అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికల పోరు తుది అంకానికి చేరుకుంది. రేపు (మంగళవారం) అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరుపున మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, డెమోక్రటిక్ పార్టీ తరపున దేశ ఉపాధ్యక్షురాలు కమల హారిస్ ఎన్నికల బరిలో ఉన్నారు. ఈ ఇద్దరిలో ఎవరు ఎన్నికల్లో విజేతగా నిలుస్తారో అని అగ్రరాజ్యం అమెరికాతో పాటు ప్రపంచ దేశాలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.
మరోవైపు ఇప్పటికే 4.1 కోట్ల మంది అమెరికన్లు బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎన్నికల ప్రచారంలో డొనాల్డ్ ట్రంప్ తో పాటు కమలా హారిస్ తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు ఏ చిన్న అవకాశాన్ని కూడా వదలడం లేదు.
శనివారం ట్రంప్ నార్త్ కరోలీనా, వర్జినియా రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.దేశ చరిత్రలోనే గొప్ప విజయం సాధిస్తానని అయిన ధీమా వ్యక్తం చేశారు. ఇక కమల హారిస్ కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.ఈ సంధర్బంగా ప్రసంగిస్తూ, అమెరికాకు నాయకత్వం వహించేందుకు సిద్ధంగా ఉన్నానని, ముందస్తు ఓట్లతో తనను గెలిపించి, దేశానికి కొత్త తరం నాయకత్వాన్ని అందించాలని కోరారు.