దేశంలో గులియన్ బారే సిండ్రోమ్ కలకలం సృష్టిస్తోంది. ఈ కేసులు పెరుగుతుండడం భయాందోళనలను రేకెత్తిస్తోంది రాష్ట్రంలో తొలి గులియన్ బారే సిండ్రోమ్(జీబీఎస్) కేసు నమోదైంది. హైదరాబాద్‌లో జీబీఎస్ కేసును వైద్యులు గుర్తించారు. సిద్దిపేటకు చెందిన మహిళకు జీబీఎస్ లక్షణాలు ఉండడంతో హైదరాబాద్ కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. బాధిత మహిళ వెంటిలేటర్ పై చికిత్స పొందుతోంది. పొరుగు రాష్ట్రమైన మహారాష్ట్రలో ఇదివరకే దాదాపు 100కు పైగా జీబీఎస్ కేసులు నమోదు కావడం ఆందోళనకు గురి చేస్తోంది. బ్యాక్టీరియా, వైరల్ ఇన్ఫెక్షన్ కారణంగా ఇమ్యూనిటీ తక్కువగా ఉన్నవారు ఈ జీబీఎస్ బారిన పడే అవకాశాలు ఉన్నాయని వైద్యులు వెల్లడించారు. శరీరానికి సోకిన ఇన్ ఫెక్షన్ కు ప్రతిస్పందించే రోగ నిరోధక వ్యవస్థ పొరపాటున నరాలపై దాడి చేసే అరుదైన పరిస్థితే ఈ జీబీఎస్. ఈ వ్యాధి బారిన పడిన వారికి ఒళ్లంతా తిమ్మిరిగా మారుతుంది. కండరాలు బలహీనంగా మారిపోతాయి. డయేరియా, పొత్తికడుపులో నొప్పి, వాంతులు వంటి లక్షణాలు కనిపిస్తాయి. జలుబు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటివి కూడా కనిపిస్తాయి. కలుషిత ఆహారం, నీటి ద్వారా ఈ బ్యాక్టీరియా సోకుతుందని డాక్టర్లు చెబుతున్నారు. అయితే జీబీఎస్ అంటువ్యాధి కాదని.. ఎవరూ భయాందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేస్తున్నారు. బాధితులకు సరైన చికిత్స అందిస్తే కోలుకుంటారని చెబుతున్నారు. అయితే దీని చికిత్స చాలా ఖరీదైనదని.. రోగికి ఇచ్చే ఇమ్యునోగ్లోబిన్ ఇంజెక్షన్ ధర ఒక్కొక్కటి వేలల్లో ఉంటుందని చెబుతున్నారు. ఈ వ్యాధి బారిన పడకుండా ఉండాలంటే రోగ నిరోధక శక్తి అధికంగా ఉండాలి. ఎందుకంటే రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికి ఈ వ్యాధి సోకే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ వ్యాధి ప్రభావం వల్ల రోగనిరోధక శక్తి పూర్తిగా దెబ్బతిని నరాల వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుంది.