కరువులు దేశాభివృధ్ధికి అడ్డంకిగా నిలుస్తున్నాయి. అడవుల నిర్మూలన, కరువు, వాతావరణం ప్రతికూలతలు, మానవుని చర్యల వలన సారవంతమైన భూమి బంజరుభూమి అంటే ఏ పంటలూ పండడానికి వీలు లేకుండా ఏడారులుగా తయారవుతున్నాయి. ఏదైనా ప్రాంతంలో ఎక్కువ కాలం వర్షాలు కురవక పండవలసిన పంటలు పండకపోతే దానిని కరువు అంటారు. ఏ ప్రాంతంలోనైనా సగటు వార్షిక వర్షపాతం 25 శాతం కంటే తక్కువగా ఉంటే ఆ ప్రాంతంలో కరువు స్థితిలో ఉన్నట్లుగా భారత వాతావరణ శాఖ చెపుతుంది. సగటున భారతదేశం 118 సెం.మీ వార్షిక వర్షపాతాన్ని పొందుతుంది. సగటు స్థాయి కంటే 25 నుండి 50% మధ్య వర్షపాతం ఉంటే మితమైన కరువు, సగటు కంటే 50% ఎక్కువ వర్షపాతం తగ్గినప్పుడు తీవ్రమైన కరువు ఏర్పడుతుంది. చాలా కాలం పాటు తగినంత వర్షపాతం లేనప్పుడు వాతావరణ కరువు, నేలలో తేమ, వర్షపాతం లేనప్పుడు వ్యవసాయ కరువు, సరస్సులు, జలాశయాలు, వివిధ రిజర్వాయర్‌లు లేదా నిల్వలలో ఉండవలసిన నీటి మట్టం కంటే దిగువకు పడిపోయినప్పుడు,నీటి కొరత వల్ల జలకరువు, తగినంత నీటి సరఫరా లేని కారణంగా సహజ పర్యావరణ వ్యవస్థ యొక్క ఉత్పాదకత తక్కువగా ఉన్నట్లయితే పర్యావరణ కరువులు ఏర్పడతాయి. స్వాతంత్ర్యం తరువాత మనదేశం 1965 – 67, 1972 – 73, 1979 – 80, 1985 – 88 సంవత్సరాలలో పెద్ద కరువులను ఎదుర్కొంది. ఎడారికరణ కరువు రెండూ ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటాయి.
కారణాలు:
మనదేశంలో అల్పపీడనాలు లేకపోవడం, బలహీన రుతుపవనాలు, సగటు కంటే తక్కువ వర్షపాతం, ముందస్తు రుతుపవనాల ఉపసంహరణ లేదా ఆలస్యంగా రుతుపవనాల ప్రారంభం, రుతుపవనాలలో సుదీర్ఘ విరామాలు లాంటి వాతావరణ కారణాలు కరువుకు కారణమవుతున్నాయి. వాతావరణంలో వచ్చిన ఆకస్మిక మార్పులు, పశువులకు ఇతర జంతువులకు మేత కొరకు ఎక్కువ పచ్చికను వినియోగించడం, అటవీ నిర్మూలన, సహజ వృక్ష సంపదను దుర్వినియోగపరచడం, ఒకే పంటను దీర్ఘకాలికంగా పడించడం వంటివి ఎడారికరణ, కరువులుకు కారకాలుగా ఉంటుంటున్నాయి. ఐక్యరాజ్యసమితి సమాచారం మేరకు ప్రపంచ వ్యాప్తంగా 2000 సంవత్సరం నుండి కరువులు 29 శాతం పెరిగాయి. 230 కోట్ల మందికి త్రాగడానికి మంచి నీరు లేదు. ఇవే పరిస్థితులు కొనసాగితే 2040 సం. నాటికి 25 శాతం పిల్లలు నీటి కొరతను ఎదుర్కొంటారు. 2050 సం. నాటికి ప్రపంచ జనాభాలో 75 శాతం కరువుకు లోనవుతారు. ఇక మన దేశ విషయానికొస్తే వ్యవసాయం ఎక్కువగా రుతుపవనాల వర్షపాతంపై ఆధారపడి ఉంటుంది. వ్యవసాయ యోగ్యమైన భూమిలో దాదాపు మూడింట రెండు వంతులు వర్షాధారం పైనే ఆధారపడి ఉంది. మొత్తం భౌగోలిక ప్రాంతం 32.872 కోట్ల హెక్టార్లలో 29.7 శాతం అంటే సుమారు 9.785 కోట్లు హెక్టార్లవిస్తీర్ణం భూక్షీణతకు గురైంది. మొత్తం విస్తీర్ణంలో 16 శాతం, జనాభాలో 12 శాతం మంది కరువు బారిన పడుతున్నారు. మొత్తం సగటు కరువు పీడిత ప్రాంతం 10 లక్షల చదరపు కి.మీ లేదా దేశంలోని మొత్తం భూభాగంలో మూడింట ఒక వంతుగా ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు. నీతి అయోగ్ ప్రకారం ప్రతీ సంవత్సరం 1.2 కోట్ల హెక్టార్ల విస్తీర్ణం కరువు ఎడారి కారణంగా నష్టపోతున్నాయి. ఇక్కడ 2 కోట్ల టన్నుల ధాన్యం పండించవచ్చు. రాజస్థాన్ లో 2.123 కోట్ల హెక్టార్ల ఎడారి భూమి ఉండగా మహారాష్ట్ర, గుజరాత్ లో వరుసగా 1.43 కోట్ల హెక్టార్లు, 10.2 లక్షల హెక్టార్ల క్షీణించిన భూమి ఉంది. ఇస్రో స్పేస్ అప్లికేషన్ సెంటర్ నివేదిక ప్రకారం భారత్‌లో 90 శాతం రాష్ట్రాల్లో ఎడారీకరణ విస్తరించింది. దీంతో వ్యవసాయ రంగం కుదేలైపోతోంది. భారత్‌లో మొత్తం 29 రాష్ట్రాలకుగాను 26 రాష్ట్రాల్లో గత పదేళ్లలో ఎడారి ప్రాంతం బాగా పెరిగింది. రాజస్థాన్, ఢిల్లీ, గోవా, మహారాష్ట్ర, జార్ఖండ్, నాగాలాండ్, త్రిపుర, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో రోజురోజుకీ సారవంతమైన భూములు తగ్గిపోతున్నాయి. మిజోరంలో లంగ్లే ప్రాంతంలో అధికంగా నేల పెళుసుబారుతుంది. 2003 నుండి 2011 మధ్యలో అత్యధికంగా18 లక్షల హెక్టార్ల భూమి ఎందుకూ పనికిరాకుండా పోయింది. ఆంధ్రప్రదేశ్‌లో 14.35 శాతం, తెలంగాణలో 31.40 శాతం భూములు నిరుపయోగంగా మారాయి. ఉమ్మడి అనంతపురం జిల్లా, ఉమ్మడి నల్లగొండ జిల్లాలో అధికంగా ఎడారీకరణ జరుగుతోంది.
కరువు ఫలితాలు:
ఈ కరువుల వలన వృక్ష సంపద నాశనం అవుతుంది. నేలకోతకు గురవుతుంది. నేల వంధ్యత్వంకి లోనవుతుంది. నీరు కలుషితం అవుతుంది. కొన్నిరకాల జాతులు నశించి జీవవైవిధ్యం దెబ్బవుతుంది. ఈ కరువుకు సమాజంలోని బలహీన వర్గాలు ఎక్కువగా ప్రభావితం అవుతారు. పేదరికం పెరుగుతుంది. కరువు ఫలితంగా సాగు విస్తీర్ణం తగ్గి వ్యవసాయోత్పత్తి తగ్గుతుంది. ప్రజల కొనుగోలుశక్తి తగ్గుతుంది. వ్యవసాయ కార్మికులకు ఉపాధి తగ్గుతుంది. తాగునీరు, పశుగ్రాసం, ఆహార కొరత ఏర్పడుతుంది. ఇది దేశ జిడిపి మీద ప్రభావం చూపి ద్రవ్యోల్బణానికి కారణమవుతుంది. అక్కడ ప్రజలు పోషకాహార లోపానికి గురవుతారు. ప్రజలు జీవనోపాధి కోసం ఇతర ప్రాంతాలకు వలసలు పోతారు. ఆహార భద్రత సమస్యలు ఏర్పడతాయి. దేశ ఆర్థికాభవృద్ధి జరుగదు.
పరిష్కారాలు:
నదులను అనుసంధానం చేయాలి. మరిన్ని రిజర్వాయర్లు, ఆనకట్టల నిర్మాణానికి రూపకల్పన జరగాలి. కరువు నిరోధక పంటలను ప్రోత్సహించాలి. అడవులను కాపాడుకోవాలి. వృక్షాలను పెంచడం, పచ్చదనం పెంపు చేయాలి. వర్షపు నీటి సంరక్షణ భాగంగా వర్షంనీరు నదులు సముద్రాలలో కలసిపోకుండా చెక్ డ్యామ్ లను నిర్మించాలి. నేల స్థిరీకరణ కోసం షెల్టర్ బెల్టలను , ఉడ్లాట్లను ఉపయోగించాలి. వుడ్‌లాట్ అనేది చెట్ల యొక్క చిన్న ప్రాంతం. వుడ్‌లాట్‌లు నేల కోతను నిరోధించడంలో స్థానిక వాతావరణాన్ని మెరుగుపరచడంలోను, గాలిని శుద్ధి చేయడంలో కూడా సహాయపడతాయి. భూసార పరిరక్షణ, జీవ వైవిధ్యం పెంపుతో పాటుగా వ్యవసాయ భూములలో గృహాలు, పెద్ద పెద్ద భవనాలు నిర్మాణాలు చేయకూడదు. పరిమితికి మించి వ్యవసాయ బోర్లు త్రవ్వగూడదు. అలాగే గృహాలలో మంచి నీటి బోర్లను అవసరానికి మాత్రమే వేయాలి. మన దేశంలో ఇప్పటికే కమాండ్ ఏరియా డెవలెప్మెంట్, ఇంటిగ్రేటెడ్ వాటర్ షెడ్ మేనేజ్మెంట్ ప్రోగ్రాం , జాతీయ కార్యాచరణ కార్యక్రమం లాంటివి అమలులో ఉన్నాయి.
- జనక మోహన రావు దుంగ
- 8247045230