Tuesday, February 4, 2025
spot_img

కాంగ్రెస్ పై నమ్మకం ఉంది

Must Read
  • బీసీలు, మహిళలకు పార్టీలో సముచిత స్థానం
  • రాజకీయ జీవితంలో ఎన్నో ఎత్తు పల్లాలను చవి చూశాను
  • సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న కార్యక్రమాలు మెడిసిన్ లాంటివి
  • చేదుగా ఉన్నప్పటికీ.. రాబోయే తరాలకు ఎంతో ప్రయోజనం
  • మహేష్ గౌడ్ అధ్యక్షతన పార్టీ మరిన్ని విజయాలు ఖాయం
  • ఆదాబ్ హైదరాబాద్ ప్రత్యేక ఇంటర్వ్యూ లో కాంగ్రెస్ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు సునీతారావు

ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ, జాతీయ మహిళా స్ఫూర్తి నాయకురాలు ప్రియాంక గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అద్బుతంగా పనిచేస్తోందని మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు మొగిలి సునీతారావు పేర్కొన్నారు. బుధవారం ఆదాబ్ హైదరాబాద్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూ లో ఆమె మనసులో మాటలను బయటపెట్టారు. గడిచిన ఏడాది కాలంగా సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు అద్బుతమైన పాలన అందించారని అన్నారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన గత పాలకుల కబంధ హస్తాల నుంచి రాష్ట్రాన్ని కాపాడే బాధ్యతను తీసుకున్న ముఖ్యమంత్రి అపర భగీరధుడై నిర్వీరంగా శ్రమిస్తున్నారని పేర్కొన్నారు. ప్రతి పక్షాలు పసలేని విమర్శలు పనిగట్టుకుని చేస్తున్నారని, ప్రజలు అన్నింటిని నిశితంగా గమనిస్తున్నారని సునీతా రావు చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి చేపడుతున్న కార్యక్రమాలు, తీసుకుంటున్న నిర్ణయాలు మెడిసిన్ లాంటివని, చేదుగా ఉన్నప్పటికీ రాబోవు తరాలకు కచ్చితంగా ప్రయోజనం చేకూర్చి తీరుతుందని ఆమె అన్నారు. కాంగ్రెస్ పార్టీలో మహిళలకు నాడు, నేడు ఎన్నో అవకాశాలు లభించాయని చెప్పుకొచ్చిన ఆమె కాంగ్రెస్ పార్టీపై తనకు పూర్తి నమ్మకం విశ్వాసం ఉందని చెప్పుకొచ్చారు.

రాష్ట్ర మహిళా అధ్యక్షురాలిగా ఉన్నారా..?
అవును ప్రస్తుతం నేనే తెలంగాణ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలిగా కొనసాగుతున్నాను.. సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షురాలు మార్పును కోరుకుంటే రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు మార్పు జరుగుతుంది.

మీకు ఎలాంటి ప్రాధాన్యత ఉండబోతుంది..?
గడిచిన 30 ఏండ్లుగా రాజకీయ పోరాటాల్లో చురుగ్గా పాల్గొన్నాను. ప్రజల పక్షాన ఎన్నో పోరాటాలు చేశాను. సమాజంలో, పార్టీలో, రాష్ట్రంలో, కుటుంబంలో ఒక మంచి నాయకురాలిగా గుర్తింపు ఉంది. రాష్ట్ర మహిళా అధ్యక్షురాలిగా గత పాలకుల నిరంకుశ వైఖరికి నిరసనగా మహిళా నేతలతో కలిసి ఎన్నో పోరాటాలు చేశాను. అవమానాలు పడ్డాను. 10 ఏండ్ల తర్వాత తిరిగి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఈ సమయంలో బాధ్యత కలిగిన నాయకులను పార్టీ , ప్రభుత్వం విస్మరించదనే నమ్మకంతోనే ఉన్నాను. నాకు పార్టీ సముచిత స్థానం ఇచ్చి గౌరవిస్తుందనే నమ్ముతున్నాను.

కాంగ్రెస్ పాలన రాష్ట్రంలో ఎలా ఉంది ..?
గత పాలకులు రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చేశారు. నిక్కచ్చిగా చెప్పాలంటే ప్రతి వ్యక్తిపై 3 లక్షల అప్పుల భారం ఉంది. నిజానికి అర్హులైన పేదవాళ్లకు సంక్షేమ పథకాలు అందాలి. వారి జీవితాల్లో వెలుగులు నిండాలి. దానికి విరుద్ధంగా గత పాలకుల పరిపాలన సాగింది. ఒక మాజీ మంత్రికి రైతు బందు కోట్లలో అప్పటి ప్రభుత్వం దోచి పెట్టింది. ఇలా గత పాలకులు సంపన్నులకు దోచిపెట్టి రాష్ట్ర ఖజనాను ఖాళీ చేశారు.. ప్రభుత్వం ఇప్పుడే అన్ని సర్దుకుంటుంది. రాబోయే కాలంలో రాష్ట్రంలో మంచి ఫలితాలు వస్తాయని నమ్మకం ఉంది.

పథకాలపై ప్రతిపక్షాల విమర్శలు ఎలా చూడాలి..?
కాంగ్రెస్ ప్రభుత్వం అర్హులైన పేదవాళ్లకు పలు సంక్షేమ పథకాల అమలుకు శ్రీకారం చుట్టింది. మేము ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలు నిలబెట్టుకుంటాం. వాటికీ కొంత సమయం పడుతుంది. ఇచ్చిన హామీలను రాత్రికి రాత్రే అమలు చేయమంటే ఎలా… గత పాలకులు ఉద్యోగులకు కనీసం ఒకటో తారీకు జీతాలు కూడా ఇవ్వలేదు. ప్రభుత్వ ఆసుపత్రులు శిథిలావస్థకు చేరుకున్నాయి. విద్యార్థుల ఉపకార వేతనాలు పెండింగ్ లోనే ఉన్నాయి. పాఠ్య పుస్తకాల కొరత, ఉపాధ్యాయుల కొరత సమస్యగానే ఉంది. సీఎం అన్ని అంశాలను పరిశీలించి ఒక్కొక్కటిగా పూర్తి చేస్తున్నారు. డబుల్ ఇండ్లు కట్టించామని గత పాలకులు గొప్పలు చెప్పుకుంటున్నారు కదా. మరి లబ్ది దారులకు ఎందుకు ఇవ్వలేదు.. నాసిరకం ఇండ్లు కట్టి ప్రజాధనాన్ని గత పాలకులు దుర్వినియోగం చేశారు. ప్రభుత్వం అన్ని వాగ్దానాలను నెరవేర్చుతుంది.

ప్రభుత్వం మీద వ్యతిరేకత మొదలయ్యిందని చెప్పుకుంటున్నారు.?
ఇటీవల కాలంలో ఎవరికీ వాళ్లే స్వంత సోషల్ మీడియాను ఏర్పాటు చేసుకుని ప్రత్యర్థులపై విమర్శలు ఎక్కు పెడుతున్నారు. లేనివి ఉన్నట్లు అబద్దాలను కట్టుకథలుగా చిత్రీకరించి అవాస్తవాలను.. వాస్తవాలుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలకు అన్నీ తెలుసు.. ముఖ్యంగా బీఆర్ఎస్ నేతల కట్టు కథలు అబద్దాలు ప్రజలకు తెలుసు.. అందుకే ప్రజాలు వారినింటికి పంపారు. అయినా వారు తీరు మార్చుకోక అబద్దాలు మాట్లాడుతామని తెగేసి కూర్చుంటే ఇప్పుడున్న స్థానాలు కూడా అప్పుడు ఉండవు.

బీసీలపై ప్రభుత్వం స్టాండ్ ఏంటి..?
ఏ పార్టీలో లేని స్వేచ్ఛ…కాంగ్రెస్ పార్టీలో నాయకులకు, కార్యకర్తలకు, మహిళలకు ఉంటుంది.. బీసీలకు, మహిళలకు కాంగ్రెస్ ఎప్పడు సముచిత గౌరవం ఇస్తూనే ఉంది. దివంగత రాజశేఖర్ రెడ్డి సీఎం గా ఉన్న సమయంలో సబితమ్మకు హోమ్ మినిస్టర్ ఇచ్చి సముచిత స్తానం కల్పించింది పార్టీ. కాంగ్రెస్ మాత్రమే మహిళలకు న్యాయం చేయగలదు .. ఇందిరా గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, మీరా కుమారీ, దీపాదాస్ మున్షీలు ఇలా చెప్పుకుంటూపోతే ఎంతో మంది కాంగ్రెస్ మహిళా నేతలు గొప్ప గొప్ప స్థానాలకు వెళ్లారు. కాంగ్రెస్ పార్టీ అంటే ఇద్దరు వ్యక్తులు కాదు. కాంగ్రెస్ పార్టీ ఒక జాతీయ పార్టీ, ఇక్కడ తీసుకునే నిర్ణయాలు ఒక ప్రాతిపదికన పార్టీలో చర్చించి నిర్ణయాలు తీసుకుంటారు. సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ బీసీలకు, మహిళకు కచ్చితంగా సముచిత స్థానం కల్పిస్తారనే నమ్మకం ఉంది.

చివరిగా రాష్ట్ర మహిళకు ఎం చెబుతారు..?
క్రమశిక్షణతో పనిచేసే మహిళా కార్యకర్తలకు, నాయకులకు ఒక్కటే చెబుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల కోసం ఏర్పడింది. ఈ ప్రభుత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మనదే. ప్రభుత్వం చేపడుతున్న, చేపట్టబోయే సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించండి. ప్రభుత్వానికి అండగా నిలబడండి. రాష్ట్రాన్ని దోపిడీ దొంగల భారీ నుంచి కాపాడే గురుతర బాధ్యతను స్వీకరించండి.

Latest News

బడ్జెట్‌లో ఎపి పేరు లేకుంటే నిధులు రానట్లు కాదు

అనేక పథకాలకు నేరుగా నిధులు విడుదలవుతున్నాయి మీడియా సమావేశంలో చంద్రబాబు వివ‌ర‌ణ‌ కేంద్ర బడ్జెట్‌(Budget Session 2025-26)లో ఏపీ పేరు ప్రస్తావించలేదన్న విమర్శలపై సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు....
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS