- జంటనగరాల్లో చురుకుగా వెరిఫికేషన్ ప్రక్రియ
- కొత్త రేషన్ కార్డు కోసం 83వేల మంది దరఖాస్తు
తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల జారీ పక్రియను వేగవంతం చేస్తోంది. ఇటీవల కొత్త రేషన్ కార్డుల జారీకి సంబంధించిన మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసిన విషయం తెలిసిందే. ప్రత్యేకంగా హైదరాబాద్ నగరంలో కొత్త రేషన్ కార్డుల పక్రియను మరింత దృష్టిలో పెట్టుకుని, జీహెచ్‌ఎంసీ అధికారులు రంగంలోకి దిగారు. జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఇలంబర్తి నేతృత్వంలో 150 డివిజన్లలో దరఖాస్తుదారుల అర్హతల పరిశీలన ప్రారంభమైంది. జీహెచ్‌ఎంసీ పరిధిలో రేషన్ కార్డుల వెరిఫికేషన్ కొనసాగుతోంది. కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న వారి ఇంటికి వెళ్లి ఆదాయం, ఆస్తులు వివరాలు తనిఖీ చేస్తున్నారు. రెవెన్యూ, సివిల్ సప్లై అధికారుల సమన్వయంతో ఫీల్డ్ వెరిఫికేషన్ కొనసాగుతోంది. రెండు లక్షల లోపు ఆదాయం ఉండి, బిలో పావర్టీ లైన్‌కు దిగువన ఉన్న వారు రేషన్ కార్డు అర్హులు అంటున్నారు. సొంత ఇండ్లు, ఆస్తులు ఉండి కూడా రేషన్ కార్డు కోసం అప్లై చేసుకున్న వారి దరఖాస్తులను అధికారులు పరిశీలించడం లేదని అంటున్నారు. గ్రేటర్ వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డు కోసం 83 వేల మంది దరఖాస్తు చేసుకున్నట్లు, ఈ నెల 20 వరకు ఫీల్డ్ వెరిఫికేషన్ పూర్తి చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ నెల 24వ తేదీ నాటికి అర్హుల ఎంపిక పక్రియను పూర్తిచేయాలని, 25వ తేదీకి ఆయా జిల్లా కలెక్టర్లకు నివేదికను అందజేయాలని జీహెచ్‌ఎంసీ నిర్ణయించింది. అర్హులుగా గుర్తించిన దరఖాస్తుదారుల వివరాలను ప్రభుత్వం వద్ద ఉన్న డేటాతో సరిచూసి, చివరగా ఈ నెల 26వ తేదీ నుంచి కొత్త రేషన్ కార్డులను జారీ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. తెలంగాణ ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన సమగ్ర సర్వేలో, జీహెచ్‌ఎంసీ పరిధిలో 22 లక్షల కుటుంబాల వివరాలను సేకరించింది. ఈ సర్వే అనంతరం కొత్త రేషన్ కార్డుల కోసం వచ్చిన దరఖాస్తులను అధికారులు పరిశీలించారు. ఇందులో 83,285 మంది కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నట్లు గుర్తించారు. ఇంటింటి సర్వేలో కూడా అనేక మంది కొత్త రేషన్ కార్డుల కోసం తమ వివరాలను నమోదు చేసుకున్నారు. గతంలో కొత్త రేషన్ కార్డుల జారీ లేకపోవడం, కార్డుల్లో మార్పులు చేసుకునే అవకాశాలు లేకపోవడంతో వేలాది మంది ప్రజలు కొత్త కార్డుల కోసం ప్రభుత్వాన్ని ఆశ్రయించారు. జీహెచ్‌ఎంసీ అధికారులు ప్రాథమికంగా అర్హులుగా గుర్తించిన దరఖాస్తుదారుల వివరాలను పరిశీలిస్తున్నారు. నివేదిక తయారు చేసి, ఈ నెల 26వ తేదీ నాటికి కొత్త రేషన్ కార్డుల జారీ ప్రారంభమయ్యేలా కృషి చేస్తున్నారు. ఈ కొత్త పక్రియ ద్వారా రాష్ట్రంలోని అనేక మంది అర్హులైన పేద కుటుంబాలకు రేషన్ కార్డులు అందుబాటులోకి వస్తాయి. ఇది ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను మరింత సమర్థంగా అమలు చేయడంలో సహాయపడుతుంది.