- సహజ వాగును దారిమల్లించే యత్నం
- అక్రమార్కులకు అంటకాగుతున్న అధికారులు
- జయభేరి గ్రీన్ తత్వ ఆగడాలకు గ్రామం బలి
- పూర్తి ముంపు ప్రాంతంగా మారనున్న అమ్డాపూర్
- ఫిర్యాదు చేసిన పరిసర ప్రాంత రైతులు, ప్రజలు
- పట్టించుకోని ఇరిగేషన్, రెవిన్యూ శాఖ అధికారులు
- మా పరిధిలోకి రాదంటే.. మా పరిధిలోకి రాదంటూ తప్పించుకుంటున్న అధికారులు, ఎన్వొసీ ఒక రెవిన్యూలో తవ్వకాలు మరో
రెవిన్యూలో
‘కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది’ అన్నట్టుగా ఇరిగేషన్, రెవెన్యూ శాఖ అధికారులు వ్యవహారిస్తున్నారు. పైసలకు కక్కుర్తిపడి కొందరు ప్రభుత్వ అధికారులు అక్రమార్కులకు అంటకాగుతున్నారు. వివరాల్లోకి వెళితే.. రంగారెడ్డి జిల్లా, మొయినాబాద్, శంషాబాద్ మండలాల పరిధిలో ఉన్న ఈసా (ఈసీ) వాగు ఆక్రమణకు గురవుతున్నా పట్టించుకోవడం లేదు. ఈసా వాగులో అక్రమంగా మట్టి, ఇసుక తవ్వకాలు జరుపుతున్నారు. ఈసా (ఈసీ) వాగు సహజ ప్రవాహాన్ని దారి మళ్లిస్తున్నారు. దీంతో దాదాపు ఐదు వేల జనాభా ఉన్న అమ్డాపూర్ గ్రామం పూర్తిగా ముంపునకు గురి అవుతుంది. ‘ఇల్లుకాలి ఒకడేడుస్తుంటే.. చుట్టకి నిప్పు అడిగాడంట ఒకడు’ అన్నట్టు స్వలాభం కోసం ప్రాణ డెవలపర్స్ వెంచర్ నిర్వాహకులు ఆ గ్రామ స్వరూపాన్ని మార్చేశారు. అమ్డాపూర్, సుల్తాన్పల్లి కే.బి దొడ్డి, మల్కారం రెవిన్యూని ఆనుకొని సుమారు 60 ఎకరాల విస్తీర్ణంలో అక్రమంగా ప్రాణ డెవలపర్స్ వెంచర్ పనులు ముంపు ప్రాంతంలో ప్రారంభించారు. మొయినాబాద్, సుల్తనాపల్లి మండలాల మధ్య ఈ ఈసా వాగు ప్రవహిస్తుంది. ప్రాణ డెవలపర్స్ పేరుతో వెంచర్ చేస్తున్న అక్రమ నిర్వాహకులకు రెవెన్యూ, ఇరిగేషన్ అధికారుల పూర్తి అండదండలు ఉన్నట్లు తెలుస్తోంది. ‘ఎద్దుగా ఏడాది బతికే కంటే ఆంబోతుగా ఆరునెలలు బతికినా చాలు’ అన్న సామెత మరిచి డబ్బులకోసం అక్రమార్కులకు అండగా నిలబడుతున్నారు. సుల్తనాపల్లి, అమ్డాపూర్, మల్కారం గ్రామాల గత సర్పంచ్ లు, చోటమోటా కద్దరు నాయకులు బహిరంగంగా జయభేరి ఆగడాలను ప్రశ్నిస్తున్నప్పటికీ రహస్యంగా వారికీ మద్దతుగా నిలుస్తున్నారని ముంపు గ్రామ బాధిత రైతులు, గ్రామస్తుల ఆరోపణలు కూడా లేకపోలేవు. కాగా ఈ విషయంలో అందిన కాడికి దండుకుంటున్న ఇరిగేషన్, సంబంధిత మండల రెవిన్యూ అధికారులు పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నట్లు తెలుస్తోంది. ఇది ఏమైనా దెబ్బ తగిలినోడికే ఆ బాధ తెలుస్తుంది అన్నట్లు.. వ్యవసాయాన్నే నమ్ముకున్న రైతులు, ముంపు గ్రామ బాధితులు, ప్రజలు ఒక్కసారిగా జయభేరి ఆగడాలపై దండెత్తడంతో ఈ ఉదంతం కాస్తా ఇప్పుడు ఇరు మండలాల్లో చర్చనీయాశమైంది.
గత పాలకుల హస్తం :
‘అంత ఉరుము ఉరుమి ఇంతేనా కురిసింది అన్నట్లు’ గతపాలకుల తీరు ఉన్నది. ఈసా వాగును మళ్లించేందుకు గతంలోని అధికారపార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు సహకరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈసా వాగు సహజ వాగును దారిమళ్లించడం ద్వారా ముంపునకు గురవుతున్నట్టు గత బీఆర్‌ఎస్ ప్రభుత్వంలోని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, ఎమ్మెల్యే కాలే యాదయ్య, మంత్రి సబితా ఇంద్రా రెడ్డి లకు తెలుసు. అప్పట్లో గ్రామస్థులు వారి దృష్టికి తీసుకెళ్లడంతో ముంపు ప్రాంతాన్ని నామమాత్రంగా సందర్శించారు. కానీ ముంపునకు గురవుతున్న ఆమ్డాపూర్ ప్రజలకు ఎమ్మెల్యేలు, అప్పటి మంత్రి ఎలాంటి భరోసా కల్పించకదాపోవడం ఆశ్చర్యానికి గురిచేయక తప్పదు. కారణమేమంటే ప్రాణ సంస్థకు వారు సపోర్ట్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. నాటి పాలకులు వారికి అండగా నిలబడడం అత్యంత భాదాకరం. సదరు సంస్థ నుంచి ఎమ్మెల్యేలు, మంత్రికి భారీగా మాముళ్లు అందినట్లు తెలుస్తుంది.
అధికారులు, అధికార పార్టీ నాయకుల అండదండలతో గత కొన్నేళ్లుగా ఈసా వాగును, దాని సహజ స్వరూపాన్ని పూర్తిగా మార్చివేస్తూ ప్రాణ సంస్థ రియల్ దందా చేస్తున్నారు. ఈ సంస్థకు ఇరిగేషన్ అధికారులు డీఈ పరమేశ్వర్, శంషాబాద్ ఇరిగేషన్ ఏఈ మౌనిక, మొయినాబాద్ ఇరిగేషన్ ఏఈ ప్రియాంక పూర్తి సహాయ సహకారాలు అందుతున్నట్లు తద్వారానే జోరుగా వెంచర్ పనులు నిర్వహిస్తున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. గత కొన్నేళ్లుగా సాగుతున్న ఈసా వాగు అక్రమణపై ఫిర్యాదు చేసినా సంబంధిత అధికారులు పట్టించుకున్న పాపాన పోలేదని బాధిత ప్రజలు, రైతులు వాపోతున్నారు. ఇప్పటికైనా అవినీతికి పాల్పడిన ఇరిగేషన్ శాఖ అధికారులు ఈసా వాగు మీదుగా జయభేరి సాగిస్తున్న అక్రమ వెంచర్ ఆగడాలకు అడ్డుకట్ట వేసి తమ గ్రామాన్ని ఈసా ముంపు నుంచి రక్షించాలని వేడుకుంటున్నారు. గత ప్రభుత్వం హయాం నుంచి సాగుతున్న ఈ దందాకు ప్రస్తుత కొత్త ప్రభుత్వమైన చొరవ తీసుకొని ఆమ్డాపూర్ గ్రామస్థులకు న్యాయం చేయాలని కోరుతున్నారు. అమ్డాపూర్ గ్రామ నైసర్గిక స్వరూపాన్నే తీవ్ర ముంపు గ్రామంగా మార్చే యత్నం చేస్తున్న అక్రమ ప్రాణ డెవలపర్స్ వెంచర్ పై ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని ముంపు గ్రామ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
ప్రాణ డెవలపర్స్ సైట్ సూపర్‌వైజర్‌ను ఆదాబ్ వివరణ కోరగా.. లక్డికపూల్ లోని నీటిపారుదల శాఖ చీఫ్ ఇంజనీర్ కార్యాలయం నుండి రైన్ వాటర్ స్ట్రీమ్ కోసం ఎన్వోసి పొందినట్లు తెలిపారు. వాగులో ఉన్న మట్టి పూడిక తీయడానికి ఇరిగేషన్ అధికారుల నుండి అనుమతులు కూడా ఉన్నట్లు వెల్లడిరచారు. కాగా, వాగు పొంగినప్పుడల్లా సుల్తాన్‌పల్లి, మల్కారం, అమ్డాపూర్ గ్రామాలు ముంపునకు గురవుతుంది.. ఈ సమస్య 20 సంవత్సరాల నుండి ఉంది. అయినప్పటికి అధికారులు, ప్రజా ప్రతినిధులు ఎవ్వరూ పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు. ఈసా వాగు దారి మళ్లించి ఎందుకు నిర్మాణ పనులు ఎందుకు చేపట్టారని ప్రశ్నించగా ఆదాబ్ ప్రతినిధి ప్రశ్నించగా మొక్కలు పెంచడానికి మట్టి నిల్వ చేస్తున్నామని తెలపడం ఆశ్చర్యానికి గురిచేసింది.. ఒకవేళ మొక్కలు పెంచడానికి భారీ నిర్మాణం పనులు ఎందుకు చేస్తున్నారంటే స్పష్టమైన సమాధానం లేదు..