ప్రముఖ కొండ ప్రాంతమైన హిమాచల్ ప్రదేశ్(Himachalpradesh)లో భారీగా మంచు(Snowfall) కురుస్తోంది. అక్కడ ఉష్ణోగ్రతలు కనిష్ఠ స్థాయికి పడిపోయాయి. గత మూడు రోజులుగా ఎడతెరిపిలేకుండా మంచు వర్షం కురుస్తూనే ఉంది. దీంతో ఎక్కడ చూసినా మంచు దిబ్బలే దర్శనమిస్తున్నాయి. ఇళ్లు, రహదారులు, వాహనాలు, చెట్లపై భారీగా హిమపాతం పడుతోంది. దీంతో ఆయా ప్రాంతాలు కనుచూపుమేర శ్వేత వర్ణం అలుముకున్నాయి. రాష్ట్రంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతం మనాలీ, రాజధాని సిమ్లా సహా తదితర ప్రాంతాలను మంచు దుప్పటి కప్పేసింది. అక్కడ రోడ్లన్నీ శ్వేతవర్ణాన్ని తలపిస్తున్నాయి. రోడ్లపై భారీగా హిమపాతం పేరుకుపోయింది. దీంతో స్థానిక ప్రజలు, పర్యాటకులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తీవ్రమైన మంచు పరిస్థితుల దృష్ట్యా అధికారులు పలు రహదారులను మూసివేశారు. మూడు జాతీయ రహదారులు సహా 174 రోడ్లను మూసివేసినట్లు అధికారులు మంగళవారం తెలిపారు.