Thursday, September 19, 2024
spot_img

ప్లేట్ల బుర్జు ఎంజిఎంఎచ్ లోశ్రమ దోపిడీ

Must Read
  • ఆధునిక ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో పనిచేస్తున్న 224 మంది
  • సెక్యూరిటీ అండ్ పేషెంట్ కేర్ టేకర్స్, పారిశుద్ధ్య కార్మికులుగా విధులు
  • శ్రీ కార్తికేయ సెక్యూరిటీ సర్వీసెస్ ప్రైవేటు ఏజెన్సీ కమిషన్ దందా
  • ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు రూ.2,611 లు టోఫీ
  • జీవో నెం.60 ప్రకారం రూ.15,600ల జీతం
  • ఈఎస్ఐ, పీఎఫ్ కటింగ్ పోగా రూ.13,611 రావాలి
  • ఏజెన్సీ చెల్లిస్తున్న జీతం రూ.11వేలు మాత్రమే
  • సూపరింటెండెంట్ కు మాముళ్లు ఇచ్చేందుకే కటింగ్..!

మన దగ్గరి వాళ్లకు ఏదైనా జబ్బు చేసి దవాఖానాలో చేరారంటే.. మనం చూసేటందుకు వెళ్తే ఒక గంటసేపు కూడా ఉండడం చాలా కష్ట అనిపిస్తుంది. అదే సర్కారు ఆస్పత్రి అయితే మరీ అధ్వాన్నం.. అంతసేపు దవాఖానాలో ఉన్నామంటే మనం కూడా పేషెంట్ గా అందులో చేరిపోయే పరిస్థితి వస్తది. అలాంటిది రోజు 9 నుంచి 10 గంటలు, నెలకు 26 రోజులు, సంవత్సరానికి 317 రోజులు ఏదీ ఏమైనా వాళ్ల ఆస్పత్రికి రావాల్సిందే. ఇదంతా హైదరాబాద్ పాతబస్తీలోని ప్లేట్ల బుర్జు ఆధునిక ప్రభుత్వ ప్రసూతి వైద్యశాలలో పనిచేసే పారిశుద్ధ్య, పేషెంట్ కేర్ టేకర్స్, సెక్యూరిటీ ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల గురించి. వాళ్లకు వచ్చే జీతం తెలిస్తే ముక్కున వేలేసుకోవాల్సిందే. నెల రోజులు కష్టపడి పనిచేస్తే వాళ్లకు వచ్చేది అక్షరాల రూ.11వేల రూపాయలు మాత్రమే. అంటే వారి రోజు కూలి సుమారు రూ.366లు. పట్నంలో వేలకు వేలు పెట్టి రూమ్ కిరాయి తీసుకొని కూరగాయలు, నిత్యావసరాల ధరలు మండిపోతుంటే ఈ జీతంతో వాళ్లు బతుకీడ్చేది ఎట్లా అని ఎవరూ ఆలోచించట్లేదు. ‘మా తాతలు నేతులు తాగారు, మా మూతులు వాసన చూడమన్నట్లు’ ఉన్నది అధికారులు తీరు.

నెల జీతం రూ.15,600 :
వాస్తవానికి జీవో నెం.60 ప్రకారం అన్ స్కిల్డ్ ఎంప్లాయిస్ కు రూ.15,600లు చొప్పున ప్రభుత్వం.. ఔట్ సోర్సింగ్ ఏజెన్సీకి చెల్లిస్తుంది. అందులో ఈఎస్ఐ 0.75%, ఈపీఎఫ్ 12% కటింగ్ చేయగా ఆ మొత్తం రూ.1989లు మైనస్ అవుతాయి. అదేవిధంగా ఎంప్లాయర్ (కంపెనీ) 3.25% ఈఎస్ఐ, 13% ఈపీఎఫ్ కలిపి సదరు ఉద్యోగి పేరు మీద ఆరోగ్యరిత్యా, భవిష్యత్ దృష్ట్యా ఈ మొత్తాన్ని ఈపీఎఫ్, ఈఎస్ఐకి ఔట్ సోర్సింగ్ ఏజెన్సీ చెల్లించాల్సి ఉంటుంది. ఈ అంతా కరెక్ట్ జరిగితే ఒక ఎంప్లాయికి రావాల్సిన నెల జీతం రూ.13,611లు. కానీ వెట్టిచాకిరి చేస్తూ పారిశుద్ధ్య, పేషెంట్ కేర్ టేకర్స్, సెక్యూరిటీ విధులు నిర్వహిస్తున్న కార్మికులకు ఏజెన్సీ చెల్లిస్తున్న జీతం రూ.11,000లు మాత్రమే. ‘బతకలేక బావిలో పడితే కప్పలు కనుగుడ్లు పీకినాయంట’ అన్నట్టు ఆరోగ్యమే లెక్కచేయకుండా ఎదుటి వ్యక్తులకు సహాయం చేస్తే దేవుడు తమకు మంచి చేస్తాడనే ఒకే ఒక్క ఆలోచనతో వారు అన్ని దిగమింగి కొలువు చేస్తుంటే.. శ్రీ కార్తికేయ సెక్యూరిటీ సర్వీసెస్ ప్రైవేటు ఏజెన్సీ మాత్రం వీళ్ల నోట్లో మట్టికొడుతోంది.

శ్రీ కార్తికేయ సెక్యూరిటీ సర్వీసెస్ శ్రమ దోపిడి :
ఓల్డ్ సిటీలోని ప్లేట్ల బుర్జు మెటర్నటీ ఆస్పత్రిలో సెక్యూరిటీ, పేషెంట్ కేర్ టేకర్స్, పారిశుద్ధ్య కార్మికుల సేవలను శ్రీ కార్తికేయ సెక్యూరిటీ సర్వీసెస్ ఔట్ సోర్సింగ్ ఏజెన్సీ అందిస్తుంది. దవాఖానాలో కావాల్సిన ఉద్యోగులను ఔట్ సోర్సింగ్ పద్దతిలో ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం రిక్రూట్ చేసుకొని సర్వీస్ ఇస్తుంది. అయితే ఈ నేపథ్యంలో 224 మంది ఉద్యోగులను భర్తీ చేసుకుని ప్రభుత్వ ఆస్పత్రికి సర్వీసు అందిస్తుంది. అయితే ఉద్యోగుల నుంచి శ్రమదోపిడి చేస్తుంది. నెలకు రూ.2,611 లకు పైగా కట్ చేస్తుంది. ప్రభుత్వం రూ.15,600 చెల్లిస్తుండగా ఔట్ సోర్సింగ్ ఏజెన్సీ మాత్రం కేవలం రూ.11వేలు ఇవ్వడం జరుగుతుంది.

సూపరింటెండెంట్ కు మాముళ్లు ఇవ్వాలె :
పాతబస్తీలోని ప్లేట్ల బుర్జు ప్రసూతి ఆస్పత్రి సూపరింటెండెంట్ రజినీ రెడ్డికి ఏజెన్సీ నెల నెలా కొంత డబ్బులు ఇస్తున్నట్టు చెబుతోంది. ఉద్యోగులకు రూ.2,611 లు కట్ చేస్తున్నందున ఇదే విషయమై ఔట్ సోర్సింగ్ సూపర్ వైజర్ ని ప్రశ్నించగా.. ప్రతినెలా బిల్లు పాస్ చేయాలంటే సూపరిటెండెంట్ పర్సంటేజ్ (మాముళ్లు) ఇవ్వాలె అంటూ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఎంప్లాయిస్ కు సంబంధించిన అటెండెన్స్ గురించి వివరాలు సబ్మిట్ చేసే సమయంలో పనితీరు 100 శాతానికి 96% పర్సెంటేజ్ ఇస్తేనే పూర్తి బిల్లు పాస్ అవుతుంది. లేదంటే 5 నుంచి 10% డబ్బులు కట్ అవుతాయే.. అందుకోసమే సూపరింటెండెంట్ కు ప్రతి నెలా మాముళ్లు ఇవ్వాల్సి ఉంటుందని.. అదీ ఉద్యోగుల జీతాల్లోంచి కట్ చేసి ఇస్తామని ఏజెన్సీ నిర్వాహకులు చెబుతుండడం గమనార్హం.

తమకు ఏజెన్సీ నిర్వాహకులు నెలలో నాలుగు వీక్లీ ఆఫ్ లతో పాటు ప్రతి యేడాదికి 15 సెలవులు, 4 పండుగలు, 4 జాతీయ హాలీడేస్ ఇవ్వాల్సి ఉంటుందని ఈ విషయమై అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్న పట్టించుకోవడం లేదని ఉద్యోగులు వాపోతున్నారు. భాగ్యనగరం నడిబొడ్డున ఉన్న ప్లేట్ల బుర్జు ప్రసూతిలో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు అన్యాయం జరుగుతుంటే హెల్త్ డిపార్ట్ మెంట్ కు సంబంధించిన ఉన్నతాధికారులు సైలెంట్ గా ఉండడం వెనుక ఆంతర్యామేంటో అర్థం కావడంలేదు. శ్రమదోపిడీ చేస్తున్న శ్రీకార్తికేయ సెక్యూరిటీ సర్వీసెస్ పై చర్యలు తీసుకోవాలని ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంపై ఈపిఎఫ్, కార్మిక శాఖ అధికారులు ద్రుష్టి సారించి సెక్యూరిటీ అండ్ పేషెంట్ కేర్ టేకర్స్, పారిశుద్ధ్య కార్మికులకు న్యాయం చేయాలనీ, శ్రమ దోపిడీ చేస్తున్న శ్రీకార్తికేయ సెక్యూరిటీ సర్వీసెస్ యాజమాన్యం పై కఠిన చర్యలు తీసుకోవాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు.

ఈ విషయంపై ఆదాబ్ ప్రతినిధి శ్రీకార్తికేయ సెక్యూరిటీ సర్వీసెస్ ను వివరణ కోరగా, పీనాసి డిపార్ట్మెంట్ జారీ చేసిన జీవో నెం.60 తేదీ 11, జూన్ 2021 మాకు వర్తించదని, కోర్ట్ పరిధిలో ఉందని బుకాయిస్తూ, అసలు విషయాన్ని దాటవేశారు.

Latest News

బీఆర్ఎస్,బీజేపీ పార్టీలకు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు

వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...
- Advertisement -spot_img

More Articles Like This