- బీసీలకు 42శాతం రిజర్వేషన్లు ఇవ్వకుండా ముందుకు వెళ్తే ఎన్నికలను అడ్డుకుంటాం: బీసీ జనసభ రాష్ట్ర అధ్యక్షుడు రాజారాం యాదవ్
- జూన్ 8న ఇందిరాపార్కు దగ్గర వేలాది మందితో మహాధర్నా, 15న సెక్రటేరియట్ దిగ్బంధిస్తాం
జూన్ 8న ఇందిరాపార్కు దగ్గర వేలాది మందితో మహాధర్నా కార్యక్రమం చేపడతామని బీసీ జనసభ రాష్ట్ర అధ్యక్షుడు రాజారాం యాదవ్ తెలిపారు.ఆదివారం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో వివిధ బీసీ సంఘాల నేతలతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు.ఈ సందర్బంగా రాజారాం యాదవ్ మాట్లాడుతూ బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇవ్వకుండా ముందుకు వెళ్తే ఎన్నికలను అడ్డుకుంటామని ప్రభుత్వానికి హెచ్చరించారు. అసెంబ్లీ ఎన్నికల సందర్బంగా కామారెడ్డి విజయభేరి సభలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చేతుల మీదుగా ప్రకటించిన బీసీ డిక్లరేషన్ కు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉండాలని డిమాండ్ చేశారు.లోక్ సభ ఎన్నికల ఫలితాల తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించేందుకు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు.ఇప్పటికే ఎన్నికల కమిషన్, అధికార యంత్రాంగానికి సీఎం ఆదేశాలు కూడా ఇచ్చారని ఈ సందర్బంగా గుర్తుచేశారు. కులగణన , సామజిక న్యాయం పేరుతొ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచినా కాంగ్రెస్ మరోసారి బీసీలకు మోసం చేసేందుకు సిద్ధమైందని విమర్శించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వకుండా ఆగమేఘాల మీద స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం ఏం ఉందని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిది అసెంబ్లీ ఎన్నికల ముందు ఒక మాట, తర్వాత మరో మాటని రెండు నాలుకల ధోరణి అంటూ ఎద్దేవా చేశారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలను ఏర్పాటు చేసి, కులగణన బిల్లుకు చట్టబద్ధత కల్పించి, శాస్త్రీయ పద్ధతిలో కులగణనను నిర్వహించాలని , అలాగే కులగణన విధివిధానాల కోసం నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలనీ డిమాండ్ చేశారు.బీహార్ రాష్ట్రాన్ని రోల్ మోడల్ గా తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.డిమాండ్స్ ను పట్టించుకోకుండా స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమైతే జూన్ 8న ఇందిరాపార్కు దగ్గర వేలాది మందితో మహాధర్నా కార్యక్రమం నిర్వహిస్తామని, అప్పుడు కూడా ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తే జూన్ 15న బీసీ, కుల సంఘాలతో సెక్రటేరియట్ ను దిగ్బంధిస్తామని హెచ్చరించారు. దశాబ్దాల సామాజిక వర్గాల న్యాయమైన డిమాండ్ సాధన కోసం తెలంగాణ తరహా మరో పోరాటానికి అందరు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. అనంతరం వీరశైవ బలిజ సంఘం పట్టణ అధ్యక్షుడు యాదగిరి మాట్లాడుతూ.. తరతరాలుగా ఏ ప్రభుత్వం వచ్చినా బీసీలకు తీవ్ర అన్యాయం చేస్తుందని, ఇప్పటికైనా మేలుకోకపోతే భావి తరాలు మరింత నష్టపోయే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీ జనసభ తలపెట్టిన జూన్ 8న మహాధర్నా, 15న సెక్రటేరియట్ ముట్టడికి బీసీ సంఘాలు, కుల సంఘాల సంపూర్ణ మద్దతు ఉంటుందని వెల్లడించారు.ఈ కార్యక్రమంలో నాయి బ్రాహ్మణ సంఘం జిల్లా అధ్యక్షులు కోత్వాలు నరేందర్ నాయి, టీ జర్నలిస్ట్ ఫోరమ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేకల కృష్ణ, ఉమ్మడి మెదక్ జిల్లా అఖిల భారత యాదవ మహాసభ అధ్యక్షుడు పయ్యావుల రాములు యాదవ్, గౌడజన హక్కుల పోరాట సమితి జనరల్ సెక్రటరీ జి సంతోష్ గౌడ్, పద్మశాలి సమాజం శ్రీనివాస్ నేత తదితరులు పాల్గొన్నారు.