Friday, November 22, 2024
spot_img

దేవుడి మాన్యంలో యధేచ్చగా అక్రమ నిర్మాణాలు

Must Read

(గండిపేట మండలం నెక్నాంపూర్‌లో కబ్జాకు గురైన 28 ఎకరాలు)

  • సర్వే నెం. 112, 116, 125 భూమి మాయం
  • దీని విలువ సుమారు రూ.170కోట్లు
  • మాముళ్ల మత్తులో మణికొండ మున్సిపాలిటీ
  • పట్టించుకోని టౌన్‌ ప్లానింగ్‌, రెవెన్యూ శాఖ
  • కోర్టు కేసులను లెక్కచేయని అధికారులు
  • నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకున్న వైనం
  • మంత్రి కొండా సురేఖ ఈ అక్రమాలకు అండాగా నిలుస్తారా..? లేక నిలదీస్తారా..?

రాష్ట్రంలో అక్రమార్కులు భూములను మాయం చేస్తున్నారు. వందల కోట్ల భూములను కబ్జాచేసి పెద్ద బిల్డింగులు నిర్మాణం చేపడుతున్నారు. దేవుడి మాన్యాలను సైతం మింగేస్తున్నారు. ‘ఆవు చేలో మేస్తే, దూడ గట్టున మేస్తుందా?’ అన్నట్టు పదేళ్లు గత పాలకులు కనిపించిన భూములల్లా మింగెస్తే కిందిస్థాయి నేతలు ఊరుకుంటారా.. వాళ్లు ఇదే పనిచేస్తున్నారు. ఇంకేంది చెట్లు, చేమలు, గుట్టలు, పుట్టలు, అసైండ్‌ ల్యాండ్స్‌, పేదోడి భూములు ఇసోంటివి తెలంగాణలో ఉన్నకాడికి నాకేశారు. ‘ఊరంతా ఒకదారైతే ఉలిపికట్టెదొక దారి’ ఉంటుందా అన్నట్టు గవర్నమెంట్‌ అధికారులు సైతం వీళ్లకు వంతపాడడం పరిపాటైంది. ‘ఆ గట్టునుంటావా నాగన్న ఈ గట్టునుంటావా’ అనే జానపద గేయాన్ని రంగస్థలం సినిమా కోసం ప్రముఖ రచయిత చంద్రబోస్‌ రాసినట్టు.. అధికారులంతా రాజకీయ నాయకులిచ్చే మాముళ్ల కోసం అవినీతి గట్టున నిలబడ్డారు. ఇప్పుడు అదే పాపం కొనసాగుతుంది. దేవాదాయ, అటవీ, గవర్నమెంట్‌ అసైండ్‌ భూములను సైతం.. మంత్రులు, ఎమ్మెల్యేలు, కిందిస్థాయి నేతలు సైతం వదిలిపెట్టేది లేదు అన్నట్టుగా కబ్జా చేసుకున్నారు.

28 ఎకరాల దేవాదాయ శాఖ భూమి హాంఫట్‌

రంగారెడ్డి జిల్లా మణికొండ మున్సిపాల్టి, గండిపేట మండలం, నెక్నాంపూర్‌ గ్రామ రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్‌ 112, 116, 125లో శ్రీ గణేష్‌ దేవాలయం పేరుతో 28.24 ఎకరాల భూమి ఉంది. ప్రస్తుతం వీటి విలువ సుమారు రూ.170కోట్లపైనే ఉంటుంది. అదే భూమిలో ఉన్న శ్రీ గణేషుడి దేవాలయంతో పాటు అదే ఆవరణలో తుల్జారాం బాగ్‌ లో పలు దేవాలయాలను నిర్మించారు. అవన్నీ ఓ దేవాలయం పేరుతో ఉన్న దేవాదాయ శాఖకు చెందిన భూములు. దశాబ్ధాల కాలంగా దేవాలయానికి పూజారులుగా పనిచేసిన వారి ఆధీనంలోనే భూములు ఉండేవి. ‘దేవుడు వరం ఇచ్చినా పూజారి వరం ఇవ్వడు’ అంటారు కానీ ఇక్కడ అందుకు విరుద్ధంగా జరిగింది. దేవాలయ అభివృద్ధి, నిర్వహణకు వాడుకోవాల్సిన భూములను ఆలయ పూజరులు ఓ రియాల్టరీ కి ముట్టజెప్పారు. కాగా ఆ భూమిని రియాల్టర్లు వెంచర్లు చేసి ప్లాట్స్‌ అమ్ముకున్నారు. ఇవీ దేవాదాయ శాఖ భూములు అని పలువురు కేసులు వేశారు. వాటిని పరీరక్షించాల్సిన దేవాదాయ శాఖ అధికారులు కోర్టు కేసులను పట్టించుకోవడం లేదు. ‘దొంగలు పడిన ఆరునెల్లకు కుక్కలు మొరిగినట్లు’ మణికొండ మున్సిపాలిటీ, టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు వ్యవహరిస్తున్నారు. సదరు భూమిలో వెలుస్తున్న నిర్మాణాలకు నోటీసులు ఇచ్చి మాముళ్లు వసూలు చేసుకొని చేతులు దులుపుకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. కబ్జా చేసి వెంచర్ల ద్వారా ప్లాట్ల రూపంలో కొన్ని ఎకరాల భూములు పోయినా కనీసం దేవాలయం ముందర ఉన్న నాలుగు ఎకరాలు సైతం మిగలలేదు. అక్కడక్కడ మరో నాలుగు ఎకరాల భూమి అయినా మిగిలి ఉందని స్థానికులు ఇప్పటి వరకు భావించారు. కానీ ఇప్పుడు ఏకంగా దేవాలయం ముందు మిగిలి ఉన్న ఆ నాలుగెకరాల భూములకు ప్రహారీలు ఏర్పాటు చేసి రియల్టర్‌ తమ ఆధీనంలోకి తీసుకునే ప్రయత్నం చేస్తుండటంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

హెచ్‌ఎండీఏ, గ్రామ పంచాయతీల అనుమతులతో లేఅవుట్లు

‘చుట్టుగుడిసంత సుఖము, బోడిగుండంత భోగమూ లేదన్నట్టు’ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు దేవుని మాన్యాలను ఏదో వంక చూపి మింగేస్తున్నారు. మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని పుప్పాలగూడ, నెక్నాం పూర్‌ గ్రామాల రెవెన్యూ పరిధిలో 1990 సంవత్సరంలో అలకాపూర్‌ టౌన్‌ షిఫ్‌ పేరుతో వందల ఎకరాలలో వెంచర్లు చేశారు. దానికి ఆనుకునే శ్రీ గణేష్‌ దేవాలయం భూములు సైతం ఉంది. కాగా దాన్ని కారుచౌకగా కొనుగోలు చేసి లేఅవుట్లో కలుపుకున్నారు. హెచ్‌ఎండీఏ, గ్రామ పంచాయతీల అనుమతులతో వేసిన లేఅవుట్లతో పాటు దేవాలయం భూములను విక్రయించారు. విషయం తెలియని వందలాది మంది వాటిని కొనుగోలు చేశారు. అలా కొనుగోలు చేసిన వారివి పోను మరో 8 ఎకరాల వరకు రియల్టర్‌ వద్దనే మిగిలి ఉండటంతో వాటినైనా దేవాలయానికి అప్పగించాలని స్థానికులు అప్పట్లో న్యాయ పోరాటాలు సైతం చేశారు. దీంతో ఇన్నాళ్లు సైలెంట్‌ గా ఉన్న రియల్టర్‌ ప్రస్తుతం సదరు భూములకు ప్రహరీ గోడలు నిర్మిస్తూ తమ ఆధీనంలోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.

యధేచ్చగా రిజిస్ట్రేషన్లు

దేవాదాయ శాఖకు చెందిన భూమిని రిజిస్ట్రేషన్‌ యాక్ట్‌ 1908, సెక్షన్‌ 22ఏ ప్రకారం అమ్మటానికి కొనడానికి అవకాశం లేదు. అయినా అలాంటి భూములను రిజిస్ట్రేషన్‌ శాఖ యధేచ్ఛగా రిజిస్ట్రేషన్లు చేసింది. ‘పెళ్ళీకి పందిరి వెయ్యమంటే చావుకి పాడి కట్టినట్టు’ రెవెన్యూ శాఖ అధికారులు రియల్టర్లు లోపాయికారి ఒప్పందం చేసుకొని సహకరిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. వాటిల్లో నిర్మాణాలకు అనుమతులు ఇచ్చే అవకాశం లేక పోయినా అప్పటి గ్రామపంచాయతీ, ఇప్పటి హెచ్‌ఎండీఏ, మున్సిపల్‌ శాఖలు ఇచ్చేశాయి. సదరు లేఅవుట్లో మున్సిపల్‌ శాఖ నుంచి నిధులను వెచ్చించి డ్రైనేజీ, ఎలక్ట్రిసిటీ, రోడ్ల నిర్మాణాలను చేపట్టారు. వాటిని సకాలంలో అడ్డుకోవాల్సిన రెవెన్యూ, మున్సిపల్‌ శాఖల అధికారులు అందినకాడికి దండుకుని మిన్నకున్నారనే విమర్శలు ఉన్నాయి. విద్యుత్‌ శాఖ అధికారులు దేవాదాయ భూమిలో మీటర్లు మంజూరు చేయవద్దని పలు దేవాదాయ ధర్మదాయ శాఖ అధికారులు లేఖలు రాసినా అవేమి పట్టించుకోకుండా ఇష్టాతిరాజ్యంగా జారీ చేస్తున్నారు. అన్నిశాఖల నిర్వాహకం వలన దేవాలయానికి చెందిన భూములు అన్యాక్రాంతం అయ్యాయి. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం, ఉన్నతాధికారులు స్పందించి మిగిలి ఉన్న భూమిలో వెలుస్తున్న నిర్మాణాలను అడ్డుకుని దేవాలయ భూములను పరీరక్షించాలని స్థానికులు డిమాండ్‌ చేస్తున్నారు. వందల కోట్ల రూపాయల దేవుని మాన్యాలను మింగేస్తున్న రియల్టర్లపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

Latest News

డిసెంబర్ 09 నుండి గ్రూప్ 02 హాల్ టికెట్లను డౌన్‎లోడ్ చేసుకోవచ్చు : టీజీపీఎస్సీ

డిసెంబర్ 09 నుండి గ్రూప్ 02 పరీక్షల హాల్ టికెట్లను డౌన్‎లోడ్ చేసుకోవచ్చని టీజీపీఎస్సీ తెలిపింది. డిసెంబర్ 15,16 తేదీల్లో గ్రూప్ 02 పరీక్షలు జరగనున్నాయి....
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS