- కోట్ల విలువ కలిగివున్న ఆలయ భూమిని అక్రమంగా కాజేయాలని పక్కా ప్లాన్?
- ఎప్పుడేమి జరుగుతుందోనని భయం గుప్పిట్లో ఆలయ నిర్వాహకులు
- 30 గోవుల సేవలో ఉన్న జగన్నాథ ఆలయం
- రాత్రికి రాత్రి కబ్జా చేస్తారనే భయం వెంటాడుతుంది
- కబ్జా కోరులు కబ్జా గ్యాంగులకు సుపారి ఇవ్వనున్నట్లు తెలుస్తుంది
- ఆలయ చుట్టూ గుంపులుగా మోహరిస్తూ తరుచుగా భయపెడుతున్న వైనం
- మందిరానికి పటిష్ట దస్తావేజులు ఉన్నా.. కబ్జాదారుల డేగ కన్ను
సికింద్రాబాద్ మహేంధ్రాహిల్స్ లో ఉన్న హరినామ్ ప్రచార సమితి బ్యానర్‌పై ఉన్న జగన్నాథ ఆలయం, గోశాల సంవత్సరాలుగా ఇబ్బందులు, బెదిరింపులు, అక్రమకారులతో సమస్యలను ఎదుర్కొంటున్నారు. సికింద్రాబాద్ సివిల్ కోర్టు, హైకోర్టులో కేసులు నడుస్తున్నప్పటికీ ఆలయ కమిటీ పై కబ్జాదారుల వేధింపులు కొనసాగుతూనే ఉన్నాయి. ఆలయానికి సంబంధించిన సమస్యల చరిత్ర చాలా సంవత్సరాల నాటిది. అక్రమకబ్జాదారులు కోట్లల్లో విలువ చేసే ఆలయ భూమిని ఆక్రమించడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు. దీనిపై స్పందిస్తూ జగన్నాథ ఆలయ కమిటీ ప్రతిసారి న్యాయస్థానాన్ని ఆశ్రయించి ఆలయానికి అనుకూలంగా ఆర్డర్లు తెచ్చుకుంటుంది. ఇదిలా ఉండగా ఇటీవల వర్షాలు మరియు వరదల కారణంగా దెబ్బతిన్న ఆలయ సరిహద్దును నీలిరంగు షీట్లతో పునర్నిర్మించాలని కోరుతూ ఇటీవల ఆలయం హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసింది. సుదీర్ఘ వాదనల అనంతరం బ్లూ షీట్లను మళ్లీ ఏర్పాటు చేసుకోవచ్చునని హైకోర్టు స్పష్టంగా ఆదేశించింది.
కోర్టు ఆదేశాలు ఉన్నా..
కోర్టు ఆదేశాలను అనుసరిస్తు ఆలయ కమిటీ వారు పునర్నిర్మాణం మొదలుపెట్టారు కానీ నిర్మాణం చేస్తుండగా కబ్జాదారులు గ్యాంగుల వారీగా విడిపోయి ఒక్కొక్క రోజు ఒక్కొక్క సమయంలో బలవంతంగా లోనికి ప్రవేశించి తీవ్రంగా వ్యతిరేకించారు. పోలీసులకు సమాచారం అందించినప్పటికీ, భయపడకుండా నిర్మాణాన్ని వ్యతిరేకించారు. కాగా, అక్రమ కబ్జాదారులు బైట గ్యాంగులతో ఒప్పందం కుదుర్చుకోవడానికి తమకు ముఠాలు ఉన్నాయని కూడా చెబుతూ పనులు ఆపివేయాలని ఒత్తిడి చేశారు. అన్ని విషయాలను తట్టుకుంటూ ఆఖరికి పునర్నిర్మాణాన్ని పూర్తి చేసారు. పని పూర్తిచేసినప్పటికీ ఆలయ నిర్వాహకులు ఇప్పటికీ భయంతో జీవిస్తున్నారు.
అక్రమ కబ్జాదారుల వద్ద ప్రామాణికమైన పత్రాలు లేకపోవడం, సంబంధం లేని సర్వే నంబర్లను చూపడం, తామే యాజమానులమని మౌఖిక దావా చేయడం ద్వారా ఇతరులను గందరగోళానికి గురిచేస్తున్నారు. అసంబద్ధమైన పత్రాలను ప్రదర్శించి, గందరగోళం సృష్టించడం ద్వారా పోలీసులను తప్పుదారి పట్టించడానికి ప్రయత్నిస్తున్నారు. భక్తులు మరియు స్థానికులు భూమి ఆలయానికి చెందుతుందని ధృవీకరిస్తున్నారు.
ఈ విషయం పై ప్రభుత్వం చొరవ తీసుకొని మహేంద్రాహిల్స్ లోని జగన్నాథ ఆలయ భద్రత, హక్కులను పరిరక్షించాలని ఆలయ కమిటీ సంబంధిత అధికారులను కోరింది. ఆలయ ప్రహరీ పూర్తి చేసిన తరువాత కూడా ఇంకా భయంలోనే ఉన్నామంటూ అక్కడి పూజారులు చెబుతున్నారు. ఆలయానికి సంబంధించిన భూమి పత్రాలు అన్ని సక్రమంగా ఉన్నా మరియు హైకోర్టు నుండి స్పష్టమైన ఆర్డర్ ఉన్నా, తమ హక్కులను కాపాడుకోవడానికి మరియు శాంతియుత ఆరాధనను నిర్ధారించడానికి నిరంతర మద్దతు మరియు రక్షణను కోరుతున్నారు. ఆలయానికి అక్రమ కబ్జా ముప్పు పొంచి ఉన్నందున ఆలయ కమిటీ అప్రమత్తంగా ఉండడంతో పరిస్థితి ఉద్రిక్తంగానే ఉంది. ఆలయ ప్రయోజనాలను కాపాడేందుకు, శాంతిభద్రతల పరిరక్షణకు ప్రభుత్వం మరియు ఉన్నతాధికారులు జోక్యం చేసుకోవాలని ఆలయ నిర్వాహకులు, భక్తులు మరియు స్థానికులు కోరుతున్నారు.