Sunday, November 10, 2024
spot_img

బాసర జ్ఞాన సరస్వతి ఆలయంలో భక్తులకు ఇక్కట్లు

Must Read
  • భక్తులకు ఇబ్బంది పెడుతున్న దోమల బెడద..
  • 5,6 నెలల్లో కేవలం రెండుసర్లే దోమల మందు కొట్టారంటూ స్థానికుల ఆగ్రహం.
  • దోమల మందు ఎంత కొట్టిన దోమలు పొవట్లేదని చేతులెత్తేస్తున్న ఆలయ ఏఈఓ సుదర్శన్
  • రైల్వే స్టేషన్ నుండి ఆలయం వరకు కేవలం ఒకే ఒక ధర్మ రథం
  • గోదావరి నది వద్ద కొరవడిన బాత్రూంలు,పరిశుభ్రత.
  • చెప్పులు,లగేజి పాయింట్ల వద్ద కూడా వసూళ్లు

చక్కని తల్లి,చల్లని తల్లి శ్రీజ్ఞాన సరస్వతి మాత కొలువైన ఆలయం బాసర పుణ్యక్షేత్రం.భారత ఉప ఖండంలోని ప్రసిద్ధిగాంచిన సరస్వతీ దేవాలయాలల్లో బాసర సరస్వతి ఆలయం ఒకటి.మరొక ఆలయం శారదా పీఠం.చంటి పిల్లల అక్షరాభ్యాసం,మాదుకరి బిక్ష స్వీకరణ,అనుష్టానం తదితర ముఖ్య కార్యక్రమాలకు నిలయంగా నిలుస్తుంది బాసర ఆలయం.సాక్షాత్తు గోదావరి నది ప్రవహించడం,వ్యాస మహర్షి ఇక్కడ తపస్సు చేసి అమ్మవారిని ప్రతిష్టించడం లాంటి ఘనమైన చరిత్ర బాసర పుణ్యక్షేత్రానికి కలిగి ఉంది.ఇలాంటి దివ్య చరిత్ర కలిగిన ఆలయానికి ఎలాంటి వసతులు ఉండాలి? బ్రహ్మాండమైన వసతులు కలిగి,భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు ఉండాలి.కానీ ఇక్కడి అధికారులు భక్తులకు సరైన సౌకర్యాలు కల్పించడంలో విఫలం అవుతున్నారనే విమర్శలు వెలువెత్తుతున్నాయి.

భక్తులకు ఇబ్బంది పెడుతున్న దోమల బెడద :

ఆలయానికి వచ్చిన భక్తులకు దోమలు విపరీతంగా ఇబ్బంది పెడుతున్నాయి.అనుష్టానం చేసుకోవడానికి,ధ్యానం చేసుకోవడానికి,కనీసం అభిషేకం వీక్షించడానికి కూడా వీలు లేనంతగా దోమలు ఇబ్బంది పెడుతున్నాయి అని భక్తులు వాపోతున్నారు.మరోవైపు ఫ్యాన్లు కూడా ఉపయోగపడటం లేదు.విచిత్రం ఏమిటంటే ఎండోమెంట్ శాఖ ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోకపోవడం లేదు.వర్షాకాలం కావడంతో దోమల కారణంగా డెంగ్యూ,ఇతర విషజ్వరాలు తాండవిస్తున్న రోజులివి.ఇలాంటి సమయంలో కూడా అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు .అధికారుల నిర్లక్ష్యం భక్తుల ప్రాణాల మీదికి వచ్చిన ఆశ్చర్యం లేదు.ఇదే విషయం పై “ఆదాబ్ హైదరాబాద్” ప్రశ్నించగా ఆలయ ఏఈఓ సుదర్శన్ నిర్లక్ష్యంగా జవాబు ఇవ్వడం విస్మయానికి గురిచేసింది.”దోమల మందు ఎంత పట్టించినా,అవి పోవట్లేదు,దానికి మేమేం చేస్తాం” అని సమాధానం ఇచ్చారు.ఆ తర్వాత గ్రామపంచాయతి ఈఓ గోవింద రాజుని సంప్రదించగా,గత వసంత పంచమి రోజు దోమల మందు కొట్టామని చెప్పారు.ఇదే విషయంపై స్థానికులను ప్రశ్నించగా “గత ఆరున్నర నెలల్లో కేవలం రెండుసార్లు మాత్రమే దోమల మందు కొట్టడం జరిగిందని” వారు ” ఆదాబ్ హైదరాబాద్ ” కు తెలిపారు.ఇంతటి భయంకరమైన పరిస్థితి పెట్టుకొని,ఆలయ ఈవో ఎందుకు గ్రామపంచాయతీ వారితో దోమల మందు ఎందుకు కొట్టించడం లేదో వారికే తెలియాలి.దోమల మందు కొట్టిన తర్వాత ఉపశమనం లభించి,ఆ తర్వాత దోమలు మళ్ళీ విజృంభిస్తున్న అధికారులు చేతులు దులుపుకోవడం ఎంతవరకు సమంజసం..? గ్రామ పంచాయితీ,ఇతర ఆరోగ్య అధికారులతో పని చేయించుకునే బాధ్యత ఆలయ దేవాదాయశాఖ పై లేదా? దోమల మందు కొట్టడం మళ్ళీ ప్రారంభిస్తామని చెబుతున్న గ్రామపంచాయతీ గోవిందరాజు సమాధానం ఈ సమస్యను ఎంతవరకు పరిష్కరిస్తుందో వేచి చూడాలి.దేవాదాయ శాఖ ఈ సమస్యను ముగింపు దిశగా తీసుకోని వెళ్తుందా..?? ఇప్పటికైనా సమస్యను పరిష్కరించి భక్తుల మన్ననలలను పొందుతారా లేక నిర్లక్ష్యంతో వ్యవహరించి వారి ఆగ్రహావేశాలకు గురవుతారా..?? అనేది కాలమే నిర్ణయిస్తుంది.

భక్తుల తాకిడి వేలల్లో..మరి మరుగుదొడ్లు..??

శ్రీజ్ఞాన సరస్వతి ఆలయానికి రోజుకు సుమారుగా 10 వేల నుండి 20 వేల మంది భక్తులు వస్తుంటారు.భక్తుల తాకిడి ఎక్కువ ఉండే ఆలయ ప్రాంగణంలో ఒక్క ఉచిత మరుగుదొడ్డి కూడా లేదు.ఉన్నదల్లా డబ్బులు చెల్లించి ఉపయోగించుకోవాల్సిన మరుగుదొడ్లే.అవి కూడా పట్టుమని చూస్తే పది ఉంటాయి.ఇక్కడికి వెళ్లాలంటే ఆలయం నుండి కొంతదూరం వరకు వెళ్ళాలి.తీరా వెళ్లిన తర్వాత అవిపరిశుభ్రంగా ఉంటాయా..?? అంటే అది లేదు.వెస్ట్రన్ టాయిలెట్స్ లేకపోవడంతో వృద్ధులు,మోకాల నొప్పి ఉన్నవారు,గర్భిణిలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.ఇక్కడ మూత్రానికి రూ.05,మల విసర్జనకు రూ.10 రూపాయలు ముక్కు పిండి మరీ వసూలు చేస్తారు.

చెప్పులు,లగేజి పాయింట్ల వద్ద కూడా వసూళ్లు :

ఈ మధ్యకాలంలో చిన్నగుడి నుండి పెద్ద క్షేత్రాలలో భక్తుల కోసం ఉచిత చెప్పుల స్టాండ్స్ ను ఏర్పాటు చేస్తున్నారు.కానీ ఇక్కడ,ఆ వసతి లేదని భక్తులు వాపోతున్నారు.ఒక్క జతకు రూ.05 రూపాయలు అని బోర్డు ఉన్నప్పటికీ ఉన్నప్పటికీ రూ.10 రూపాయలు వసూలు చేస్తున్నారు.సామాన్లు భద్ర పరుచుకునే వద్ద పరిస్థితి మరి విడ్డురంగా ఉంది.ఒక్క బ్యాగ్ కి రూ.20 రూపాయలు అని ఆదేశాలు ఉన్న,ఆదేశాలకు భిన్నంగా రూ.30 రూపాయలను వసూలు చేస్తున్నారు.దీనికి వారి వద్ద ఉన్న నమోదు పుస్తకమే సాక్షి.పది రూపాయలు అదనంగా ఎందుకు వసూలు చేస్తున్నారని ప్రశ్నించగా ఎదురుదాడికి దిగుతున్నారు.దేవాదాయ శాఖకు ఇవేమీ పట్టవా?

రైల్వే స్టేషన్ నుండి ఉచిత బస్సు సౌకర్యం

బాసర ఆలయానికి వివిధ ప్రాంతాల నుండి భక్తులు రైలు ప్రయాణం ద్వారా చేరుకుంటారు.రైల్వే స్టేషన్ నుండి ఆలయానికి వెళ్లాలంటే కేవలం ఒక్క ధర్మ రథం మాత్రమే ఉన్నది.అది కూడా ఎటూ ఉపయోగపడని పాతబడిన ఒక చిన్న స్వరాజ్ మస్థ.ఇక్కడ బస్సు సర్వీసులు అన్నివేళలా అందుబాటులో ఉండవు.

గోదావరి నది వద్ద కావాల్సినన్ని మరుగుదొడ్లు కరువు

గోదావరి నది వద్ద భక్తులకు కావాల్సినన్ని మరుగుదొడ్లు,బాత్రూంలు లేవు.ఉన్న ఒకటి రెండు కాస్త అపరిశుభ్రంగా ఉంటాయి.నది మెట్ల వద్ద జనాలు మల మూత్ర విసర్జన చేయడం శోచనీయం.అయినప్పటికీ అధికారులు ఎలాంటి కఠిన నిర్ణయాలు అమలు చేయకపోవడం బాధాకరం.ఇక్కడ షవర్ల స్టాండ్ ఉన్నా అవి పని చేయడం మాత్రం సున్నా.

ఇక యాత్రికులు వారు పుణ్యక్షేత్రానికి వెళ్లనుకుంటే ఆలయ అధికారులను సంప్రదిస్తారు.లేదా గూగుల్ లో వెబ్ సైట్ ను సందర్శిస్తారు.కానీ ఇక్కడ అసలు ఫోన్ నెంబర్లు ఎక్కడ పొందుపర్చారో,ఒకవేళ పెడితే ఎక్కడ పెట్టారో వారికే తెలియాలి.ఇప్పటికైనా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచిచూడాలి.

Latest News

తెలంగాణ సర్కార్ పై మోదీ అసత్య ప్రచారాలు చేస్తున్నారు

సీఎం రేవంత్ రెడ్డి మహారాష్ట్ర భాజపా నేతలు తెలంగాణ సర్కార్‎పై అసత్య ఆరోపణలు చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. మహారాష్ట్ర ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS