- పలు అంశాలపై కీలక ఆదేశాలు
- దస్త్రాలపై వెనువెంటనే సంతకాలు
రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే డొనాల్డ్ ట్రంప్(Donald Trump) పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పారిస్ ఒప్పందం నుంచి బయటకు రావడం, ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి వైదొలగడం, దేశంలో వాక్ స్వాతంత్య్రంపై ఉన్న సెన్సార్ తొలగింపు, కొన్ని రోజులపాటు అధికారులు ఎలాంటి ఆదేశాలు జారీ చేయకుండా ఉత్వర్వులు జారీ చేశారు. జో బైడెన్ ప్రభుత్వం జారీ చేసిన దాదాపు 78 నిర్ణయాలను రద్దుచేస్తూ డొనాల్డ్ ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ జారీ చేశారు. చైనా నుంచి పనామా కాలువను తిరిగి చేజిక్కుంచుకుంటామని స్పష్టం చేశారు. దాంతో చైనాతో వివాదానికి ముగింపు పలికే ప్రసక్తే లేదనే సంకేతాలు వచ్చాయి. కొన్ని ఉత్వర్వులు జారీ చేసిన అనంతరం ట్రంప్ కొన్ని పెన్నులను గాల్లోకి విసరగా అక్కడున్న వారు వాటిని అందుకునేందుకు పోటీ పట్టారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి అమెరికా వైదొలుగుతున్నట్లుగా ప్రకటిస్తూ ఉత్వర్వులపై ట్రంప్ సంతకం చేశారు. అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తొలిరోజే డబ్యూహెచ్‌వోతో సంబంధాలను తెంచుకోవడం ఆయన తీసుకున్న కీలక నిర్ణయాలతో ఒకటి. మెక్సికో గల్ఫ్‌ను అమెరికా గల్ఫ్‌గా పేరు మార్చే పక్రియ ప్రారంభ మైంది. ఇందుకు సంబంధిచిన కార్యనిర్వాహక ఉత్తర్వులపై డొనాల్డ్ ట్రంప్ సంతకం చేశారు. చైనా ఉత్పత్తులపై ప్రస్తుతానికి మినహాయింపు ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్.. మెక్సికో, కెనడాలపై ఉక్కుపాదం మోపారు. ఫిబ్రవరి 1 నుంచి మెక్సికో, కెనడా ఉత్పత్తులపై 25 శాతం పన్నులు విధిస్తూ ట్రంప్ ఉత్వర్వులు జారీ చేశారు. సరిహద్దులో అక్రమ వలసల్ని నివారించకపోతే తీవ్ర నిర్ణయాలు తీసుకుంటానని ట్రంప్ ఇటీవల హెచ్చరించారు. గతంలో అమెరికాలో జన్మించే పిల్లలకు దేశ పౌరసత్వం లభించేది. ఈ చట్టాల్లో సవరణ తీసుకొస్తూ ఉత్వర్వులు జారీ చేశారు. దేశంలోకి తల్లిదండ్రులు అక్రమంగా ప్రవేశిస్తే.. వారికి జన్మించిన పిల్లలకు అమెరికా పౌరసత్వం ఇవ్వకూడదని ప్రకటించారు. ఇప్పటివరకూ దేశంలోకి అక్రమంగా వచ్చిన వారికి పుట్టిన సంతానానికి సైతం పౌరసత్వం లభించేలా ఉన్న అమెరికా చట్టాలలో ట్రంప్ ప్రభుత్వం మార్పులు తీసుకొస్తుంది. అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ ఎన్నిక అనంతరం క్యాపిటల్ లో జరిగిన దాడి కేసులో ఇరుక్కున్న రిపబ్లికన్లకు ఊరట కల్పించారు. అమెరికా 47వ అధ్యక్షుడిగా ప్రమాణం చేసన ట్రంప్ ఎన్నికల హావిూ మేరకు 2021 జనవరి 6 నాటి దాడుల్లో పాల్గొన్న 1500 మందికి క్షమాభిక్ష కల్పిస్తూ, వారిపై పెండింగ్‌లో ఉన్న కేసులు కొట్టివేయాలని అటార్నీ జర్నల్‌ను ఆదేశించారు. బైడెన్ హయాంలో దేశంలో వాక్ స్వాతంత్య్రంపై కొంతమేర నియంత్రణ ఉండేది. చట్టప్రకారం హద్దు దాటి మాట్లాడేందుకు అవకాశం లేదు. తాజాగా బాధ్యతలు చేపట్టిన ట్రంప్ దేశంలో వాక్ స్వాతంత్య్రంపై సెన్సార్ తొలగిస్తూ సంతకం చేశారు. చైనా ఆధీనంలో ఉన్న పనామా కాలువను తిరిగి స్వాధీనం చేసుకుంటామని ప్రకటించారు. పరిపాలనలో తనకు పూర్తి నియంత్రణ వచ్చే వరకు అధికారులు సొంతంగా ఎలాంటి ఆదేశాలు జారీ చేయకుండా ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు సంబంధిత ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీ చేశారు.