- మున్సిపాల్టీలకు ఒక్కపైసా కూడా ఇయ్యని సీఎంగా కేసీఆర్ రికార్డు..
- జీతాలు చెల్లింపునకు నిధులు లేక ఇబ్బందు
- 14నెలలుగా రాని పట్టణ ప్రగతి నిధులు..
- పెండిరగ్ లోనే కాంట్రాక్టర్ల బిల్లులు
- ఆదాయము తక్కువ ఖర్చు ఎక్కువ
- మున్సిపాల్టీ ఆదాయం ప్రభుత్వ ఖాతాలో జమ
- గత ప్రభుత్వంలో కేసీఆర్ మున్సిపాల్టీలకు ఎన్నో కోట్ల హామీలు
- ఒక్కటికూడా నెరవేర్చకుండా చేతులు దులుపుకున్న వైనం
- సీఎం రేవంత్ రెడ్డి మున్సిపాల్టీశాఖను చక్కదిద్దాల్సిన అవసరం ఎంతైనా ఉంది..
‘అమ్మ పెట్టా పెట్టదు.. అడుక్కు తిన్నా తిననివ్వదు’ అన్న చందంగా తయారైంది తెలంగాణలో మున్సిపాల్టీల దుస్థితి. రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలు ఆదాయం లేక అరిఘోస పడుతున్నాయి. గత సర్కార్ అనాలోచిత నిర్ణయాలతో మున్సిపాల్టీల ఆదాయం కాస్త ప్రభుత్వ ఖజానాలో చేరిపోతున్న విషయం తెలిసిందే. మున్సిపాల్టీల్లో ఎన్నో ఖర్చులకు డబ్బు కావాల్సి ఉంటది కానీ వచ్చే రాబడి కాస్త సర్కారు ఖాతాలో జమ అవుతుండడంతో మున్సిపాల్టీలు పలు సమస్యలను ఎదుర్కొంటున్నాయి. రోడ్లు, మంచినీళ్లు, మురికి కాల్వలు, విద్యుత్, శానిటైజేషన్ వంటి అనేక అవసరాలకు మున్సిపాల్టీలు బోలెడు పైసలు అవసరం ఉంటాయి. ఎప్పుడూ ఏ నాయకుడు వచ్చిన ఈ మున్సిపాల్టీకి ఇన్ని కోట్లు, ఆ మున్సిపాల్టీకి ఈ పనులు డెవలప్ చేస్తామని ఎన్నికలొచ్చినప్పుడు, పట్టణాల్లో పర్యటనలకు వచ్చినప్పుడు ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు హామీలిచ్చి అవతలపడతరు. ‘ఉట్టి గొడ్డుకి అరుపులెక్కువన్నట్లు’ రాజకీయ నాయకులు మైకు దొరికిందంటే ఏదో ఒకటి వాగి అటెనకాలే వాటిని మరుస్తరు. గత పదేళ్లల్లో అప్పటి సీఎం కేసీఆర్ ఏ ఊరు, ఏ పట్టణం, నగరం పోయిన ఈ జిల్లాకు అన్ని కోట్లు, ఆ నియోజకవర్గానికి ఇన్ని కోట్లు, మున్సిపాల్టీకి కూడా కోట్లు ఇప్పుడే మంజూరు చేస్తున్నా అని మాయమాటలు చెప్పి అటకాయించేవాడు. బీఆర్‌ఎస్ అధినేత 100, 50, 30 అంటూ అంకెల గారడీ చేసేవాడు. ‘ఉన్న మాటంటే ఉలుకెక్కువ’ అన్నట్టుగా ఆయన హామీలపై ఎవరన్నా ప్రశ్నిస్తే, నిలదీస్తే గులాబీ లీడర్లు ఎదురుతిరిగేవారు. అదిగో, ఇదిగో అని మున్సిపాల్టీలకు ఒక్కపైసా కూడా ఇయ్యని సీఎంగా చంద్రశేఖర్ రావు రికార్డు నెలకొల్పాడు.
తెలంగాణ రాష్టం ఏర్పడిన తర్వాత రాష్టంను అభివృద్ధి పధంలో ఉంచాలని ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని తెలంగాణ ప్రభుత్వము సంకల్పించింది. అందుకు గాను రాష్ట్రంలో ఉన్న 141 మున్సిపాల్టీలలో మౌలిక వసతుల సంకల్పనకు పూనుకుంది. గతంలో ఉన్న మున్సిపాల్టీల సంఖ్య కంటే అదనంగా మేజరు గ్రామ పంచాయితీల ను మున్సిపాల్టీలుగా చేయడంతో పాటు గ్రామాలను మున్సిపాల్టీలలో విలీనం చేసి, అభివృద్ధి కి పెద్ద పీట వేయాలని సంకల్పించింది. కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చే 14వ 15 వ ఆర్ధిక సంఘము గ్రాంట్ లకు పట్టణ ప్రగతి గ్రాంట్ లను కలిపి ఫిబ్రవరి 2020 నుండి మున్సిపాల్టీలకు నెల వారి గ్రాంట్ క్రింద నిధులు మంజూరు చేస్తూ వచ్చింది. ఈ నిధుల నుండి ప్రజలకు ఉపయోగమైన స్మశాన వాటికలు, డంపింగ్ యార్డ్ లు, పబ్లిక్ మరుగుదొడ్లు, ఇంటిగ్రేడెడ్ మార్కెట్ ల నిర్మాణము షాపింగ్ కాంప్లెక్స్ లు, ఫుట్ పాత్ లు, నీటి సరఫరా ల్కెన్ లు, పచ్చదనం పెంపు, కొన్ని రకాల మౌలిక వసతులు చేపట్టడం జరిగింది. ఈ పై పనులు పూర్తి కాగానే జిల్లా కలెక్టర్, అడిషినల్ కలెక్టర్ ల అనుమతితో మున్సిపాల్టీ లలో రోడ్లు, డ్క్రెన్లు, కల్వర్టు లు కరెంట్ బిల్లులు, సిబ్బంది జీతభత్యాలు, ఇతర పనులను చేసుకునే అవకాశం ఉందని పురపాలక సంచాలకులుగా పనిచేసి రిట్కెర్డ్ అయిన ఎన్ .సత్యనారాయణ రివ్యూ మీటింగ్ లో జరిగింది. దీంతో పలు మున్సిపాల్టీలలో వచ్చిన ఆదాయంతో పాటు ఇక రాబోవు ఆదాయము ను దృష్టిలో పెట్టుకొని అధికారులు లక్షలలో పనులు చేయించారు. కానీ గత 14నెలల నుండి పట్టణ ప్రగతి నిధులు మంజూరు కాక పోవడంతో లక్షలలో కాంట్రాక్టర్ ల బిల్లులు పెండిరగ్ లో ఉన్నాయి. ఇక కొన్ని మున్సిపాల్టీలలో కరెంట్ బిల్లులు, వీధి దీపాలు మెయింటనెన్స్ చేసే ఇ.ఇ.ఎస్.ఎల్ పేమెంట్ లు, మున్సిపాల్టీలలో పని చేస్తున్న కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ సిబ్బంది జీతాల చెల్లింపులు, పి.ఎఫ్, ఇ.ఎస్.ఐ చెల్లింపులు పూర్తిగా ఆగిపోయాయి.
మున్సిపాల్టీ ఆదాయము ఏదీ:
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ ఏర్పడ్డ తర్వాత 2018 వరకు కూడా మున్సిపాల్టీ లకు ఇంటి పన్నులు, నల్లా బిల్లులు, స్టాంపు డ్యూటీ (రిజిస్ట్రేషన్ ఫై పన్ను) ఏంక్రోచ్ మెంట్ పన్ను, ఎంటర్టైన్ పన్ను, వ్యాల్యూ వేషన్, బర్త్, డెత్ సర్టిఫికేట్స్ జారీ ఫీజు, ఓనర్ షిప్ సర్టి ఫికేట్స్ జారీ పీజులు, భవన నిర్మాణము అనుమతి ఫీజులు, అద్దెలు, ఖాళీ స్థలములఫై పన్ను విధించి మున్సిపల్ సాధారణ నిధుల క్రింద ఆదాయం సమకూర్చుకునే వారు. ఇట్టి నిధులకు సరిపడ సిబ్బందిని నియమించు కొని వారికీ జీతభత్యాలు, పారిశుధ్య నిర్వహణ మెయింటనెన్స్ , మౌలిక వసతులు, పండుగలు, ప్రభుత్వ కార్యక్రమాలను నిర్వహించే వారు. కానీ 2018 నుండి మున్సిపాల్టీలకు రావలసిన స్టాంపు డ్యూటీని ప్రభుత్వము మున్సిపాల్టీలకు ఇవ్వకుండా నేరుగా ప్రభుత్వ ఖాతాలలో జమ చేస్తుంది.
‘క్షణం తీరికలేదు దమ్మిడి ఆదాయం లేదు’ అన్న చందంగా మున్సిపాల్టీలు తీరు ఉంది. వాణిజ్య పన్నుల శాఖ నుండి రావలసిన ఆదాయం జీఎస్టీ వచ్చాక మున్సిపాల్టీలకు ఒక్క రూపాయి రావడం లేదు. 2019లో రూపొందించి కొత్త చట్టం వల్ల మున్సిపాల్టీ నుండి ఎలాంటి దృవీకరణ పత్రాలు జారీ కావడం లేదు. బర్త్ అండ్ డెత్ సర్టి ఫికేట్ లు నేరుగా మీసేవ అకౌంట్ ల ద్వారా ప్రభుత్వ అకౌంట్ లో జమ అవుతున్నాయి. నేరుగా ఇచ్చే భవన నిర్మాణం అనుమతులను టి.ఎస్.బి.పాస్ విధానం ద్వారా మున్సిపాలిటిలలో ఫీజు జమ కావడంలేదు. అది కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన అకౌంట్ లో జమ అయిన తర్వాత సకాలంలో మున్సిపల్ ఖాతాలలోకి రావడం లేదు. అసలు మున్సిపాల్టీలలో ఎన్ని భవనాలకు అనుమతి ఇచ్చారు.? ఎంత ఆదాయం ప్రభుత్వ అకౌంట్ లో జమ అయింది.? ఎంత మున్సిపాలిటి అకౌంట్ లో జమ చేస్తునారో కూడా లెక్క పత్రం లేదు. దీని వల్ల ప్రభుత్వం ఇచ్చే నిధుల మీదనే మున్సిపాల్టీలు ఆధారపడాల్సిన దుస్థితి ఏర్పడడం దారుణం. ఇంటి పన్ను, నల్లా బిల్లుల వసూలులో కూడా ఆశించిన ఆదాయం మున్సిపాల్టీలకు రాపోవడంతో మెయింటెనెన్స్ చాలా ఇబ్బందిగా మారింది.
పారిశుద్ధ్యం అస్తవ్యస్తం :
‘మబ్బుల్లో నీళ్ళు చూసి ముంత వలక బోసుకున్నట్లు’ మున్సిపాల్టీ దుస్థితి తయారైంది. ఉన్న ఆదాయం సర్కారు ఖాతాలోకి వెళ్తున్నందు వల్ల పారిశుద్ధ్య నిర్వహణ కష్టతరం అయితుంది. దీంతో పట్టణాలలో పారిశుద్ధ్య నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. అధికారుల అలసత్వం సిబ్బందిఫై అజమాయిషీ లేక పోవడంతో పాటు సరిపడ సిబ్బంది లేక పోవడం ఇబ్బందులకు దారి తీస్తుంది. ఇందులోనే సిబ్బంది ఉన్న ప్రాంతాలలో మంత్రులు, శాసనసభ్యులు, కలెక్టర్ లు, అడిషినల్ కలెక్టర్ లు, చైర్మెన్ లు, పాలకమండలి సభ్యులు, అధికారుల ఇండ్లలో సిబ్బందితో పని చేయించుకుంటున్నారు. దీంతో పారిశుద్ధ్యం పడకేస్తుంది. ఇదీగాక జిల్లా స్థాయిలలో ఉన్న అన్ని రకాల ప్రభుత్వ కార్యాలయాలలో వివిధ కార్యక్రమాలకు మున్సిపల్ సిబ్బందితో పనులు చేయిస్తున్నారు. వార్డులు పెరిగిన ఆశించిన సిబ్బంది లేక పోవడం వల్ల పనులు చేయించలేని పరిస్థితి నెలకొందని అధికారులు చెబుతున్నారు.
ఇంజనీరింగ్ అధికారుల నియంత్రణ కరవు:
రాష్ట్రంలోని వివిధ పట్టణాలలో జరిగే అభివృద్ధి పనులపై ఇంజనీరింగ్ అధికారుల నియంత్రణ కరవైంది. అనేక నిధుల ద్వారా చేపట్టే అభివృద్ధి పనులు సీసీ, బీటి రోడ్లు, మురికి కాలువలు, కల్వర్టుల నిర్మాణంలో నాణ్యత లోపించి వేసిన రోడ్లు ఒకటి రెండు సంవత్సరాల లోపే గుంటల మయంగా మారి కంకర తెలుతున్నాయి. ఇంజనీరింగ్ అధికారులు పర్సెంటేజీలఫై చూపుతున్న శ్రద్ద పనుల నాణ్యతలో చూపటం లేదనే విమర్శలు ప్రతి మున్సిపాలిటీలో బహిరంగంగానే వినిపిస్తున్నాయి.
రెవిన్యూ విభాగమే.. మున్సిపాల్టీల ప్రధాన ఆదాయం :
ఇంటి పన్ను, నల్ల బిల్లుల వసూలు, ఇంటి నెంబర్ జారీలో రెవిన్యూ అధికారుల చేతి వాటంతో ఇంటి పన్ను తక్కువ వేసి ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టుతున్న పరిస్థితి నెలకొంది. ఆన్ ల్కెన్ లో ఆశించిన మేర గృహాలను నమోదు చేయకుండా ట్యాక్స్ లను వసూలు చేసి తమ జేబులలో వేసుకుంటున్నారు. రాష్టంలోని చాల మున్సిపాల్టీలలో అకౌంట్స్ విభాగంలో చైర్మెన్, కమీషనర్ ల ఒత్తిడిలతో ఫైల్స్ లేకున్నా చెక్ లు డ్రా చేసుకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇవన్నీ అడిట్ లో కనిపించకుండా మ్యానేజ్ చేస్తూ ఆదాయానికి గండి కొట్టుతున్నట్టు తెలుస్తోంది. ఈ రకంగా పురపాలక సంఘాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించి మున్సిపల్ వ్యవస్థను గాడిలో పెట్టాలని కాంగ్రెస్ సర్కార్ ను కోరుతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యవేక్షణ శాఖ మున్సిపాల్టీ శాఖను చక్కదిద్దాలని పలువురు మేధావులు సూచిస్తున్నారు.