Friday, September 20, 2024
spot_img

స‌ర్కార్ భూములు ఫ‌ర్ సేల్‌

Must Read

(అమీన్ పూర్‌లో ప్ర‌భుత్వ భూమిని నోట‌రీల‌తో అమ్ముతున్న అక్ర‌మార్కులు)

  • సర్వే నెం. 993లో 423ఎకరాల సర్కారు భూమి
  • కనీసం వంద ఎకరాలు కానరానీ పరిస్థితి
  • తాజాగా 6ఎకరాలను మాయం చేస్తున్న అక్రమార్కులు
  • అప్పట్లో భూమిలేని నిరుపేదలకు ఇచ్చిన గవర్నమెంట్
  • పేదోళ్లకు ఇచ్చిన భూమిని లాగేసుకుంటూ దౌర్జన్యం
  • కబ్జాచేశారంటూ నిర్మాణాలను కూల్చివేసిన అప్పటి ఎమ్మార్వో
  • దొంగ డాక్యుమేంట్లతో కోర్టును తప్పుదోవపట్టించిన‌ కబ్జాదారులు
  • నలుగురు వ్యక్తులు కలిసి 2016లో రిజిస్టర్
  • స‌ర్కార్ భూమిని అమ్ముతుంటే అండగా నిలుస్తున్న ఎమ్మార్వో
  • నోటరీల‌తో అమాయకులకు మోసగిస్తున్న అక్రమార్కులు
  • అక్ర‌మార్కుల‌కు స‌హ‌క‌రిస్తున్న గ‌వ‌ర్న‌మెంట్ ప్లీడ‌ర్ పై దృష్టి సారించండి..

అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు కొందరు అక్రమార్కులు ప్రభుత్వ భూములపై కన్నేసి వాటిని చెరబడుతున్నారు. తప్పుడు ధృవపత్రాలు సృష్టిస్తూ తమదని చెప్పుకుంటూ ప్లాట్లు చేసి అమ్ముకుంటున్నారు. ప్రభుత్వ అధికారులు సైతం వీళ్లకు అండగా నిలువడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణలో చాలా చోట్ల అసైన్డ్ భూములపై అక్రమార్కులు కన్నేసి కాజేశారు. చెట్లు, పుట్టలు, గుట్టలను కబ్జాచేసి ప్రభుత్వ భూములు లేకుండా చేశారు. పాలకుల ఫుల్ సపోర్ట్ తో కిందిస్థాయి లీడర్లు సైతం ఖాళీగా జాగలు కనిపిస్తే చాలు వాటిని ఆక్రమించుకున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో కొన్నిచోట్ల బయటపడుతున్నా, ప్రస్తుత మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేల వద్దకు వెళ్లి కబ్జా ల్యాండ్లు గురించి సెటిల్ మెంట్ చేసుకుంటున్నారు. ఆక్రమణదారులకు ప్రభుత్వ అధికారుల సైతం ఫుల్ సపోర్ట్ చేయడం విశేషం. అటు పాలకులు, ఇటు ఆఫీసర్ల అండతో అక్రమార్కులు రెచ్చిపోతున్నారనేది జగమెరిగిన సత్యం.

అమీన్ పూర్ లో అక్రమార్కుల ఇష్టారాజ్యం :

సంగారెడ్డి జిల్లా మండ‌లం, మున్సిపాలిటీ అమీన్ పూర్, బీరంగూడ విలేజ్ సర్వే నెం. 993 లో మొత్తం ప్రభుత్వం 423 ఎకరాలు ఉంది. ఇందులో ప్రస్తుతం కనీసం 100 ఎకరాల ప్రభుత్వ భూమి, ఆ సర్వే నంబర్లు కనిపించకపోవడం గమనార్హం. కృష్ణారావు, ఎంవీవీ సత్యనారాయణ, బి.గోపాల్, పి.మహిపాల్ రెడ్డి ల అనుచ‌రుడైన‌ ఓ రియాల్టర్ ద్వారా 993 సర్వే నంబర్లు సుమారు ఆరు ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేయడం జరిగింది. అలాగే కబ్జా చేసినటువంటి ప్రభుత్వ భూమిలో ప్లాట్లు చేస్తూ లక్షలాది రూపాయలకు విక్రయిస్తున్నారు. జాగలపై వాళ్లకు ఎలాంటి హక్కులు లేకున్నా దొంగ ప‌త్రాలు సృష్టించి తమవని కలరింగ్ ఇస్తూ 100 గజాలు, 120 గజాలు, 150 గజాలు, 200 గజాల చొప్పున ప్లాట్లుగా మార్చి అమాయక ప్రజలకు అమ్మజూపుతున్నారు. ఈ అమ్మకాలు కూడా నోటరీ ద్వారా అమ్మడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ప్రభుత్వ భూమిని కొనుగోలు చేసి అమాయక ప్రజలు మోసపోతున్నారు.

అసలు రెవెన్యూ రికార్డుల్లో వారి పేర్లే లేవు:

‘ఆశగలమ్మ దోషమెరుగదు… పూటకూళ్లమ్మ పుణ్యమెరుగదు’ అన్న చందంగా అక్రమార్కులకు పైసలపై ఉన్న ఆశతో అక్రమార్గాన్ని ఎంచుకుంటున్నారు. సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ మున్సిపాలిటీలోని బీరంగూడలో సర్వే నెం. 993లోని ప్రభుత్వ భూమిని కబ్జా చేసి, ప్లాట్లుగా మార్చి ప్రభుత్వ భూమిని అమ్ముతున్న వారికి అట్టి సర్వే నంబర్లు రెవెన్యూ రికార్డుల ప్రకారం ఎలాంటి అర్హత లేకున్నా అమ్మడం విశేషం. అక్రమార్కులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా రెవెన్యూ అధికారులు సహకరిస్తున్నట్లు తేటతెల్లం అవుతుంది. మరోవైపు కబ్జాకోరులకు ఎలాంటి అర్హత లేకున్నప్పటికీ ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించి తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి వాటితో డబ్ల్యూపీ నంబర్ 34885/2023 ఫైల్ చేశారు. కాగా కబ్జాదారులు సర్వేనెంబర్ 993/24, 993/29 సర్వే నంబర్లు చూయిస్తూ ప్రభుత్వ భూమిని కబ్జా చేస్తున్నారని అప్పటి తహాసిల్దార్ అక్రమ నిర్మాణాలను తొలగించడం జరిగింది. ఈ తరుణంలో ఉన్నత న్యాయస్థానం నుండి ఉత్తర్వులు ఉన్నప్పటికీ తహాసిల్దార్ పట్టించుకోవడం లేదని కబ్జాదారులే కంటెంట్ పిటిషన్ 198/2024 వేయడం కొసమెరుపు. ఈ నలుగురు ఆక్రమణదారులు ప్రభుత్వ భూమిని 2016లో ఉన్నట్లుగా రిజిస్టర్ డాక్యుమెంట్లు చూపిస్తున్నారు. ప్రభుత్వ భూమిని ఎస్ఆర్ఓ నారాయణఖేడ్ లో సబ్ రిజిస్టర్ డబ్బులకు ఆశపడి ప్రభుత్వ భూమిని ఏకంగా రిజిస్ట్రేషన్ చేశారు.

‘ఎద్దు ఈనిందని ఒకడంటే, దూడను గాట కట్టెయ్యమని మరోకడన్నాడంట’ అసలే వాళ్లు చేసేది దొంగ పని అంటే వాళ్ల పాపంలో మరికొందరూ పాలు పంచుకోవడం విడ్డూరంగా ఉంది. ఎల్ఐజీలో నివాసులుగా ఉన్న బి.గోపాల్, పి.మహిపాల్ రెడ్డి సర్వే నంబర్ 993లో వారికి ఎలాంటి భూ హక్కులు లేకున్నా డబ్ల్యూపీ నెం. 32235/2022, సర్వే నంబర్ 993/24, 993/29 .. చూయిస్తూ బి.గోపాల్, పి.మహిపాల్ రెడ్డి ప్రభుత్వ భూమిని కబ్జా చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. వీళ్ళందరూ కలిసి సుమారు 993 సర్వే నంబర్లు ప్రభుత్వ భూమిని దొంగ డాక్యుమెంట్లతో సుమారు 6 ఎకరాల భూమిని యధేచ్చగా కబ్జా చేస్తున్న రెవెన్యూ అధికారులు పట్టించుకోక పోవడం శోచనీయం. పైగా కోర్టుకు వెళ్ళండి మా గవర్నమెంట్ కూడా మీకు పూర్తిగా సహకరిస్తిదంటూ కబ్జాదారులకు సలహాలిచ్చి కొందరూ నేతలు కుమ్ముకై కోర్టు ద్వారా ఉత్తర్వులు పొందుతున్నట్లు విశ్వసనీయ సమాచారం.

రెవెన్యూ రికార్డ్ ప్ర‌కారం ఎలాంటి ఆధారాలు లేకున్న ఉన్న‌త న్యాయ‌స్థానాన్ని త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్న‌ప్పుడు గ‌వ‌ర్న‌మెంట్ ప్లీడ‌ర్ మ‌రియు రెవెన్యూ ఉన్న‌తాధికారులు ఏం చేస్తున్న‌ట్లు.. అలాంటి కేసులో పిటిష‌న‌ర్ ఉప‌శ‌మ‌నం ఎలా పొందుతాడు.. దీనికి స‌హ‌క‌రించింది ఎవ‌రు.. అనే విష‌యం మ‌రో క‌థ‌నం ద్వారా తీసుకురానుంది..

ఇదీలా ఉండగా.. ఇప్పుడు అసలైన నిరుపేదలకు కేటాయించిన పట్టాదారులు బయటికి వచ్చి రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. అయినా ఎమ్మార్వో పట్టించుకోవడంలేదని కబ్జాదారులకు పూర్తిగా సహకరిస్తున్నారని ఫిర్యాదారులో ఆరోపిస్తున్నారు. ఈ అంశంపై సంగారెడ్డి జిల్లా కలెక్టర్, రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్, అమీన్ పూర్ తహాసిల్దార్ కి ఫిర్యాదు చేశారు.

ప్రభుత్వ భూమిని కబ్జా చేస్తున్న కబ్జాదారులపై క్రిమినల్ కేసులు పెట్టవలసిన రెవెన్యూ అధికారులు ప్రేక్షక పాత్ర వహిస్తూ, నిర్లక్ష్యం చేయడం గమనార్హం. ఇప్పటికైనా ప్రభుత్వం ఈ కబ్జా బాగోతాలపై కఠిన చర్యలు తీసుకొని ప్రభుత్వ భూమిని తిరిగి స్వాధీనం చేసుకోవాలి. అదే విధంగా కబ్జాలకు పాల్పడుతున్న ఇవి సత్యనారాయణ, కృష్ణారావు, మైపాల్ రెడ్డి, బి. గోపాల్ ల‌పై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.

Latest News

బీఆర్ఎస్,బీజేపీ పార్టీలకు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు

వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...
- Advertisement -spot_img

More Articles Like This