Friday, September 20, 2024
spot_img

ఆగష్టు 15న త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయడమా.? ఆవిష్కరించడమా ?

Must Read
  • ఆగష్టు 15 నాడే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఎందుకు జరపాలి ?

రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యవాదుల నుండి భారతదేశం 1947 ఆగష్టు 15 నాడు స్వేచ్ఛ,స్వాతంత్ర్యాన్ని పొందింది.ప్రతి సంవత్సరం ఆగస్టు 15 నాడు బ్రిటిష్ పాలన నుండి మన దేశం స్వాతంత్ర్యం పొందిందని సూచించడానికి త్రివర్ణ పతాకాన్ని పైకి లాగి ఎగురవేస్తారు.తర్వాత వివిధ రాష్ట్రాల సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు.ఆగష్టు 15 నాడు స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా, మన దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోటలో ప్రధాన మంత్రి,రాష్ట్రాలలో ముఖ్యమంత్రులు రాష్ట్రాల రాజధానులలో తెలంగాణ రాష్ట్రంలో గోల్కొండ కోటలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మువ్వెన్నెల జెండా ఎగురవేయడం జరుగుతుంది.భారత రత్న డాక్టర్.బి.ఆర్.అంభేద్కర్ చే రచింపబడిన రాజ్యాంగం 26 జనవరి 1950 నాడు అమలు లోకి వచ్చింది.ప్రతి సంవత్సరం జనవరి 26 నాడు గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు.జనవరి 26 నాడు జెండా పై భాగాన కట్టి పైకి లాగకుండా విప్పుతారు.దీనినే ఆవిష్కరించడం అంటారు.మన దేశ రాజధాని ఢిల్లీలోని రాజ్ పథ్ లో రాష్ట్రపతి వివిధ రాష్ట్రాల రాజధానులలో ఆ రాష్ట్రాల గవర్నర్లు మన తెలంగాణ రాష్ట్రంలో సికింద్రాబాద్ లోని పరేడ్ గ్రౌండ్లో తెలంగాణ రాష్ట్ర గవర్నర్ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరిస్తారు.

మన దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 78 సంవత్సరాల స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా స్వాతంత్ర్య దినోత్సవ ఉత్సవాలను ఘనంగా నిర్వహించడానికి దేశ వ్యాప్తంగా ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ సందర్భంగా ఈ నాటి విద్యార్థులకు, యువతరానికి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల ప్రాధాన్యత తెలియజేయాల్సిన అవసరం, ఆవశ్యకత తల్లిదండ్రులపై,ఉపాధ్యాయులపై,స్వచ్ఛంద సంస్థలపై, పత్రిక యాజమాన్యం పై ఎంతైనా ఉంది.ఈ రోజులలో బుక్ కల్చర్ పోయి లుక్ కల్చర్ రావడం, ఆంగ్ల వ్యామోహం పెరగడం, కంప్యూటరీకరణ వలన స్వాతంత్ర్య దినోత్సవ, రిపబ్లిక్ దినోత్సవ (గణతంత్ర దినోత్సవ) ప్రాధాన్యత తెలియడం లేదు.స్వాతంత్ర్య దినోత్సవాన్ని, గణతంత్ర (రిపబ్లిక్) దినోత్సవాన్ని జాతీయ పర్వదినాలుగా,జాతీయ పండుగలుగా జరుపుకోకుండా సెలవుదినాలుగా గడిపేయడం ఆందోళన కరమైన విషయం.

స్వాతంత్ర్య దినోత్సవ, గణతంత్ర (రిపబ్లిక్) దినోత్సవ వేడుకల సందర్భంగా ఎగరవేసే త్రివర్ణ పతాకాన్ని మన తెలుగు రాష్ట్రాలకు చెందిన పింగళి వెంకయ్య రూపొందించడం మన దేశ వ్యాప్తంగా తెలుగు రాష్ట్రాలకు ఎంతో గర్వకారణం.ప్రతిజ్ఞ తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లాకు చెందిన పైడిమర్రి సుబ్బారావు రాయడం ఎంతో గర్వకారణం.అభినందనీయం మన దేశం రెండు వందల సంవత్సరాలు బ్రిటిష్ పాలకుల పాలనలో మగ్గిన తరువాత అనేక మంది స్వాతంత్ర్య సమరయోధులు పోరాటాలు, ఉద్యమాలు, త్యాగాలు, బలిదానాల ఫలితంగా స్వాతంత్ర్యాన్ని సాధించగలిగాము.గాంధీ,నెహ్రూ లాంటి శాంతి యోధులు,భగత్ సింగ్,చంద్రశేఖర్ ఆజాద్, సుభాష్ చంద్రబోస్ (నేతాజీ) లాంటి విప్లవ యోధులు,ఝాన్సీ లక్ష్మీబాయి వంటి వీర వనితలు ఎంతో మంది తమ ప్రాణాలను, ఆస్తులను, అంతస్తులను, భవిష్యత్తును లెక్కచేయకుండా వివిధ పద్ధతుల్లో ముఖ్యంగా శాంతి, అహింస,విప్లవ పద్దతుల్లో వీరోచితంగా, విరామం లేకుండా తుపాకీ గుళ్ళకు, లాఠీ దెబ్బలకు, జైలు శిక్ష లకు భయపడకుండా ప్రాణాలను తృణప్రాయంగా భావించి చేసిన పోరాటాలు, ఉద్యమాల ఫలితమే ఈ రోజు మనం అనుభవిస్తున్న స్వేచ్ఛ, స్వాతంత్ర్యం.

ఈనాటి విద్యార్థులకు ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధన చేసి విదేశాలకు వెళ్లి డాలర్ లోకంలో విహంగ వీక్షణ చేయడం తప్ప దేశభక్తి, దేశం పట్ల గౌరవం, దేశం పట్ల ప్రేమ, ఆప్యాయత, అనురాగం, ఆత్మీయత, అభిమానం, అనుబంధం లేకపోవడం విచారించదగిన విషయం.ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధన మన దేశంలో చదివి విదేశాల్లో ఉన్నత చదువుల కోసమని వెళ్లి అక్కడే ఉద్యోగాలు చేస్తూ డాలర్ లు సంపాదించడమే తమ జీవిత ధ్యేయంగా లక్ష్యంగా భావిస్తున్నారు.తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి మన దేశ గొప్పదనాన్ని మన దేశ సంస్కృతి సంప్రదాయాలు ఆచార వ్యవహారాల గురించి తెలియజేయకపోవడం చిన్నప్పటి నుండి కాన్వెంట్ చదువులంటూ జేఈఈ మెయిన్స్, ఐఐటీ, సాప్ట్ వేర్ అంటూ మన దేశ స్వాతంత్య్రం సిద్దించడానికి స్వాతంత్ర్య సమర యోధులు చేసిన త్యాగాలను చెప్పడం లేదు.ఆర్టీసి బస్సులలో కండాక్టర్లకు అవగాహన లేక స్వాతంత్ర్య దినోత్సవం జాతీయ పర్వదినం అని తెలియక విద్యార్థులను బస్సులలో అనుమతించడం లేదు.ఈ రోజు సెలవు దినం అంటూ రూట్ బస్సు పాస్ నడవదని బస్సులో నుండి దిగిపోండి లేదా టికెట్ తీసుకోమని బలవంతం చేస్తున్నారు.మన దేశానికి ఆర్యులు, పర్షియన్ లు, ఇరానీ లు,పార్శీలు, మొఘలులు, ప్రెంచ్ వారు వ్యాపార నిమిత్తం వచ్చిన ఈస్ట్ ఇండియా కంపెనీ వారు తర్వాత బ్రిటిష్ వారు రవి అస్తమించని సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసి 200 సంవత్సరాలు అన్యాయంగా, అక్రమంగా,దౌర్జన్యం గా అనేక రకాల పన్నులు వసూలు చేస్తూ పరిపాలన చేశారు.

78 వ స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా జాతీయ నాయకుల ఫోటోలు తీసుకొని రావడానికి స్టేషనరీ షాపులకు, బుక్ డిపోలకు వెళ్లి జాతిపిత గాంధీజీ (గాంధీ మహాత్ముడు) ఫోటోను అడిగితే టోపీ వాల,ముచ్చడ్ (మీసాలు)వాల అంటూ భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్ ఫోటోలు చూపిస్తున్నారు.సుభాష్ చంద్రబోస్,మదన్ లాల్ డెంగ్రా,కర్తార్ సింగ్ సరభ, రాజ్ గురు,సుఖ్ దేవ్, శివరాం,లాలాలజపతిరాయ్, బాలగంగాధర తిలక్,బిపిన్ చంద్ర పాల్,అస్ఫక్ ఉల్లాఖాన్,ఖుదీరాంబోస్, సుభాష్ చంద్రబోస్,మంగల్ పాండే, చిత్తరంజన్ దాస్, రాంప్రసాద్ బిస్మిల్, ప్రకాశం పంతులు, అల్లూరి సీతారామరాజు ఇంకా అనేక మంది స్వాతంత్ర్య సమర యోధుల ఫోటోలు ఉండడం లేదు.స్వాతంత్ర్యోద్యమంలో స్త్రీ, పురుషులు, కుల,మత,ప్రాంత,వర్గ,వర్ణ, భాష బేధాలు లేకుండా తమ విద్యను,జీవితాలను త్యాగం చేశారు.స్వాతంత్ర్య పోరాటం లో మహిళలను చూస్తే ఝాన్సీ లక్ష్మీబాయి, సరోజినీ నాయుడు, దుర్గాబాయి దేశ్ ముఖ్,సుచేత ముజేందర్,అరుణ అసఫ్ అలీ, చెన్నమ్మ, మేడం బికాజి కామా, బేగం అజత్ మహతి, రుద్రమదేవి మొదలైన అనేక మంది ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాడి సాధించుకున్న స్వేచ్ఛ, స్వాతంత్ర్య ఫలం

స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యార్థులలో దేశభక్తిని పెంపొందించడానికి దేశభక్తి సినిమాలను సినిమా థియేటర్లలో ప్రదర్శింపజేసి ఉచితంగా విద్యార్థులకు, ఉపాధ్యాయులకు అనుమతించాలి.దేశభక్తిని పెంపొందించే గేయాలు, పాటలు, నాటకాలు, ఏకపాత్రాభినయాలు, నాటిక లలో పోటీలను నిర్వహించి వారికి బహుమతులను ఇచ్చి ప్రొత్సాహించాలి. స్వాతంత్ర్య సమర యోధులను సన్మానించడం, స్వాతంత్ర్య సమర యోధుల ఇంటర్వూ లను విద్యార్థుల చేత చదివించడం, ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియా ద్వారా వారికి చూపించి విద్యార్థులలో దేశభక్తిని పెంపొందించడానికి కృషి చేయాలి.

స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలల్లో, కళాశాలల్లో, విద్యాసంస్థల్లో కార్యాలయాల్లో జాతీయ పతాకావిష్కరణ చేయాలనే నిబంధనలు అమలులో ఉన్నాయి.కొన్ని ప్రయివేటు పాఠశాలలు, కళాశాలలు, విద్యాసంస్థలు స్వాతంత్ర్య దినోత్సవం నాడు సెలవు దినంగా ప్రకటిస్తున్నారు.కొన్ని విద్యా సంస్థలు జాతీయ పతాకావిష్కరణ చేసి ఎలాంటి ఉపన్యాసాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించకుండా వెళ్లి పోతున్నారు. అలాంటి విద్యా సంస్థలపై కేంద్ర, రాష్ట్ర, ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకొని విద్యా సంస్థల అనుమతులు రద్దు చేయాలని ప్రజలు కోరుతున్నారు.

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా కళకళలాడుతున్న మార్కెట్లు

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా త్రివర్ణ పతాకాలు, త్రివర్ణ జెండాలు, త్రివర్ణ బెలున్లు, త్రివర్ణ రిబ్బన్ లు, త్రివర్ణ కాగితాలతో స్వాతంత్ర్య సమరయోధుల ఫొటోలతో మార్కెట్లన్ని కళకళలాడుతున్నవి.ఎన్నికల సమయంలో రాజకీయ నాయకులు అందరూ పాల్గొంటున్నారు. ఎన్నికలు లేకుంటే జాతీయ పతాకావిష్కరణ చేయడం లేదు.తెలంగాణ లో త్వరలో స్థానిక ఎన్నికలు ఉన్నందున అన్ని పార్టీల నాయకులు 78 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించడానికి పెద్ద ఎత్తున ఏర్పాట్లు పూర్తి చేశారు.
గతంలో చౌరస్తాలలో ప్రభుత్వ, ప్రయివేటు కార్యాలయాలలో దేశభక్తి గీతాలు మైకులలో వినబడి దేశభక్తి నరనరాన కన్పించేది.ప్రస్తుత పరిస్థితులలో సినిమా పాటలు, ప్రయివేటు పాటలను మైకులలో వినిపిస్తున్నారు.తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, స్వచ్ఛంద సంస్థలు, స్థానిక నాయకులు విద్యార్థులలో, ప్రజలలో దేశభక్తిని పెంపొందించడానికి కృషి చేయాలి.

దేశభక్తి పట్ల అవగాహన పెంపొందించాలి.స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను, బలిదానాలను వీరత్వాన్ని గుర్తు చేసుకోవలసిన అవసరం ఆవశ్యకత బాధ్యత ఎంతైనా ఉంది.ఆగష్టు 14 అర్ధరాత్రి బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని వదిలి వెళ్లి పోయారు.ఆగష్టు 15 నాడు భారతదేశం స్వేచ్ఛ, స్వాతంత్ర్య దేశంగా మారింది.1947 ఆగష్టు 15 నుండి నేటి వరకు 78 సంవత్సరాల నుండి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను కుల, మత, ప్రాంత, వర్గ, వర్ణ,భాష, స్త్రీ,పురుష భేదం లేకుండా ప్రపంచం లో భారతీయులు ఎక్కడ ఉన్నా జాతీయ పర్వదినం (పండుగ దినం)గా జరుపుకుంటున్నాము.

డాక్టర్. ఎస్. విజయ భాస్కర్.,
9290826988

Latest News

బీఆర్ఎస్,బీజేపీ పార్టీలకు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు

వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...
- Advertisement -spot_img

More Articles Like This