శనివారం హనుమాన్ జయంతిని పురస్కారించుకొని జనగామ జిల్లా కేంద్రంలోని హనుమన్ రామనాథ సహిత శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో శ్రీ అభయాంజనేయ స్వామి వారికి దేవాలయ ప్రధాన అర్చకులు జ్యోతిష్య రత్న, శిరోమణి, మహర్షి, పురోహిత సార్వభౌమ డాక్టర్ మోహనకృష్ణ భార్గవ ఆధ్వర్యంలో ప్రాతఃకాల ఆరాధనలతో మొదలుకొని నవకలశ స్థాపనలు జరిపారు. భక్తులందరు కలశాలని శిరస్సున ధరించి హనుమత్ నామ స్మరణతో దేవాలయ పరిక్రమణ జరిపారు. అనంతరం శ్రీ అభయాంజనేయ స్వామి వారికి నవకలశాలతో, పంచామృతాలతో, వివిధ ఫలరస, సుగంధద్రవ్యాలతో, ఓషదులతో విశేష అభిషేకం నిర్వహించారు.కన్నుల పండుగగా జరిగిన అభిషేకాన్ని భక్తులందరూ దర్శించి భక్తిపారవశ్యానికి లోనయ్యారు. అనంతరం వేదపండితుల మంత్రోచ్ఛారణల నడుమ స్వామి వారికి చందన విలేపన, అష్టోత్తర శతనామ పత్రపుష్పార్చనలు నిర్వహించారు. తదుపరి మహామంత్రపుష్పం, మహానీరాజనం అందించారు.అనంతరం శాత్తుమురై సేవలు జరిపారు.పూజలో పాల్గొన్న భక్తులందరికీ ప్రధానార్చకులు మోహనకృష్ణ మహాదాశీర్వచనం చేసారు. తదుపరి తీర్థ ప్రసాద వితరణ జరిపారు.ఈ పూజకార్యక్రమంలో గజ్జెల నర్సిరెడ్డి, జక్కా నర్సిరెడ్డి, కందాడి యాదగిరి, మల్లారెడ్డి, యెలసాని కృష్ణమూర్తి, రాంబాబు, కళ్లెం నాగరాజు, పాశం శ్రీశైలం, కుర్రెముల రాంప్రసాద్, తూముకుంట్ల ఉమాకర్, సిద్దిమల్లారెడ్డి, వేనుగోపాల్, కేశవరావ్, సదానందం తదితరులు పాల్గొన్నారు.