ఉన్నత కుటుంబపు నేపథ్యం వున్నప్పటికీ, ప్రఖ్యాత యూనివర్సిటీ లో విద్యనభ్యసించినప్పటికీ నిరంతర అధ్యయనం చేస్తూ,నూతన మానవ తత్వపు ప్రపంచ శాస్త్రీయ పోకడలను గమనిస్తూ, వామపక్షజాలాన్ని తన జీవిత గమనంగా మార్చుకున్నప్పటికీ అందరివాడిగా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందినవారు,నేటి భారతీయ రాజకీయ ప్రముఖుల్లో ఒకరు సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి.వారు ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ సమస్యతో చికిత్స పొందుతూ దిల్లీ లోని ఎయిమ్స్ లో గురువారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు.జాతీయ స్థాయిలో పార్టీకి మూడు సార్లు సారథ్యం వహించి, విశేష సేవలు అందించిన సీతారాం మన తెలుగు వ్యక్తి కావడం మనకు గర్వకారణం.దాదాపు ఐదు దశాబ్దాలుగా శ్రామికుల,నిరుపేదల ప్రజాసమస్యలపై ప్రజాపక్షమై అరుణోదయ విప్లవ దీపమై యావత్ జీవితాన్ని కమ్యూనిస్టుగా జీవించి,చనిపోయాక కూడా తన పార్థీవ దేహాన్ని వైద్య విద్యార్థులకు బోధన, పరిశోధన అవసరాల కోసం ఎయిమ్స్ కు దానంచేసిన ఏచూరి రాజకీయ సిద్ధాంతాలకు,జీవన విధానాలతో సంబంధం లేకుండా అందరికీ స్ఫూర్తి ప్రదాతే.అందుకే రాష్ట్ర పతి, ప్రధానమంత్రి, విపక్షనేత, వివిధ రాజకీయ పార్టీల ప్రముఖ నేతలు, వివిధ రంగాల ప్రముఖులు సీతారాం మరణం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ,వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వారితో వున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు.
2005 నుంచి 2017 మధ్య 12 ఏళ్ల పాటు రాజ్యసభ సభ్యుడిగా వుంటూ ఉత్తమ పార్లమెంటేరియన్ గా కీర్తి గడించి ప్రజావాణిగా తనదైన పంథాలో తనవాణిని వినిపించారు.సామాజిక ఉద్యమకారుడిగా, రచయితగా, గొప్ప వక్తగా, వామపక్ష సిద్దాంత కర్తగా,నిత్య అధ్యయనశీలిగా వుంటూ, విభిన్న భాషల్లో మంచి ప్రావీణ్యం సంపాదించిన బహుముఖ ప్రజ్ఞాశాలి ఏచూరి.భిన్నత్వమే భారతీయ బలమని జాతీయ సమైక్యతే మనందరి ఆదర్శమని నమ్మి,ఎన్ని ఆటంకాలు ఎదురైనా, కేవలం పదవుల కోసం పార్టీలు మారే నేటితరపు కొందరి రాజకీయ నేతల్లా కాకుండా నైతిక విలువలతో, వ్యక్తిత్వపు సూత్రాలతో దేనికి రాజీపడకుండా వామపక్ష యోధుడుగానే తన చివరిక్షణం వరకు జీవించారు.లౌకిక భారతీయ సమాజం కోసం తనవంతు పాత్ర పోషిస్తూ నేటి ఇండియా కూటమితో సహా సంకీర్ణ రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించారు.1970 ల్లో విద్యార్థి సంఘం నాయకుడిగా ఆరంభమైన ఏచూరి రాజకీయ ప్రస్థానం ఇందిరాగాంధీని ప్రశ్నిస్తూ ఎమర్జెన్సీ రోజుల్లో జైలు జీవితం గడుపాల్సివచ్చింది.అయినా వెనుకడుగు వేయకుండా అంచెలంచెలుగా ఎదిగి కాల పరిణామంలో ఎన్నోకీలక రాజకీయ చారిత్రాత్మక సందర్భాల్లో భాగస్వామి అయ్యారు.ప్రభుత్వ ఆర్థిక విధానాలు, రైతుల కష్టాలు, కార్మికుల ఇబ్బందుల వంటి ఎన్నో తదితర సమస్యలపై తన పార్టీ తరపున అనేక సార్లు బలమైన తన వాణిని వినిపించారు.
హిందూ పురాణాలపై మంచి పట్టు సాధించడమే కాక,ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో సామాజిక, రాజకీయ, ఆర్థిక,మత, సాంఘిక, శాస్త్రీయ తదితర అంశాలపైన విస్తృత అధ్యయనం చేస్తూ సందర్భానుసారంగా అందులోని విశేషాలను తన ప్రసంగాల్లో ప్రస్తావిస్తూ శ్రోతలను విశేషంగా ఆకట్టుకునేవారు.ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం పాత్ర పోషిస్తూ ప్రభుత్వ విధానాలను గుడ్డిగా వ్యతిరేకించడం మాని, ప్రత్యామ్నాయ విధానాలతో ప్రజల విశ్వాసం పొందాలని, మార్పులను స్వాగతించాలని ఏచూరి తరుచుగా హెచ్చరించే వారు.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో భాగంగా ప్రత్యేక ఆంధ్ర, తెలంగాణ ఉద్యమాల్లో కూడా సీతారాం ప్రముఖ పాత్ర పోషించారు.కొంతకాలం సమైక్య వాదాన్ని వినిపించిన, తదనంతరం తెలంగాణ ప్రజల్లో వున్న భావోద్వేగాలను గమనించి రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్ పార్టీ తాత్సార వైఖరి ప్రదర్శిస్తున్న తీరును తప్పుబట్టారు.
ఏచూరి మరణం దేశానికి తీరనిలోటు.1970 లోనే సీబీఎస్ఈ హయ్యర్ సెకండరీ పరీక్షలో ఆలిండియా ర్యాంకర్ గా నిలిచిన ఓ అసాధారణ మేధావి ఏచూరి కలం మరియు గళం ఎర్రజెండా సాక్షిగా ఎంతోమందికి విప్లవోద్యమ పాఠాలు మానవీయ కోణంలో నేర్పుతూనే వుంటాయి.భవిష్యత్ తరాలకు దిశానిర్దేశం చేస్తుంటాయి.’కమ్యూనలిజం వర్సెస్ సెక్యులరిజం ‘,’క్యాస్ట్ అండ్ క్లాస్ ఇన్ ఇండియన్ పాలిటిక్స్ టుడే’, ‘సోషలిజం ఇన్ ఛేంజింగ్ వరల్డ్ ‘ వంటి పుస్తకాల రూపంలో ఆయన ఆలోచనలు,అక్షరాలు కొన్ని లక్షల హృదయాల్లో ఉదయిస్తూనే వుంటాయి.ఓ కమ్యూనిస్టు యోధుడిగా చీకటి జీవితాలకు ఉషోదయ కిరణాలై కాంతిని ప్రసరిస్తాయి.కేంద్రప్రభుత్వం కూడా దేశానికి చేసిన వీరి సేవలను గుర్తిస్తూ భావితరాల స్ఫూర్తి కోసం సీతారాం కు భారత రత్న ప్రకటించడం సమంజసం.రెడ్ సెల్యూట్ సీతారాం.
ఫిజిక్స్ అరుణ్ కుమార్
నాగర్ కర్నూల్
9394749536