- తెలంగాణలో నిన్న కురిసిన వాన
- భారీ వర్షాలకు పలుచోట్ల కల్లాల్లో తడిసిన ధాన్యం
- పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం
- మెదక్ జిల్లాలో పిడుగుపాటుకు తాత, మనవడు మృతి
- తెలంగాణకు మరో ఐదు రోజులు వర్ష సూచన
- తడిసిన వడ్లను కొనుగోలు చేయండి
- అధికారులకు సీఎం రేవంత్ ఆదేశాలు
తెలంగాణలో కొద్దిరోజులుగా పలు జిల్లాల్లో కురుస్తున్న చెడు వానలకు చేతికొచ్చిన పంట తడిసి ముద్దైతుంది. మరోవైపు నిన్న (ఆదివారం) కూడా రాష్ట్రంలోని పలుచోట్ల భారీ వర్షం కురిసింది. ఎండాకాలంలో రాష్ట్రంలో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను కోసుకుందామంటే రైతన్నకు దొరకడంలేదు. ఈదురుగాలులు, భారీ వర్షాలకు వరి కోయనిచోట వడ్లు రాలి, పంట నేలకొరిగి తీవ్ర నష్టాన్ని చేకూరుస్తున్నాయి. చేతికొచ్చిన పంటను కోసి ఐకేపీ సెంటర్లు, కల్లాల్లో పోసిన వడ్లు తడిసి వరద నీటిలో కొట్టుకుపోతున్నాయి. సంగారెడ్డి, మెదక్ జిల్లాలో గాలివానతో తీవ్ర నష్టం చోటుచేసుకుంది. పలు ప్రాంతాల్లో ఈదురుగాలులు, భారీ వర్షం అతలాకుతలం చేశాయి. గాలులకు టార్పాలిన్ పట్టలు లేచిపోగా, భారీ వర్షానికి ధాన్యం తడిసిపోయింది. మెదక్ జిల్లా పెద్ద శంకరంపేట మండలి రామోజీపల్లి శివారులో వరిధాన్యం కొనుగోలు కేంద్రం సమీపంలో పిడుగుపడి ఇద్దరు మృతిచెందారు. పిడుగుపాటుకు గురై తాత మనువడు శ్రీరాములు, శివరాజు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అటు, ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం గిమ్మలోనూ పిడుగు పడింది. ఐదుగురికి గాయాలు అయినట్లు తెలుస్తోంది. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. బాధితులను దగ్గరలోని రిమ్స్ కు తరలించారు. ఆసిఫాబాద్ లో ఈదురుగాలులతో కూడిన వర్షం పడడంతో ఎన్నికల సామగ్రి డిస్ట్రిబ్యూషన్ కేంద్రం వద్ద సిబ్బంది ఇబ్బందిపడ్డారు. మరోవైపు తెలంగాణలో మరో ఐదు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి మహబూబ్ నగర్, హైదరాబాద్, నిజామాబాద్, రంగారెడ్డి, ఖమ్మం జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది.
వడ్లను కొనుగోలు చేయండి
రాష్ట్రంలో అకాల వర్షాలకు తడిసిన వడ్లను కొనుగోలు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పలు జిల్లాల్లో కురుస్తున్న అకాల వర్షాలకు ధాన్యం తడిసిపోతుండడంతో సీఎం స్పందించారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిపోతే రైతులు ఆందోళన చెందవద్దని సూచించారు. ఎలాగైనా తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. మెదక్ జిల్లాలో పిడుగుపాటుకు ఇద్దరు మృతి చెందడంపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భాంత్రి వ్యక్తం చేశారు. వారి కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని వెల్లడించారు. తెలంగాణకు మరో ఐదు రోజుల పాటు భారీ వర్ష సూచన ఉన్నందున జిల్లాల్లో కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ ఆదేశించారు.
వాతావరణశాఖ కీలక అప్‌డేట్..!
పార్లమెంట్ నాలుగో విడత ఎన్నికలు తెలంగాణవ్యాప్తంగా జరుగనున్నాయి. కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి సైతం ఉప ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికలకు ఎలక్షన్ కమిషన్ ఏర్పాట్లు చేసింది. ఈ క్రమంలో వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది. రాష్ట్రంలో రాగల నాలుగు రోజులు తెలంగాణవ్యాప్తంగా పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పలుచోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది. సోమవారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తూ వానలు కురిసే అవకాశాలున్నాయని చెప్పింది.