తెలంగాణ శాసనసభలు మంగళవారం ప్రారంభమయ్యాయి.ఉదయం 11 గంటలకు సమావేశాలు మొదలయ్యాయి.మొదటి రోజులో భాగంగా సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.ఈ సందర్బంగా దివంగత ఎమ్మెల్యే లాస్య నందితకు సభ్యులు సంతాపం ప్రకటించారు.సంతాప తీర్మానంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ,సామాన్య కుటుంబంలో జన్మించిన సాయన్న అంచెలంచెలుగా ఎదుగుతూ,ప్రజలకు ఎన్నో సేవలు చేసి చివరికి ప్రజా జీవితంలోనే మరణించారాని అన్నారు.తదనంతరం కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా లాస్య నందితను ప్రజలు ఎన్నుకున్నారని గుర్తుచేశారు.కానీ ప్రమాదవశాత్తు జరిగిన రోడ్డు ప్రమాదంలో లాస్య మరణించడం బాధాకరమని తెలిపారు.దివంగత ఎమ్మెల్యే సాయన్న రాజకీయాలకు అతీతంగా అందరితో కలిసిమెలిసి ఉండేవారని గుర్తుచేశారు.కంటోన్మెంట్ ప్రాంతాన్ని జీహెచ్ఎంసీలో కలిపి అభివృద్ధి చేయాలన్నది సాయన్న కోరికగా ఉండేది కానీ ఆ కల నెరవేరే సమయానికి వారు మన మధ్య లేకపోవడం చాల బాధాకరమని పేర్కొన్నారు.సాయన్న,లాస్యనందిత చేయాలనుకున్న పనులను కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగిస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు.