హైదరాబాద్ నుండి గోవా వెళ్ళే పర్యాటకులకు రైల్వే శాఖ తీపి కబురు అందించింది. నగరం నుండి గోవా వెళ్ళే ప్రయాణీకుల కోసం కొత్త రైలు అందుబాటులోకి రానుంది. ఈ నెల 06న ప్రయోగాత్మకంగా ఈ రైలు ప్రారంభిస్తున్నట్టు ప్రకటించింది. ఇక రెగ్యులర్ సర్వీస్ లు అక్టోబర్ 09న సికింద్రాబాద్ నుండి, వాస్కోడగామా నుంచి అక్టోబర్ 10న ప్రారంభమవుతాయని వెల్లడించింది. సికింద్రాబాద్-వాస్కోడగామా ( 17039 ) రైలు ప్రతి బుధ, శుక్రవారం, వాస్కోడగామా – సికింద్రాబాద్ ( 17040 ) రైలు ప్రతి గురు , శనివారం బయల్దేరుతాయని తెలిపింది.
ప్రస్తుతం రెగ్యులర్ ట్రెయిన్ సికింద్రాబాద్-వాస్కోడగామా మధ్య వారంలో నాలుగు రోజులు మాత్రమే నడుస్తోంది. రైలు ( 17063 ) మంగళ, బుధ, శుక్ర, ఆది వారాల్లో అందుబాటులో ఉంటుంది. కానీ ఈ ట్రైన్ కి డిమాండ్ ఎక్కువగా ఉండటంతో కిటకిటలాడుతుంది. హైదరాబాద్ నుంచి వాస్కోడగామాకు మరో రైలు (17021) ఉంది. ఇది అదివారం రోజే నడుస్తోంది. ఈ మార్గంలో డిమాండ్ ఎక్కువగా ఉండటంతో మరో కొత్త రైలును ప్రారంభించాలని రైల్వే శాఖ నిర్ణయించింది.