- తెలంగాణ వైద్య వ్యవస్థ కుప్పకూలడం ఖాయమేమోనని బాధ పడుతున్న విశ్రాంత వైద్యులు
- “కెసిఆర్ హయాంలోనే బాగుండేది” అని వైద్య సిబ్బంది అనుకునేలా కాంగ్రెస్ తీరు
- పేషంట్ల రద్దీ ఎక్కువ గా ఉండే హాస్పిటల్స్ లో కరువైన సీనియర్ డాక్టర్ల సిబ్బంది
- అంతగా రద్దీ లేని దూర ప్రాంత ఆసుపత్రులకు సీనియర్ డాక్టర్ల బదిలీ
- మెరుగైన వైద్యం మరియు ఆరోగ్య పరీక్షల నిర్వహణ లేక ఇబ్బంది పడుతున్న పేషెంట్లు
- ఇటు మెడికల్ విద్యార్థులకూ అందని సరైన వైద్య శిక్షణ
- మే 2024 నుండి జరిగిన బదిలీలకు ఇంకా భర్తీ కాని డాక్టర్ పోస్టులు
- ఛాయ్ సమోసా అమ్ముకునే వారి సంపాదన కంటే మన కాంట్రాక్టు వైద్యుల జీతం చాలా తక్కువ
- మన డాక్టర్లను కాపాడుకోలేకపోతే మనల్ని కాపాడే వారు ఉండరు
- వైద్య విద్య వైపు విద్యార్థులు మొగ్గు చూపటానికి ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహం ఏమిటి?
- ఒంటి కాలిపై కుంటుతున్న మెడికల్ పోస్టుల రిక్రూట్మెంట్ ప్రాసెస్
- గతేడాది నిర్వహించిన ఎం.హెచ్.ఎస్.ఆర్.బి పరీక్ష ఫలితాల కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్న నర్సింగ్ విద్యార్థులు
మన రాష్ట్ర ప్రభుత్వ వైద్యులలో అసంతృప్తి పెరుగుతుంది. కాంట్రాక్టు డాక్టర్లు మొదలుకొని విశ్రాంత వైద్యుల వరకు చాలామంది తమ పట్ల ప్రభుత్వం చూపిస్తున్న తీరుపై సంతోషంగా లేరు.
బదిలీలు:
మే 2024 నుండి జరిగిన బదిలీలు అంతగా ఉపయోగపడలేదు అని చెప్పుకోవాలి. ఒకే ప్రాంతంలో సుదీర్ఘ కాలంగా సేవలందిస్తున్న వైద్యుల్లో దాదాపు 40 నుండి 80 శాతానికి పైగా బదిలీ అవ్వడం కొన్ని ప్రకంపనలను సృష్టిస్తున్నది. ఖాళీ అయిన పోస్టులు చాలా మటుకు ఇంకా భర్తీ కాలేదు. సీనియర్ వైద్యుల సేవలు పెద్ద ఆసుపత్రుల్లో తప్పనిసరిగా ఉండాలి. కానీ వీళ్లను ఇతర దూర ప్రాంతాలకు బదిలీ చేయడం వల్ల గాంధీ, ఉస్మానియా లాంటి పెద్ద ఆసుపత్రుల్లో వీరు లేని కొరత కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. దీనివల్ల రోగులకు అందాల్సిన వైద్యం అందట్లేదు. అటు వైద్య విద్యార్థులకు అందాల్సిన శిక్షణా సరిగ్గా అందడం లేదు. ఆరోగ్య పరీక్షల సంగతి అధోగతిగా మారింది. ఇదిలా ఉంచితే, అంతగా రద్దీ ఉండని చిన్న ఆసుపత్రులకు సీనియర్ డాక్టర్లు వెళ్లడం వలన అక్కడ వారి యొక్క సేవలు అక్కడ అంతగా ఉపయోగంలోకి రావడం లేదు. ఇది ఇలాగే కొనసాగితే భవిష్యత్తు వైద్య వ్యవస్థ ఒక ప్రశ్నార్ధకంగా మారబోతుంది అన్న విషయం చాలామంది వైద్యుల్లో ఆందోళన కలిగిస్తుంది. ప్రజల ఆరోగ్యంపై ఇది తీవ్ర ప్రభావం చూపబోతోంది.
ఇక్కడి వాళ్లే అక్కడ కూడా:
పోస్టులు భర్తీ చేయకపోవడం వల్ల ఉన్న డాక్టర్ లనే మన ప్రభుత్వం వాడుకుంటుంది. దీని కారణంగా పీ.హెచ్.సీ. లో కరువైన వైద్య సేవలను “బస్తీ దవఖాన” వైద్యులచే పని కానిస్తున్నారు.
సరిగ్గా అందని జీతాలు:
కాంట్రాక్ట్ వైద్యుల జీవనం దయనీయం అని చెప్పుకోవాలి. మన నగరంలో చాయి సమోసా వాళ్లు నెలకు లక్షల్లో సంపాదిస్తున్నారు. కానీ ఈ వైద్యుల జీతం 50 వేల పైచిలుకు మాత్రమే. పైగా ఎలాంటి బెనిఫిట్స్ ఉండవు. హైక్స్, బోనస్ లాంటివి భూతద్దం పెట్టి వెతికినా దొరకవు. ఆకాస్త జీతం కూడా ఒక్కోసారి నెలలు తరబడినా అందవు. ఇంకా వేర్వేరు కారణాలవల్ల కాంట్రాక్టు ఉద్యోగులు రాజీనామా చేసి వెళ్ళిపోతారు. అప్పుడు ఆ బస్తీ దవాఖానాల్లో ఉండే ఆకాస్త వైద్య సిబ్బంది కూడా కరువవుతున్నది. నిజానికి చెప్పాలంటే రెగ్యులర్ వైద్యులు అందించే సేవలకు మరియు ఈ కాంట్రాక్ట్ వైద్యులు అందించే సేవలకు ఎలాంటి తేడా ఉండదు. ఇద్దరూ ఒకే రకమైన కష్టం పడతారు కానీ వారికి అందే ప్రయోజనాల్లో మాత్రం చాలా తేడా. వీళ్లు పలు సందర్భాల్లో ధర్నాలు చేసినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది.
డాక్టర్ల కరువు లేదు
ఇవన్నీ చూస్తుంటే మన వద్ద వైద్యుల కొరత ఉందేమో అని అనిపిస్తుంది కానీ అలాంటి పరిస్థితి ఏమీ లేదు. మన దగ్గర అత్యంత ప్రతిభావంతులైన వైద్యులు ఉన్నారు. కానీ వారికి ఉద్యోగాలు మాత్రం లేవు. ఉన్న కాళీ పోస్టులు భర్తీ కావడం లేదు. ప్రభుత్వం విడుదల చేస్తున్న పోస్టుల సంఖ్య కూడా చాలా తక్కువగా ఉంటుంది. వైద్యుల నియామకాలకు సంబంధించిన రిక్రూట్మెంట్ విధానం ఒంటి కాలుపై కుంటుతున్నది.
ఎవరికీ న్యాయం జరగడం లేదు:
సీనియర్ వైద్యులు అందుబాటులో లేకపోవడం వల్ల వైద్య విద్యార్థులకు సరైన శిక్షణ అందడం లేదు. అరకొరా వైద్య సిబ్బంది వల్ల జనాలకు సరిగ్గా వైద్యం అందడం లేదు. అనుభవజ్ఞ డాక్టర్లు దూరమైనందువల్ల నాణ్యమైన వైద్యం పేషెంట్లకు అందడం లేదు. పాతోలజిస్ట్ డాక్టర్లు లేకపోవడం వల్ల ఆరోగ్య పరీక్షలు జరగడం లేదు. కింగ్ కోటి డిస్ట్రిక్ట్ హాస్పిటల్ లో బయోప్సీ లాంటి పరీక్షలు నిర్వహించడానికి అసలు డాక్టర్లే లేరు. అనుభవజ్ఞులైన డాక్టర్లు దూర ప్రాంతాలకు బదిలీ అవ్వడం వల్ల చాలా శాఖల్లో ఇబ్బంది కలుగుతుంది. నగరంలోనే కాక ఇతర జిల్లాల్లో కూడా ఈ తేడా ప్రస్ఫుటంగా కనిపిస్తుంది.
సరిదిద్దుకోకపోతే కష్టమే:
మన వైద్యులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకో లేకపోతే, డిస్ట్రిక్ట్ మరియు ఏరియా హాస్పిటల్స్ ని చూసుకునే టీ.వీ.వీ.పీ. (తెలంగాణ వైద్య విధాన పరిషత్) మన డాక్టర్లను కాపాడుకోలేకపోతే, పిహెచ్సి మరియు బస్తీ దవఖానాలను చూసుకునే డి.ఎం.హెచ్.ఓ మన వైద్య వ్యవస్థను ఇప్పుడు సరిదిద్దకపోతే, గాంధీ ఉస్మానియా లాంటి మెడికల్ కాలేజ్ ఆసుపత్రులను డిఎంఈ సంరక్షించుకోకపోతే – భవిష్యత్తులో మన వైద్య వ్యవస్థ కుప్పకూలడం ఖాయమని కొందరు విశ్రాంత వైద్యులు తమ బాధను, ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. వారి హెచ్చరికను పరిగణలోకి తీసుకొని సరైన న్యాయం జరగాలని ఇతర ప్రభుత్వ వైద్యులు చెప్పుకొస్తున్నారు.
కెసిఆర్ హయాంలోనే బాగుండేదా?:
వైద్యులు ఎప్పుడూ రాజకీయాలతో ముడిపడి ఉండరు. శత్రువైనా సరే సరైన వైద్యం అందించే గొప్ప మానవత్వం వారికి సహజంగానే ఉంటుంది. అలాంటి వాళ్లు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను గత ప్రభుత్వంతో పోల్చి చూస్తున్నారు. రాజకీయంగా జరిగిన కొన్ని నిర్ణయాలు తమ ఉనికికే ప్రమాదం తెచ్చే విధంగా ఉన్నాయని అనుమానం వ్యక్త పరుస్తున్నారు. బదిలీలు, ఉద్యోగాల భర్తీ, జీతాల పంపకం లాంటివి బేరీజు వేసుకుంటున్నారు. తద్వారా గత ప్రభుత్వ హయాంలోనే తమకు కాస్త ఊరటగా ఉండేదా అని ఆలోచించుకుంటున్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వం తమ ఇంటలిజెన్స్ శాఖ ద్వారా నిజానిజాలు తెలుసుకొని మన డాక్టర్లను కాపాడుకోవాలని ప్రతి ఒక్కరి ప్రార్థన. తక్షణమే సరైన నిర్ణయాలు తీసుకొని జనాల ఆరోగ్యానికి భద్రత కల్పించాలని రాష్ట్ర ప్రజలు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.
ఇతర సిబ్బందిది కూడా ఇదే పరిస్థితి:
పి హెచ్ సి లలో కేవలం డాక్టర్ల కొరత మాత్రమే కాదు ఇతర సిబ్బంది కొరత కూడా చవిచూస్తున్నది. నర్సులు ఫార్మసిస్టులు లాంటి వారి కొరత కూడా ఉన్నది. దీనివల్ల ప్రస్తుత సిబ్బందిపై తీవ్ర వత్తిడి పడుతున్నది. ఈ సమస్య అక్కడ ఇక్కడ అంటూ కాకుండా అంతటా ఉన్నది. రిక్రూట్మెంట్ మరియు సెలక్షన్ ప్రాసెస్ ని త్వరగతిన పూర్తి చేయడమే దీనికి తక్షణమార్గం.
ఇంకా విడుదల కానీ పరీక్ష ఫలితాలు:
గతేడాది నవంబర్ 21న నిర్వహించిన ఎం.హెచ్.ఎస్.ఆర్.బి పరీక్ష కు సంబంధించిన కీ పేపర్ 2024 డిసెంబర్ 18 నే విడుదల చేశారు. జనవరి లో ప్రొవిజనల్ లిస్ట్ విడుదల చేస్తామని చెప్పారు కానీ ఇంకా చేయలేదు. దీనివల్ల జి.ఎన్.ఎమ్ నర్సింగ్ మరియు బీఎస్సీ నర్సింగ్ విద్యార్థులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.