- భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలి
- దర్శనానికి ఆన్లైన్ వెబ్‌సైట్ ప్రారంభించిన అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని సుప్రసిద్ధ శైవ క్షేత్రం శ్రీ రామలింగేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలను మహాశివరాత్రి పర్వదినోత్సవాన్ని పురస్కరించుకొని వైభవోపేతంగా నిర్వహించాలని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి అన్నారు. మంగళవారం మహా శివరాత్రి సందర్భంగా ఈనెల 24వ తేదీ నుంచి మార్చి 1వ తేదీ వరకు జరిగే బ్రహ్మోత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లపై ఆలయంలోని కార్యాలయంలో ఆలయ ఛైర్మన్ తటాకం నారాయణ శర్మ, ఆలయ ఈఓ సుధాకర్ రెడ్డి, జిల్లా అధికారులు, ఆలయ కమిటీతో సమన్వయ సమావేశం నిర్వహించారు.
భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు..
భక్తులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించడంతో పాటు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టరు మాట్లాడుతూ బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తులకు ఏలాంటి అసౌకర్యం కలుగకుండా ఏర్పాట్లు పూర్తి చేయాలని అన్నారు. అధికారు లందరూ సమన్వయంతో పనిచేసి భక్తులకు సౌకర్యాలు కల్పించాలని సూచించారు. మహాశివరాత్రితో పాటు అంతకు ముందు, తర్వాత రోజుల్లో సైతం భక్తులు ఎక్కువగానే వస్తారని దీనిని దృష్టిలో ఉంచుకొని ఆలయ సిబ్బంది సైతం ఎక్కువ మందికి స్వామి వారి దర్శనం కలిగేలా చూడాల్సిందిగా సూచించారు. బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు సౌకర్యవంతంగా ఉండేందుకు క్యూలైన్ లను పెంచాలన్నారు.
వృద్దులకు, దివ్యాంగుల కోసం ప్రత్యేక ఆటోలు..
నగరంలోని పలు ప్రాంతాల నుంచి భక్తులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్నందున ఆర్టీసీ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయాలని, అదే విధంగా వృద్దులకు, దివ్యాంగుల కోసం ఆటోలను అందుబాటులో ఉంచాలన్నారు. భద్రతా లోపం తలెత్తకుండా పోలీస్ శాఖ పటిష్ట బందోబస్తు నిర్వహించాలన్నారు. భక్తులకు అత్యవసర చికిత్సకై అవసరమైన వైద్య సిబ్బంది, మందులు అందుబాటులో ఉండాలన్నారు. బ్యారీకేడ్, దర్శనం క్యూ లైన్, పార్కింగ్కు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని, ప్రస్తుతం ఎండలు పెరుగుతున్నాయని అందుకు జాతరలో భక్తులకు అందుబాటులో అవసరమైన అన్ని చోట్ల త్రాగునీటిని అందుబాటులో ఉంచాలని వాటర్ వర్క్స్ వారికి తెలిపారు. జాతరలో పరిశుభ్రమైన వాతావరణం ఉండేలా చూడాలని అందుకు సంబంధించి ఎప్పటికప్పుడు శానిటేషన్ చేయాలని ఈ విషయంలో మున్సిపాలిటి అధికారులు అవసరమైన ప్రత్యేక ఏర్పాట్లు చేయాల్సిందిగా తెలిపారు. పూజ సామాగ్రి , ఆహార పదార్థాల నుంచి మొదలుకొని అన్ని రకాల వస్తువుల విక్రయానికి సంబంధించి ధరలు భక్తులకు అందుబాటులో ఉండేలా చూడాలని, ఎక్కువ ధరలకు విక్రయించకుండా అవసరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా సంబంధిత శాఖ అధికారులు వ్యాపారులకు తెలపాలన్నారు. అగ్నిమాపక సిబ్బందితో పాటు ఫైరింజన్‌ను అందుబాటులో ఉంచాలని అదనపు కలెక్టర్ తెలిపారు. అలాగే గుట్ట కింద ఉన్న చెరువు దగ్గర గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచాలని మత్స్య శాఖ అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా కీసర ఆలయంకు సంబంధించి ఏమైనా ఇబ్బందులు, సమస్యలు ఉన్నట్లయితే తన దృష్టికి తీసుకురావాలని ఆలయ ఈవో, ఛైర్మన్ కు తెలిపారు. అత్యవసర విభాగాలైన పోలీసు, ట్రాఫిక్, విద్యుత్తు, ఫైర్, మెడికల్, శానిటేషన్ విభాగాలలో మూడు షిప్టులలో విధులు నిర్వహించేలా సిబ్బందిని ఏర్పాటు చేయాలని అధికారులను సూచించారు. బ్రహ్మోత్సవాలను అధికారులు, ఆలయ కమిటీ సభ్యులు కలిసి విజయవంతం చేయాలని స్పష్టం చేశారు.
ఆన్లైన్ వెబ్‌సైట్ ప్రారంభం..
భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక దర్శనం కల్పించేందుకు ఏర్పాటు చేసిన ఆన్లైన్ వెబ్‌సైట్‌ను అదనపు కలెక్టరు విజయేందర్ రెడ్డి ప్రారంభించారు.ఈ సమావేశంలో ఆర్డిఓ ఉపేందర్ రెడ్డి, పోలీసు, విద్యా, వైద్య, ఆర్‌అండ్‌బి, పంచాయతీరాజ్, ట్రాఫిక్, సమాచార, మత్స్య, ఫైర్, సంబంధిత శాఖ అధికారులు పాల్గొన్నారు.