- గత ప్రభుత్వం డబుల్ ఇళ్లతో మోసం
- ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో మంత్రి వివేక్
అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. గురువారం మెదక్ లో ఇందిరా మహిళాశక్తి సంబురాలు కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి వివేక్ వెంకటస్వామి కీలక వ్యాఖ్యలు చేశారు. మొదటి విడత ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణంలో ఉన్నాయని.. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేస్తున్నామని.. వడ్డీలేని రుణాలు మంజూరు చేస్తున్నామని అన్నారు. ఇందిరాగాంధీ స్పూర్తితో మహిళలకు పధకాలు అమలు చేస్తున్నామని అన్నారు. అర్హులైన అందరికీ సర్కార్ పథకాలు ఇస్తున్నామని.. ఆర్థిక ఇబ్బందులున్నా కూడా ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నామని అన్నారు. మహిళా సంఘాలకు ఆర్టీసీ బస్సులు, క్యాంటీన్లు ఇస్తున్నామని అన్నారు.

తెలంగాణకు రావాల్సిన నిధుల విషయంలో బీజేపీ ఎంపీలు కృషి చేయాలని అన్నారు మంత్రి వివేక్. హామీల అమలుపై ప్రతి నెల రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేయాలని సీఎం చెప్పారని అన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ప్రజా పాలనలో ప్రజల సమస్యలకోసం కంకణ బద్ధులై పనిచేస్తున్నామని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఖజానా చూస్తే అప్పులే ఉన్నాయని. 60 వేల కోట్ల అప్పులు రాష్ట్రాన్ని ఎనిమిది లక్షల కోట్లకు టిఆర్‌ఎస్ ప్రభుత్వం తీసుకెళ్లిందని అన్నారు. ఖజానా మొత్తం ఖాళీ అయిందని.. ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలను నిలబెట్టుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రయత్నాలు చేసిందని మంత్రి వివేక్ అన్నారు.

పదేళ్లలో గత ప్రభుత్వం డబల్ బెడ్ రూమ్ లు ఇవ్వలేదని.. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మెదక్ నియోజకవర్గంలో 9 వేల ఇండ్లు ఇవ్వడం జరిగిందని అన్నారు మంత్రి వివేక్. ఖజానా ఖాళీ ఉన్నప్పుడు ఇందిరమ్మ ఇండ్లు ఎలా ఇస్తారని ప్రతిపక్షాలు ప్రశ్నించాయని.. ముఖ్యమంత్రి మాట ప్రకారం ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం జరిగిందని అన్నారు. ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మహిళలకు మేలు చేయాలని గరీబి హటావో స్కీం తీసుకొచ్చారని.. బడుగు బలహీన వర్గాలకు అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. కార్యక్రమంలో ఎంపిరఘునందన్ రావు తదితరులు పాల్గొన్నారు.