- కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్
వికారాబాద్ జిల్లా పూడూరు మండలం దామగుండం అటవీ ప్రాంతంలో భారత నేవీకి సంబంధించిన రాడార్ కేంద్రానికి మంగళవారం కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , కేంద్రమంత్రులు బండిసంజయ్, కిషన్ రెడ్డి, తెలంగాణ శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ , నేవీ అధికారులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో కేంద్ర రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ, అబ్దుల్ కలాం జయంతి రోజు రాడార్ స్టేషన్ ను శంకుస్థాపన చేయడం సంతోషంగా ఉందని తెలిపారు. రాజకీయాలకు అతీతంగా దేశ అభివృద్దిలో అందరూ కలిసి ముందుకెళ్లాలని సూచించారు. ఈ ప్రాజెక్ట్ నిర్మాణానికి అన్ని విధాలా సహకరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అభినందనలు తెలిపారు. దేశ అభివృద్దిలో తెలంగాణ కీలకంగా మారిందని, రక్షణరంగ పరికరాల తయారీలో హైదరాబాద్ నగరానికి గొప్ప పేరుందని అన్నారు. దేశ రక్షణ,భద్రత విషయంలో ఎలాంటి ఒత్తిళ్లు వచ్చిన వెనక్కి తగ్గం అని, వీఎల్ఎఫ్ ద్వారా స్థానికులపై ఎలాంటి చెడు ప్రభావం ఉండదు అని అన్నారు.