- తడబడుతూ వివరణ ఇచ్చే ప్రయత్నం
- కళ్లకు కడుతున్న అధికారుల నిర్లక్ష్యం
- ఇంకా 2012 – 2013 ఫీజు స్ట్రక్చరే కొనసాగింపు
- గత ఏడాది 2023-24 ఫీజు ఎంతో చూపించని వైనం
- ఆల్రెడీ అన్ని ప్రైవేటు కాలేజీల్లో ఇంటర్ అడ్మిషన్లు పూర్తి
- ఫీజు డిసైడ్ చేయని బోర్డు ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యూకేషన్
- కార్పోరేట్ కాలేజీలకు వంత పాడుతున్న ఇంటర్ బోర్డు
- మొద్దు నిద్రలో ప్రభుత్వ పెద్దలు
‘శ్రీ చైతన్యనా మజాకా’ అనే శీర్షికతో నిన్న ఆదాబ్ లో వచ్చిన కథనానికి బోర్డు ఆఫ్ ఇంటర్మీడియట్ షేక్ అయింది. కార్పోరేట్ కాలేజీల్లో చేస్తున్న దోపిడీని ఇంటర్మీడియట్ బోర్డు అడ్డుకోలేకపోతుందనే విషయాన్ని మేము చెప్పిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వం నుంచి వచ్చిన ఒత్తిడికి ఇంటర్మీడియట్ బోర్డు రియాక్షన్ వచ్చింది. బోర్డు అధికారులు నీళ్లు నలుముతూ ఆదాబ్ కు ఓ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. మీరు రాసిన కథనంలో వాస్తవం లేదన్నట్టుగా చెప్పబోయారు. శ్రీ చైతన్య లాంటి మరెన్నో కార్పోరేట్ కాలేజీల్లో ఫీజుల నియంత్రణ చేయలేకపోయినట్లుగా ఒప్పుకున్నట్టు అర్థమవుతుంది. ‘ఆలి బెల్లమాయె తల్లి అల్లమాయె’ అన్నట్టు ప్రజలకన్న మాముళ్లు ఇచ్చే కార్పోరేట్ కాలేజీలకే సపోర్టు చేస్తున్నట్టు కొడుతోంది. ప్రైవేటు కళాశాలలు అధిక ఫీజులు వసూలు చేస్తుంటే ప్రేక్షక పాత్ర వహిస్తున్న ఇంటర్ బోర్డు అధికారులు ప్రభుత్వం నిర్ణయించే ఫీజు స్ట్రక్చర్ ను అప్డేట్ చేయలేకపోవడం గమనార్హం. ప్రభుత్వం ఇంటర్మీడియట్ కు ఇచ్చిన ఫీజు స్ట్రక్చర్ రూ.1760లు అనేది ఇప్పుడు చర్చనీయాంశం అవుతుంది. కాగా ఇదీ పదేళ్ల క్రితం అనగా 2012-2013కు సంబంధించినదిగా బోర్డు ఆఫ్ ఇంటర్మీడియట్ చెబుతోంది. 2024-2025 కు సంబంధించి టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ పూర్తయిన నాటి నుంచే అనధికారికంగా అన్ని కార్పోరేట్, ప్రైవేటు కాలేజీల్లో అడ్మిషన్లు మొదలై పదో తరగతి ఫలితాలు వచ్చిన వారం రోజులకే అన్ని కాలేజీల్లో సీట్లు ఫిల్ అయితే.. ఇప్పుడు ఈ సంవత్సరానికి సంబంధించి ఫీజు స్ట్రక్చర్ డిసైడ్ చేయలేదనే మాట చెప్పడం వింటే ‘అబద్ధానికే’ ఉరివేసుకోవాలనిపిస్తుంది. ‘దయగల మొగుడు తలుపు దగ్గరకేసి కొట్టినట్టు’ బోర్డు ఆఫ్ ఇంటర్మీడియట్ అధికారుల క్లారిఫికేషన్ విచిత్రంగా ఉన్నది.
‘తిన్నమా.. పడుకున్నామా.. తెల్లారిందా’ అన్నట్టు లక్షల్లో జీతాలు తీసుకునే ప్రభుత్వ అధికారులు ఉదయం 11గం.లకు తీరిపారి ఆఫీస్ కు వచ్చి మధ్యాహ్నాం లంచ్ చేసి సాయంత్రం 4గం.లకు వెళ్లిపోయేందుకు ఎదురుచూస్తున్నారే తప్ప అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుంది. ప్రభుత్వ ఇంటర్మీడియట్ కాలేజీల సంగతి ఏంటి, ప్రైవేటు కళాశాలల్లో ఫీజుల ఎంత వసూలు చేస్తున్నరు… ప్రభుత్వం నుంచి ఫీజు స్ట్రక్చర్ ఎంత నిర్ణయించాలనే దానిపై దృష్టిపెట్టాలి. కానీ బోర్డు ఆఫ్ ఇంటర్మీడియట్ లో ఆ పరిస్థితులు కనిపించడం లేదు. పత్రికలో వచ్చిన వార్తకు వివరణ కూడా సరిగ్గా ఇవ్వలేని దుస్థితిలో ఇంటర్ బోర్డు ఉంది అంటే.. వాళ్ల పనితనం ఏంటో అర్థమైపోతుంది. ‘ఉన్నమాట అంటే ఉలుకెక్కువ’ అన్నట్టు అసలు నిజంగా ఇలాంటి వాళ్లతో ప్రభుత్వం ఎడ్యుకేషన్ సిస్టమ్ డెవలప్ చేయాలంటే కుదురుతుందా అనే విషయాన్ని ప్రభుత్వ పెద్దలు ఓ సారి ఆలోచన చేయాలి.
శ్రీ చైతన్య లాంటి కార్పోరేట్ కాలేజీల్లో ఇంటర్ తొలి ఏడాదికి లక్షన్నర, రెండో ఏడాదికి లక్షా అరవై వేల రూపాయలు వసూలు చేస్తూ తల్లిదండ్రుల రక్తాన్ని పీల్చుతున్నా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు ఉండడం వెనుక ఆంతర్యామేంటి. ప్రతిసారి ఫీజుల నియంత్రణ పక్క అమలు చేస్తం.. అధిక ఫీజులు, మెటీరియల్ వంటి వాటిపై దృష్టి పెడతాం అని చెప్పే పాలకులను చూసినప్పుడు సిగ్గనిపిస్తుంది. ‘దున్నపోతు ఈనిందంటే దూడను కట్టెయ్యమన్నట్టు’ ఉంది ఇంటర్మీడియట్ బోర్డు పరిస్థితి. నిజంగా తెలంగాణలో ఎంత మంది పిల్లలు మంచి కాలేజీల్లో చదవాలనే ఆశ ఉన్నా.. లక్షల్లో ఫీజులు కట్టలేక లోలోపల కుమిలిపోతున్నారో ఒక్కసారి ఇంటర్ బోర్డు అధికారులు ఆలోచించాలి. మీ బిడ్డలను చదివించే కాలేజీల్లో పేదోడి పిల్లవాడు చదివితే ఎంత బాగుంటుందో చూడండి. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే విద్య, వైద్యం చాలా అవసరం అని ఎంతో చెబుతుంటారు. కానీ విద్య ఎంత కాస్లీ అయిందో ఎవరూ మాట్లాడరు. దానికి పాలకులు, అధికారులు కారణం కాదా అనే ప్రశ్న తలెత్తుతుంది. శ్రీ చైతన్య వంటి కార్పోరేట్ కాలేజీల్లో ఎంత ఫీజు పెట్టాల్నో ప్రభుత్వం, ఇంటర్ బోర్డు డిసైడ్ చేయలేదా.. ఎందుకు ఆ సమస్యకు పరిష్కారాన్ని చూపడం లేదని పలువురు నిలదీస్తున్నారు.
ఎన్నికల ముందు మోతెబరి ముచ్చట్లు చెప్పే రాజకీయ నాయకులు తీర గద్దెనెక్కినంక ‘నదీ దాటేదాక ఓడ మల్లన్న నదీ దాటినంక బోడ మల్లన్న’ అనే సామెతను నిజం చేస్తున్నారు. ఎన్ని ప్రభుత్వాలు మారిన, ఎంతమంది ఎడ్యుకేషన్ ఆఫీసర్లు మారిన ఈ వ్యవస్థ ఎందుకు మారడం లేదనేది వెయ్యి డాలర్ల ప్రశ్న. కాబట్టి ఇకనైన ప్రభుత్వం మొద్దు నిద్ర వీడి కార్పోరేట్ కాలేజీల్లో జరుగుతున్న డబ్బుల దోపిడీని వెంటనే అరికట్టాలని, ప్రభుత్వ నిబంధనలు పాటించని అలాంటి కళాశాలలపై చట్టరిత్య చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.