- సుచరిండియా, వాసవి నిర్మాణ్ సంస్థలకు నిబంధనలకు విరుద్దంగా అనుమతులు
- అక్రమంగా ఇచ్చిన అనుమతులను రద్దు చేయలేమన్న హెచ్ఎండీఏ అధికారులు
- నెలలు గడుస్తున్నా పట్టించుకోని ప్రభుత్వం
- దేవర యంజాల్ చెరువులో 3 కాల్వలు
- పంట కాల్వలు పూడ్చి మరీ లే అవుట్
- 10ఎకరాలకు మాత్రమే ఇరిగేషన్ అధికారుల ఎన్ఓసీ
- కానీ, సుమారు 82 ఎకరాలకు పైగా వెంచర్
- లంచాలు తీసుకోని అనుమతులు, ఎన్ఓసీ ఇచ్చిన హెచ్ఎండీఏ, ఇరిగేషన్ ఆఫీసర్స్
- రైతులు ఫిర్యాదు చేసిన పట్టించుకోని అధికారులు
- వెలుగులోకి తీసుకొచ్చిన ఆదాబ్ హైదరాబాద్ దినపత్రిక
- ముడుపులిచ్చుకో.. కాల్వలు పూడ్చుకో అంటూ వార్త ప్రచురణ
- వరుస కథనాలకు కదిలినట్లు చేసిన అధికార యంత్రాంగం
ప్రభుత్వ, అసైన్డ్ ల్యాండ్ లను అక్రమార్కులకు అధికారులు అప్పనంగా అప్పగిస్తున్నారు. వ్యవసాయ భూములను కొనుగోలు చేసి వాటి స్థానాల్లో వెంచర్లు చేసి గుంటలు, ప్లాట్స్ గా చేసి అమ్ముతున్నారు. అగ్రికల్చర్ ల్యాండ్ ను ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోకుండా పెద్ద పెద్ద వెంచర్లు చేస్తున్నారు. రెవెన్యూ, ఇరిగేషన్, జీహెచ్ఎంసీ, టౌన్ ప్లానింగ్ అధికారులు కూడా బిల్డర్లకు అండగా నిలుస్తున్నారు. ‘కంచేచేను మేసినట్లు’ ప్రభుత్వ అధికారులే లంచం తీసుకొని వ్యవసాయ భూములను వెంచర్లు చేసేందుకు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ జారీ చేస్తున్న పరిస్థితి. డబ్బులకు కక్కుర్తి పడి కుంటలను, కాలువలను యదేచ్ఛగా కబ్జా చేసి లేఅవుట్‌లు చేసుకోవచ్చని భేషరతుగా ఇరిగేషన్ శాఖ అధికారులు ఎన్ఓసీలు ఇచ్చిర్రు.
అసలే అగ్రికల్చర్ ల్యాండ్ ను అక్రమార్కులకు అప్పగించిర్రని ఫిర్యాదు చేస్తే వెరిఫికేషన్ ఆఫీసర్లు సైతం అంతకు తగ్గ బొంత అన్నట్టు వాళ్లు కూడా అమ్యామ్యాలకు అమ్ముడుపోయినట్టు కొడుతుంది. గవర్నమెంట్ నౌకర్ చేస్తూ లక్షల్లో జీతాలు తీసుకుంటూ రియాల్టర్స్ ఇచ్చే బిచ్చపు సొమ్ముకు ఆశపడడం సిగ్గుచేటు.
దేవర యంజాల్ చెరువులో మూడు కాల్వలు, పోతాయపల్లిలో ఓ కాల్వ, మందాయిపల్లి చెరువు ఎఫ్.టీ.ఎల్, బఫర్ జోన్ కబ్జా చేసి పంట కాల్వలు పూడ్చి అక్రమంగా లే అవుట్ ఏర్పాటు చేస్తున్న సుచరిండియా, వాసవి నిర్మాణ్ సంస్థపై చర్యలు తీసుకోవాలెనని అధికారులపై ఒత్తిడి తెస్తే నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. గత నెల 21న ఆదాబ్ హైదరాబాద్ లో ముడుపులిచ్చుకో.. కాల్వలు పూడ్చుకో అనే శీర్షికతో మొదట ఆదాబ్ కథనం రాయడంతో రియాక్ట్ అయిన అధికార యంత్రాంగం ఏదో స్పందించినట్లు నటించింది. అటెనుక ఎక్కడి గొంగళి అక్కడే అన్న చందంగా తొంగున్నరు. వెరిఫికేషన్ ఆఫీసర్లు కూడా నాది కాదు నా అత్తగారు సొమ్ము అన్నట్టు వ్యవహరిస్తున్నారు. సర్కారు ఉద్యోగులమైనా తాము ఒకే తాను పిల్లలం అనుకున్నారో ఏమో గానీ చర్యలకు మాత్రం ఉపక్రమించలేదు. ఈ వ్యవహారంపై పూర్తి ఆధారాలతో ఇరిగేషన్ ఉన్నాతాధికారులకు ఫిర్యాదు చేయగా, అప్పుడు అధికారులు మేల్కొని హెచ్ఎండీఏ అధికారులకు సుచిరిండియా, వాసవి సంస్థ లకు ఇచ్చిన అనుమతులను రద్దు చేయాలని ఇరిగేషన్ శాఖ అధికారులు లేఖ రాయడం జరిగింది. కానీ, హెచ్ఎండీఏ అధికారులు ఇరిగేషన్ శాఖ ఇచ్చిన అనుమతుల రద్దుపై నేటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోకుండా, ఇరిగేషన్ అధికారులు ముందు ఇచ్చిన ఎన్ఓసీ ప్రకారమే అనుమతులు ఇచ్చామని, ఇప్పుడు అనుమతులు రద్దు చేయడం కుదరదని తేటతెల్లం చేశారు. కాగా, క్షేత్రస్థాయిలో పరిశీలించగా ఇరిగేషన్ శాఖ అధికారులు ఇచ్చిన ఎన్ఓసీ కేవలం 10 ఎకరాలకు మాత్రమే.. కానీ రియాల్టర్స్ సుమారు 82 ఎకరాలకు పైగా వెంచర్ చేయడం గమనార్హం. అప్పటి వరకు కూడా ఇరిగేషన్ అధికారులు ఆ వెంచర్‌పై ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం పలు అనుమానాలకు తావీస్తుంది. హెచ్ఎండీఏ అధికారులు, ఇరిగేషన్ శాఖ అధికారులు ఇచ్చిన ఎన్ఓసీ కి విరుద్దంగా సుమారు 82 ఎకరాలకు అనుమతులు ఇవ్వడమే కాకుండా, పూర్తి స్థాయిలో వెంచర్ చేయకున్నా, కొంతమేర భూమి ఇప్పటికి కూడా కొందరు రైతులు సాగు చేస్తున్న, పైనల్ లేఅవుట్ అనుమతులు ఇవ్వడం లోపాయికారి ఒప్పందానికి నిదర్శనం. హెచ్ఎండీఏ డైరెక్టర్ 1 విద్యాదర్, అప్పటి ప్లానింగ్ ఆఫీసర్ యశ్వంత్ రావు, జూనియర్ ప్లానింగ్ ఆఫీసర్ నవళిక, ఇరిగేషన్ అధికారులు సీఈ ధర్మ, ఎస్ఈ హైదర్‌ఖాన్, డిప్యూటి ఇంజనీర్, ఏఈ లు కలిసి రియాల్టర్లు విసిరే ఎంగిళి మెతుకులకు ఆశపడి, భవిష్యత్ తరాలకు ఉపయోగపడే చెరువులను, కాల్వలను రియాల్టర్ మింగేస్తుంటే ప్రేక్షకపాత్రలో ఉండి, వారికి సహకరించడం అత్యంత బాధాకరం.
పంట కాల్వలను పూడ్చి మరీ అండర్ గ్రౌండ్ పైప్ లైన్ వేసినట్టు కండ్లకు కనపడుతుంటే ఎందుకు చర్యలు తీసుకోలేదో వాళ్ల అంతరాత్మకే తెలుసు. ‘ముడుపులిచ్చుకో.. కాల్వలు పూడ్చుకో’ అనే వార్తను మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా తూముకుంట మున్సిపాల్టీలోని దేవర యంజాల్ లో సుచరిండియా, వాసవి నిర్మాణ్ సంస్థ ఆగడాలపై ఆదాబ్ లో రాయడం జరిగింది. దీనిపై ప్రభుత్వ యంత్రాంగం స్పందించి అధికారులు అక్కడికి వెళ్లి వచ్చి పంట కాల్వల పూడ్చివేసి అండర్ గ్రౌండ్ పైప్ లైన్ పనులు పరిశీలించి వచ్చి అంతే వదిలేశారు. ఇన్స్ఫెక్షన్ కు వెళ్లినప్పుడు దేవర యంజాల్ చెరువులో మూడు కాల్వలు, పోతాయపల్లిలో ఓ కాల్వ, మందాయిపల్లి చెరువు ఎఫ్.టీ.ఎల్, బఫర్ జోన్ కబ్జా పంట కాల్వలు పూడ్చి అక్రమంగా లే అవుట్ ఏర్పాటు చేశారనే నిజం తెలిసిన సైలెంట్ అయిపోయారు.
దేవర యంజాల్‌కు సంబంధించిన కాలువ సర్వే నెంబర్ 268, 276, 277, 278, 282, 286 లతోపాటు దేవర యంజాల్‌లోని చిన్నబంధం కుంట సర్వే నెంబర్ 294, 303, 304, 361, 364 ల భూములకు పర్మిషన్స్ ఇచ్చారు. క్షేత్రస్థాయిలో మండల సర్వేయర్ నిర్వహించిన సర్వే ప్రకారం నాలా యొక్క సహజ ప్రవాహం సర్వే నెంబర్ 294, 303, 304, 361, 364 ల గుండా వెళ్తోంది. కానీ, ఈ నాలాను దారి మళ్లించి సర్వే నెంబర్ 288, 289, 290, 291, 292, 305, 306, 308, 309, 311, 312, 313, 322, 323, 326, 327, 328, 329, 331, 332, 362 ల మీదుగా నాలాను పూడ్చివేసి, అండర్‌గ్రౌండ్ పైప్‌లైన్‌ను రోడ్డు మధ్యలో వేయడం విచిత్రంగా ఉంది. ఇంతచేసినా అనుమతులు తీసుకొని చేశారా అంటే ఈ పైప్‌లైన్ కోసం అసలు ఇరిగేషన్ శాఖ నుండి పర్మిషన్ కూడా తీసుకోకపోవడం ఆశ్చర్యం.
రెవెన్యూ, ఇరిగేషన్, హెచ్ఎండీఏ టౌన్ ప్లానింగ్ అధికారులంతా కలిసి అక్రమ లే అవుట్ లు నిర్మిస్తున్న బిల్డర్లు, ఆయా సంస్థల వద్ద భారీగా డబ్బులు దండుకున్నట్లు తెలుస్తోంది. వ్యవసాయ కాల్వలు, చెరువులను చెరబట్టి వాళ్లకు ఎన్ఓసీ, అక్రమ పర్మిషన్లు ఇచ్చిన అధికారులందరినీ సస్పెండ్ చేసి వారి అక్రమ ఆస్తులపై కూడా దర్యాప్తు జరపాల్సిందిగా రైతులు, స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. పంట పొలాలు, వ్యవసాయ భూములలో వెంచర్లు చేసి చెరువు, కాల్వలు కబ్జాచేసి నిర్మాణం చేపడుతున్న సుచరిండియా, వాసవి నిర్మాణ్ సంస్థలపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా స్థానికులు కోరుతున్నారు.