మించిన 15 అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. అక్రమంగా ప్రభుత్వ భూమిలో నిర్మాణాలు చేపట్టిన వారి మీద క్రిమినల్ కేసులు నమోదు చేయాలని హెచ్‌ఎండిఏ తహసీల్దార్ దివ్య రెడ్డి, సైట్ ఆఫీసర్ రమణారెడ్డిని ఆదేశించారు. ఈ కార్యకలాపాల్లో సబ్ ఇన్‌స్పెక్టర్‌లు రాము, వేణు గోపాల్, హెచ్‌ఎండిఏ పోలీసు సిబ్బంది, రెవిన్యూ అధికారులు పాల్గొన్నారు.