- స్పేస్ మిషన్‌ను ప్రారంభించిన ఇస్రో
- తొలి భారీ అనలాగ్ మిషన్ ఇదే..
- పలు రకాల టెక్నాలజీలను పరీక్షించిన ఇస్రో
భారత అంతరిక్ష సంస్థ ఇస్రో తొలి అనలాగ్ స్పేస్ మిషన్‌ను లద్దాఖ్ లేహ్‌లో ప్రారంభించింది. హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ సెంటర్, ఆకా స్పేస్ స్టూడియో, లడఖ్ విశ్వవిద్యాలయం, ఐఐటీ బాంబే, లడఖ్ అటానమస్ హిల్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ సహకారంతో ఈ మిషన్ చేపట్టింది. మిషన్‌లో భాగంగా ఇస్రో లేహ్‌లో ఓ స్పేస్‌ను సృష్టిస్తుంది. ఇందులో మరో గ్రహంలో పరిస్థితులు ఎలా ఉంటాయో అలాగే ఉంటాయి. దాంతో భూమికి దూరంగా ఉన్న ప్రదేశాల్లోని బేస్ స్టేషన్లలో ఎదురయ్యే సమస్యలను ఎదుర్కొనేందుకు ఇస్రో సన్నాహాలు చేయనున్నది. ఇస్రో లేహ్‌లో ప్రారంభించిన తొలి భారీ అనలాగ్ మిషన్ ఇదే. అంతరిక్షం, ఏదైనా ఖగోళ వస్తువు తరహాలో వాతావరణం, పర్యావరణాన్ని పోలి ఉంటుంది. నిర్ణీత ప్రమాణాలకు అనుగుణంగా శాస్త్రవేత్తలు తీర్చిదిద్దుతుంటారు. అందులో వ్యోమగాములకు శిక్షణ ఇచ్చేందుకు అవకాశం ఉంటుంది. రాబోయే రోజుల్లో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ కీలకమైన మిషన్లు చేపట్టనున్న విషయం తెలిసిందే. ఇందులో కీలకమైన మిషన్ గగన్‌యాన్. ఇందులో మిషన్‌లో తొలిసారిగా అంతరిక్షంలోకి వ్యోమగాములను పంపబోతున్నది. ఈ పరిస్థితుల్లో అనలాగ్ మిషన్ కీలకంగా మారనున్నది. రాబోయే కాలంలో వ్యోమగాములకు శిక్షణ ఇచ్చేందుకు అవకాశం ఉంటుంది. లద్దాఖ్‌లోని వాతావరణ పరిస్థితులు కొంత వరకు చంద్రుడు, మార్స్ పరిస్థితులను పోలి ఉంటాయి. చల్లని, పొడి వాతావరణం, ఎక్కువ ఎత్తు ఉండడంతో ఇక్కడి నుంచి దీర్ఘకాలిక అంతరిక్ష మిషన్ల కోసం సన్నాహాలకు ఉపయుక్తంగా ఉండనున్నది. అనలాగ్ మిషన్‌లో పాల్గొనేవారంతా ఇతర గ్రహాలు, స్పేస్‌షిప్‌ల్లో ఉండే పరిస్థితులు అనుభవిస్తారు. భవిష్యత్‌లో ఇక్కడే అంతరిక్ష యాత్రకు సిద్ధం కానున్నారు. నిర్వహణ, మానసిక స్థితిని సైతం శాస్త్రవేత్తలు పర్యవేక్షించనున్నారు.