- ఫార్మసిస్ట్ లేకుండానే మెడికల్ షాపులు
- కోట్లకు పడగలెత్తిన సంస్థ సీఈఓ జి. మధుకర్ రెడ్డి
- తెలంగాణలో 4వేలకు పైనే మెడ్ ప్లస్ షాప్స్
- ఆఫర్స్ పేరుతో సరికొత్త దందా
- పే బ్యాక్ పాయింట్లతో హోమ్ అప్లయన్స్ అంటూ మాయమాటలు
- తక్కువ జీతం కోసం టెన్త్, ఇంటర్ చదువుకున్న వాళ్ళతో విక్రయాలు
- అత్యవసర పరిస్థితుల్లోనూ ఫార్మాసిస్ట్ లేకుండానే మందుల అమ్మకం
రాష్ట్రంలో డ్రగ్ మాఫియా దందా జోరుగా సాగుతుంది. ‘ఊరు ఊరు పోట్లాడుకుని మంగలం మీద పడి ఏడ్చినట్టు’ ఫార్మాసీల కంపెనీలు పేద ప్రజల వద్ద రక్తాన్ని జలగల్లా పట్టి పీల్చుతున్నాయి. చైన్ ఫార్మసీలు బిజినెస్ మూడు పువ్వులు, ఆరు కాయలుగా వర్ధిల్లుతుంది. గురువారం వెలువడిన ‘ఆదాబ్ హైదరాబాద్’ పత్రికలో ‘మెడ్ ప్లస్ మెగా మోసం’ టైటిల్ తో వచ్చిన కథనంలో పూర్తిగా వివరించడం జరిగింది. దానికి కొనసాగింపుగా డ్రగ్ మాఫియా దందా… మెడ్ ప్లస్ మెగా మోసం 2.0 అనే ఈ వార్త ప్రచురించడం జరుగుతుంది. మెడ్‌ప్లస్ హెల్త్ సర్వీసెస్ లిమిటెడ్ సంస్థ సీఈఓ జి. మధుకర్ రెడ్డి ఈ వ్యాపారం ద్వారా కోట్లకు పడగలెత్తుతున్నాడు. అమాయక జనాల వద్ద దోచుకుంటూ ఫుల్ గా సొమ్ము చేసుకుంటున్నారు. ఎమ్మార్పీలను ఇష్టారీతిగా ఫ్రింట్ చేసుకోవడం ఓ వైపు, ఆఫర్స్ పేరుతో జనాల్ని తమ షాపులకు రప్పించుడు మరోవైపు, మెడికల్ దందా చేస్తున్న మెడ్ ప్లస్, ఇతరత్ర ఫార్మాసీ కంపెనీలు ఛీప్ రకం మందులు అమ్ముతూ భారీ మోసానికి పాల్పడుతున్నాయి. ఇంత జరుగుతున్నా డ్రగ్ అండ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్ మెంట్ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం గమనార్హం.
‘ఏ చెట్టూ లేని చోట, ఆముదం చెట్టే మహా వృక్షము’ అన్నట్టు ప్రజలు కూడా తమ ఇంటికి పరిసర ప్రాంతాల్లో ఉండే మెడ్ ప్లస్, ఇతరత్రా మెడికల్ షాపులకు వెళ్తూ అందులో ఏ రకం డ్రగ్ అమ్ముతున్నరు, దాని రేటు ఎంత, మ్యానిఫ్యాక్చర్ డేట్, కంపెనీ ఏదీ అనే కనీసం చూడకుండా కొనుగోలు చేస్తూ మోసపోతున్నారు. ఆర్ఎంపీ, ఎంబీబీఎస్, ఎండీ వంటి డాక్టర్ల వద్దకు వెళ్తే రూ.300ల నుంచి రూ.1000లు అవుతుంది. అదే మెడ్ ప్లస్ కు వెళ్లి రోగం చెబితే రూ.500 నుంచి 1000లోపు మందులు ఇస్తారు.. అవే వేసుకొని వ్యాధి నయం చేసుకుంటే పోలా అని ఆలోచించేవారు చాలా మంది ఉన్నారు.
పే బ్యాక్ పాయింట్లతో హోమ్ అప్లయన్స్ పేరిట ఆఫర్స్ :
మెడ్ ప్లస్ ఫార్మాసి పే బ్యాక్ పాయింట్ల పేరుతో సరికొత్త దందాకు తెరతీసింది. తమ షాపులో కొనుగోలు చేయాలనే ఆలోచనతో సంస్థ ఈ ఆఫర్ తీసుకొచ్చినట్టు తెలుస్తోంది. మెడ్‌ప్లస్ సంస్థకు సంబంధించిన ఫార్మసీలో అధిక అమ్మకాలు జరగాలని, పే బ్యాక్ పాయింట్స్ అని నమ్మబలికి, వివిధ రకాల గృహోపకరణాల వస్తువులు చూపిస్తూ ఆకర్షితులను చేస్తూ, పాయింట్స్ వైజ్‌గా కొన్ని వస్తువులను ఎమ్మార్పీ ధరలకే వినియోగదారులకు అమ్మకాలు చేస్తున్నారు. ఈ ఫార్మసీలో కొనడం వల్ల వచ్చిన పాయింట్స్‌తో ఎలాంటి ఉపయోగం లేదని వినియోగదారాలు వాపోతున్నారు. బహిరంగ మార్కెట్‌లో ఆ వస్తువుల విలువ కూడా అంతే ఉండడం గమనార్హం. ఈ పే బ్యాక్ పాయింట్స్‌తో వినియోగదారులకు ఏమాత్రం ఉపయోగం కలుగుతుందో సంస్థకే తెలియాలి.
డ్రగ్ అండ్ కంట్రోల్ ఫార్మసీ చట్టం అమలు కావట్లే:
ఫార్మసిలో ఫార్మసిస్ట్‌లు మందులు పంపిణీ చేయాలని డ్రగ్ అండ్ కంట్రోల్ ఫార్మసి చట్టంలో ఉంది. ప్రతిరోజు ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు ఒక షిప్ట్.. మధ్యాహ్నం 3 గంటల నుండి రాత్రి 11 గంటలకు వరకు మెడికల్ షాపులో రిజిస్టర్ ఫార్మసిస్ట్ తప్పక ఉండాలి. ప్రతి ఫార్మసీలో మందులు విక్రయించడానికి తప్పనిసరిగా రిజిస్టర్ ఫార్మసిస్ట్ ఉండాలి అనే నిబంధన ఉన్నది. కాని మెడ్‌ప్లస్ హెల్త్ సర్వీసెస్ లిమిటెడ్ అనే సంస్థ చట్ట విరుద్ధంగా నడుపుతోంది. మెడ్ ప్లస్ లో అక్కడక్కడ ఫార్మసిస్ట్ అనే వాడు కనిపిస్తాడు అంతే… ఫార్మసిస్ట్ లేకుండా టెన్త్, ఇంటర్ చదివి, మందుల గురించి కనీసం అవగాహన లేనివారిని ఉద్యోగులుగా పెట్టుకొని మెడికల్ దందా చేస్తుండడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. పది, ఇంటర్ పాసైన వారికి కేవలం 3 నెలల ట్రైనింగ్ ఇచ్చి వారిచే మందులు అమ్మకాలు చేయిస్తున్నారు. ఓ వ్యాదికి ఇయ్యాల్సిన మందులు మరోదానికి ఇవ్వడం, డేట్ అయిపోయిన మందులను సైతం సేల్ చేస్తూ ప్రజారోగ్యం దెబ్బతినేందుకు కారకులు అవుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.
మెడ్ ప్లస్ బ్రాంచ్ లు సుమారు 4వేలకు పైనే:
మెడ్ ప్లస్ సంస్థ తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక బ్రాంచ్ లు నడుపుతూ ప్రజలను మోసగిస్తుంది. తెలంగాణ వ్యాప్తంగా సుమారు మెడ్‌ప్లస్ ఫార్మసీలు నాలుగు వేలకు పైనే ఉన్నాయి. అందులో 80శాతం వరకు ఫార్మిసిస్ట్‌లు లేకుండానే ఫార్మసి ఎయిడ్ (అసిస్టెంట్)లతో మెడ్‌ప్టస్ ఫార్మసీలు కొనసాగుతుండడం గమనార్హం. మెడ్ ప్లస్ ఫార్మసిస్ట్ ను పెట్టుకుంటే ఎక్కువ జీతం ఇవ్వాల్సి ఉంటుంది.. తద్వారా కంపెనీ ఎక్కువ ఖర్చు అవుతుందనే నేపథ్యంలో ఫార్మసిస్ట్‌ను పెట్టకుండానే వ్యాపారం చేస్తున్నారు. ఇంటర్ చదివిన వారినీ మెడికల్ స్టోర్ లో పెట్టి తక్కువ జీతం ఇస్తున్నారు. ఇందులో భాగంగా మొన్న మెడ్ ప్లస్ లో ఉద్యోగం చేసే వ్యక్తి చనిపోవడంతో అసలు కథ బయటపడింది. ఫార్మసి చట్టాలకు విరుద్ధంగా ఫార్మసి విద్యను అభ్యసించిన వారిని కాకుండా అనర్హులను జాబ్ లో పెట్టుకుంటున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. మెడ్ ప్లస్ ఫార్మసీలో పనిచేసే వారికి టార్గెట్ లు కూడా పెట్టడంతో కొందరిపై ప్రెజర్ పెరుగుతుంది. మురళీకృష్ణ, (34 సం||లు) అనే వ్యక్తి 769 మెడ్‌ప్లస్ బ్రాంచ్‌లో పనిచేస్తున్నారు. మెడ్ ప్లస్ టార్గెట్లు ఇవ్వగా, ఆ టార్గెట్ పూర్తి చేయాలని ఒత్తిడికి గురై గత నెల 6వ తేదీన (06/06/2024) గుండెపోటుతో ప్రాణాలు కోల్పోవడం చర్చనీయాంశం అయింది.
నెలకు రూ. 12వేల జీతం :
మెడ్ ప్లస్ ఫార్మసీలో పార్మసిస్ట్ లను కాకుండా అతి తక్కువ జీతం ఇచ్చి చిన్న చదువులు చదివిన వారిని ఎంప్లాయిస్ గా రిక్రూట్ చేసుకుంటుంది. ఒకవేళ ఒకటి, రెండు చోట్ల ఫార్మసిస్ట్‌లు ఉన్న వాళ్లకు కనీస వేతనాలు ఇవ్వడంలేదనే ఆరోపణలు ఉన్నాయి. వారికి నెలకు కేవలం రూ.12 వేల నుండి రూ. 13 వేల వరకు జీతం మాత్రమే చెల్లిస్తున్నట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. డ్రగ్ అండ్ కంట్రోల్ ఫార్మసీ చట్టం ప్రకారం, మరియు లేబర్ యాక్ట్ ప్రకారం ఉద్యోగులకు కనీస వేతనాలు చెల్లించాల్సి ఉంటుంది. మెడ్ ప్లస్ ఫార్మసీలో ఆ నిబంధనలు పాటించకపోవడం శోచనీయం. ఈ రకంగా ప్రజలను మోసం చేస్తూ, ధనార్జనే ధ్యేయంగా కొనసాగుతున్న మెడ్‌ప్లస్ హెల్త్ సర్వీసెస్ లిమిటెడ్ సంస్థపై ఇప్పటి వరకు డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు చర్యలు తీసుకోకపోవడం పలు అనుమానాలకు తావీస్తుంది. డిపార్ట్ మెంట్ లో మాముళ్ల మత్తులో పెద్దాఫీసర్లు, ప్రభుత్వ పెద్దలు, పొలిటికల్ సపోర్ట్ తో మెడ్ ప్లస్ దందా జోరుగా సాగుతుందనేది ప్రచారం అవుతుంది.
ఫార్మసీ దందాపై ప్రభుత్వం నిఘా పెట్టాలి
తెలంగాణలో మెడికల్ దందా చేస్తూ కోట్లు సంపాదిస్తున్న ఆయా ఫార్మా కంపెనీలపై ప్రభుత్వం నిఘా పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. డ్రగ్ అండ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్ మెంట్ ప్రతి మెడికల్ షాపు, ఫార్మా కంపెనీలపై దృష్టిసారిస్తే మంచిది. ఫార్మసిస్ట్ లేకుండా మెడ్స్ సంస్థ, ఫార్మ ఎయిడ్ పేరుతో ఫార్మసిలో నాన్-ఫార్మసిస్ట్ చేత వ్యాపారకార్యకలాపలు చేస్తున్నారు. ఆ సంస్థ నడిపే ప్రతి బ్రాంచిలను క్షుణ్ణంగా తనిఖీలు చేస్తే అసలు బాగోతాలు బహిరగతం అవుతాయి. కాబట్టి సామాన్య ప్రజానికం బాగోగుల కోసం డ్రగ్ అండ్ కంట్రోల్ అధికారులు తనిఖీలు చేయాలని ప్రజలు, మేధావులు డిమాండ్ చేస్తున్నారు.
అక్రమంగా కొనసాగుతున్న మెడ్‌ప్లస్ డయాగ్నోస్టిక్ సెంటర్లపై, నేషనల్ ఫార్మాసిటికల్ ప్రైసింగ్ అథారిటీ (ఎన్‌పిపిఏ)కి సంబంధం లేకుండా ఎమ్మార్పీని నిర్ణయించి అమ్ముతున్న మందులపై, ఫార్మసిస్ట్‌లకు, అసిస్టెంట్‌లకు కనీస వేతనాలు చెల్లించకుండా ప్రభుత్వ ఉత్తర్వులను ఉల్లంఘిస్తున్నపలు అంశాలపై పూర్తి సమాచారంతో మరో కథనం ద్వారా మీ ముందుకు తీసుకురానుంది.. ఆదాబ్ హైదరాబాద్.. మా అక్షరం.. అవినీతిపై అస్త్రం…