Tuesday, December 3, 2024
spot_img

అవినీతే పరమావధిగా ఎల్‌.బి.నగర్‌ టౌన్‌ ప్లానింగ్‌, ట్యాక్స్‌ అధికారులు

Must Read
  • వీరికి వత్తాసు పలుకుతున్న ఎల్‌ బి నగర్‌ సర్కిల్‌ 3 డిప్యూటీ కమిషనర్‌..
  • పర్మిషన్లు అవసరం లేదు అమ్యామ్యాలు ఇస్తే చాలు..
  • అనుమతులయ్యాకే డబ్బుల్లో సగం నాకు ఇవ్వండి..
  • సిగ్గు లేకుండా డిమాండ్‌ చేసున్న జిహెచ్‌ఎంసి ఎల్బీనగర్‌ సర్కిల్‌ 3 అధికారులు..
  • జి.హెచ్‌.ఎం.సి ఖజానాకు గండి కొడుతున్న టౌన్‌ ప్లానింగ్‌ ఏ.సి.పి పావని..
  • రాష్ట్ర ప్రభుత్వం ఉన్నతాధికారులు దృష్టి సారించాలంటున్న సామాజిక వేత్తలు..

జి.హెచ్‌.ఎం.సి. ఎల్‌.బీ. నగర్‌ జోన్‌ సర్కిల్‌ 3 టౌన్‌ ప్లానింగ్‌ ఇతర విభాగాల్లో మితిమీరిన అవినీతి రాజ్యం ఏలుతోంది..ఇక్కడ అవినీతి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే..అవినీతికే ఆజ్యం పోస్తున్నారు అనడం వాస్తవ సత్యం. కాగా జి.హెచ్‌.ఎం.సి.ఖజానాకు రావాల్సిన కోట్ల రూపాయల పన్నును సొంత జేబుల్లోకి మళ్లించుకుంటున్న అధికారుల లీలలు ఏమిటో ఈ కథనంలో తెలుసుకుందాం.

ఇంటి పన్ను విధించే హౌస్‌ నెంబర్‌ అలాట్‌ చేసే విభాగం టాక్స్‌ విభాగం.. ప్రజలు ఎక్కడైనా ఇంటి నిర్మాణం చేపడితే దానికి పన్ను విధించి హౌస్‌ నెంబర్‌ అలాట్‌ చేసి జిహెచ్‌ఎంసి సంస్థకు రాబడి పెంచే పనిలో నిమగ్నమై విధులు నిర్వహిస్తుంటారు. అంటే అది ప్రభుత్వ స్థలం కావచ్చు, ఇంకా ఏదైనా కావచ్చు.. మున్సిపాలిటీ ఇచ్చే సౌకర్యాలను అంటే రోడ్డు,సీవరేజ్‌, డ్రైనేజ్‌ వ్యవస్థను వాడుకుంటారు కాబట్టి,ఇంటి నెంబర్‌ అలాట్‌ చేసి, తద్వారా టాక్స్‌ సేకరించి జిహెచ్‌ఎంసి ఖజానాకు చేర్చడం ఉద్యోగుల ప్రధాన విధి. ఈ ప్రక్రియను తమకు అనుకూలంగా మార్చుకుని ఏఎంసీలు, డిప్యూటీ కమిషనర్లు లక్షల్లో..కాదు కాదు కోట్లల్లో సంపాదిస్తున్నారు అనడంలో అతిశయోక్తి కాదు ఇందులో ఎంతో వాస్తవం ఉంది.. ప్రోబిటెడ్‌ ల్యాండ్స్‌, అంటే నిషేధిత భూముల్లో,ప్రభుత్వ స్థలాల్లో సైతం లంచాలు మెక్కేసి అక్రమ నిర్మాణాలకు ఇంటి నంబర్లను జారీ చేయడం అందరికీ తెలిసిన విషయమే..!

జిహెచ్‌ఎంసి నుండి గృహ నిర్మాణ అనుమతులు స్వీకరించి నిర్మాణదారుడు కమర్షియల్‌ నిర్మాణాలు సాగించి తీసుకున్న అనుమతులకు పూర్తి విరుద్ధంగా.. మున్సిపల్‌ నిబంధనలకు..ఫైర్‌ అండ్‌ సేఫ్టీ నిబంధనలకు పూర్తి విరుద్ధంగా నిర్మాణం చేపడితే ఆ నిర్మాణాన్ని కూల్చివేసే అధికారం టౌన్‌ ప్లానింగ్‌ అధికారులకు ఉంటుంది. ఆ అక్రమ నిర్మాణాన్ని కూల్చివేసే ప్రయత్నంలో టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు నోటీసులు అంటూ కాలం వెలదీస్తూ ఉంటే..ఇంతలో ఆ కూల్చివేతకు నేను చెక్‌ పెడతాను అంటూ టాక్స్‌ డిపార్ట్మెంట్‌ అధికారి ఏఎంసీ అసిస్టెంట్‌ మున్సిపల్‌ కమిషనర్‌ సదరు అక్రమ నిర్మాణదారుడితో లక్షల్లో బేరం కుదుర్చుకుని ఎంతో కొంత పెనాల్టీ పన్ను వేసి అసెస్మెంట్‌ చేస్తాడు.. అంటే నిర్మాణదారుడు అతిక్రమించిన నిర్మాణానికి పెనాల్టీ పన్ను వేసి, సక్రమ నిర్మాణం చేశాడని దీనికి అర్థం..

ఈ విషయం తెలియక టౌన్‌ ప్లానింగ్‌ విభాగం అధికారులు నిర్మాణాన్ని కూల్చడానికి వెళ్తే సదరు నిర్మాణదారుడు కోర్టుకు వెళ్లి అయ్యా నేను నిర్మాణ అనుమతి తీసుకున్నాను, ట్యాక్స్‌, పెనాల్టీ పన్ను కూడా కట్టాను.. నా నిర్మాణాన్ని కూల్చిదామని జిహెచ్‌ఎంసి అధికారులు నన్ను ఇబ్బందులకు గురి చేస్తున్నారు అని మొరపెట్టుకుంటాడు.. ఈ విషయాన్ని గ్రహించిన కోర్టు మీరే నిర్మాణ అనుమతులు ఇస్తారు..మీరే సక్రమమని పెనాల్టీ, పన్ను వేసి సక్రమం చేస్తారు..ఇదేం దుర్మార్గం అని మొట్టికాయలు వేసి, సదరు అక్రమ నిర్మాణదారుడికి ఫేవర్‌ గా ఆర్డర్‌ ఇస్తుంది.. దీంతో ఎమోషనల్‌ అయిన టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు జోనల్‌ కమిషనర్‌ స్థాయి అధికారులు,ఎస్‌ టి ఎఫ్‌ టీం..ఫూల్స్‌ గా మిగిలిపోతారు..

ఇక ఈ అవినీతిపై చర్యలు తీసుకోవలసిన జోనల్‌ కమిషనర్‌, ఎస్‌ టి ఎఫ్‌ ఇంచార్జ్‌ ఆయనకు ఉన్న పని ఒత్తిడి బిజీలో ఇవన్నీ మర్చిపోతారు.. ఆహా ఎంత మంచి ఆదాయం అంటూ ఇదే పనిగా డిప్యూటీ కమిషనర్‌, అసిస్టెంట్‌ మున్సిపల్‌ కమిషనర్‌ కింది స్థాయి ఉద్యోగులను కలుపుకొని ఇదే దందాగా రోజూ కొన్ని లక్షల రూపాయలు సొంత జేబుల్లోకి చేరవేసుకుం టుంటారు.. ఈ క్రమంలో కోట్లల్లో జి.హెచ్‌.ఎం.సి ఖజానాకు గండి పడుతోంది.. ఇదంతా కేవలం జిహెచ్‌ఎంసి ఎల్బీనగర్‌ జోన్‌, సర్కిల్‌ 3 లోనే..

ఈ విషయంపై గతంలో ఉన్నతాధికారులు బాగా ఆలోచించి , దొంగకి తాళం చెవి ఇస్తే ఎలా ఉంటుంది..? అనే ఆలోచనతో టౌన్‌ ప్లానింగ్‌ కంప్లైంట్స్‌ స్వీకరించే అధికారాన్ని ఏం.సి.కి అప్ప చెప్పారు. ఉన్నత స్థాయి అధికారులు అవినీతికి చెక్‌ పెట్టాం అడ్డుకట్ట వేసాం అనుకుని ఇటు వైపు కూడా కన్నెత్తి చూడని పరిస్థితి దాపురించింది..ఇంకేముంది దొంగలు తాము ఆడిరది ఆట, పాడిరది పాటగా చెలరేగిపోయి అక్రమ నిర్మాణాలను సక్రమం చేస్తాం అంటూ స్పీడ్‌ పెంచారు.. ఈ స్పీడ్‌ గురించి మరో కథనంలో విశ్లేషించి మరీ చెప్పుకుందాం…అసలు విషయానికి వస్తే ఈ తతంగం తెలిసిన ఓ రాజకీయ నాయకుడు, ఓ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి కొత్త వ్యాపారానికి తెరదీశారు.. ముందుగానే టౌన్‌ ప్లానింగ్‌ అధికారులకు కొంత ముడుపులు చెల్లించి, తదుపరి టాక్స్‌ విభాగానికి ఏ.ఎం.సీ.కి కొంత ముడుపులు చెల్లించి, బి.యన్‌ రెడ్డి నగర్‌, సాగర్‌ కాంప్లెక్స్‌, రోడ్‌ నెంబర్‌ 6లో..జి.హెచ్‌.ఎం.సి. నుండి నిర్మాణ అనుమతులు లేకుండానే డూప్లెక్స్‌, త్రిప్లెక్స్‌ విల్లాస్‌ నాలుగు నిర్మించి,తప్పుడు డాక్యుమెంట్స్‌ తో అమాయకులైన ప్రజలకు అమ్మి మోసం చేసే ప్రయత్నంలో ఉన్నారు.. ఈ అవినీతిని అరికట్టండి అని సామాజిక వేత్తలు వ్రాతపూర్వక ఫిర్యాదులు ఇచ్చి ఉన్నారు..ఈ ఫిర్యాదులపై ‘ ఆదాబ్‌ హైదరాబాద్‌ ‘ పలుమార్లు కన్స్ట్రక్షన్‌ మొదటి దశలో ఉన్నప్పుడు వార్త రూపకంగా అధికారులకు తెలియపరచి, వార్త ప్రచురించింది..2024 ఏప్రిల్‌ నెలలో ‘అక్రమ నిర్మాణాలు.. ఓ బిల్డర్‌ అవినీతి వ్యాపారం’ అంటూ చక్కటి శీర్షికతో అవినీతి బాగోతాన్ని బట్టబయలు చేసి అధికారులకు తెలియపరచింది. ఈ విషయంపై ఉన్నతాధికారి జోనల్‌ కమిషనర్‌.. కిందిస్థాయి అధికారులకు మొట్టికాయలు వేశారు.. పాపం అప్పటి జోనల్‌ కమిషనర్‌ కి ఈ అవినీతి అధికారుల గురించి తెలియదు..తదుపరి జోనల్‌ కమిషనర్‌ ట్రాన్స్ఫర్‌ కావడం,కొత్తగా జోనల్‌ కమిషనర్‌ ఐ.ఏ.ఎస్‌ హేమంత్‌ పాటిల్‌ రావడంతో.. సార్‌ కి తెలియజేయడం కోసం మరలా రెండు వార్తలు రాసి, ఫిర్యాదు వార్తలు సార్‌ కి ప్రజావాణిలో తెలియపరిచాము..సార్‌ ఈ దొంగలకే పని చెప్పడంతో పని చేశామని తల ఊపేసి సార్‌ ని మోసం చేస్తున్నారా..? ఇంత అవినీతి జరుగుతున్నా చర్యలు తీసుకోకపోవడంపై స్థానిక ప్రజానీకం ముక్కున వేలేసుకుంటున్నారు..

ఈ అవినీతిపై పలుమార్లు ఎల్‌.బీ. నగర్‌ జిహెచ్‌ఎంసి సర్కిల్‌ 3 డిప్యూటీ కమిషనర్‌ తిప్పర్తి యాదయ్య కి ఈ అక్రమ నిర్మాణం ప్రాథమిక దశ నుండి పలుమార్లు తెలియపరిచినా ఆయన నివారించలేకపోవడం జరిగింది.. ఈ విషయంపై వివరణ కోరగా ఆయన ముఖం చాటేయడం కూడా జరిగింది.. తిప్పర్తి యాదయ్య జిహెచ్‌ఎంసి ఎంప్లాయిస్‌ యూనియన్‌ నాయకులు కావడం, కార్మిక సమస్యలపై బిజీగా ఉండడం,ఈ చిన్న చిన్న విషయాన్ని లైట్‌ తీసుకొని పట్టించుకోకపోవడంలో అంతరంగం ఏమిటో..? ఉన్నత స్థాయి ఎస్టిఎఫ్‌ ఇంచార్జ్‌ జోనల్‌ కమిషనర్‌ పాటిల్‌ సారే గ్రహించాలి..!

ఎల్‌.బీ. నగర్‌ జోన్‌ జిహెచ్‌ఎంసి సర్కిల్‌ 3 డిప్యూటీ కమిషనర్‌ తిప్పర్తి యాదయ్య కార్మిక నాయకుడుగా బిజీగా ఉంటారు.. ఆయనను ఎందుకు డిస్టర్బ్‌ చేయాలి అని టౌన్‌ ప్లానింగ్‌ సర్కిల్‌ 3 ఇంచార్జ్‌ ఏసిపి పావనిని ఈ అక్రమ నిర్మాణాలు అవినీతిపై ప్రశ్నిస్తే.. దురుసుగా, కోపంగా వ్యవహరించడం.. నోటీసుల వరకే పనిని కొనసాగించి ఉన్నత అధికారులకు కల్లబొల్లి అబద్ధాలు, మాయ మాటలు చెప్పి అవినీతిని కప్పిపుచ్చి, భారీగా మూడుకులు స్వీకరించారని గుసగుసలు వినిపిస్తున్నాయి..

బి.యన్‌.రెడ్డి నగర్‌,సాగర్‌ కాంప్లెక్స్‌ స్థానిక ప్రజానీకం ఈ విషయంపై ‘ ఆదాబ్‌ హైదరాబాద్‌ ‘ తో పలుమార్లు మొరపెట్టుకోవడం..మేము వార్తలు రాయడం..స్థానిక అధికారుల స్పందన కరువు కావడం..పరిపాటిగా జరుగుతోంది..దీంతో మేము అసహనానికి గురవుతున్నాం..ఈ విషయంపై జిహెచ్‌ఎంసి కమిషనర్‌ అమరపాలి కాటా,జిహెచ్‌ఎంసి విజిలెన్స్‌ డైరెక్టర్‌ హైడ్రా డైరెక్టర్‌ రంగనాథ్‌ దృష్టి సారించి ఈ అవినీతికి చెక్‌ పెట్టాలి అని స్థానిక ప్రజానీకం కోరుతున్నారు.

Latest News

నకిలీ కెనాన్ టోనర్లను స్వాధీనం చేసుకున్న బెంగళూరు పోలీసులు

బెంగళూరు పోలీసులు మంగళవారం మై ఛాయిస్ ఐటీ వరల్డ్ పై దాడి చేసి నకిలీ కెనాన్ ప్యాక్డ్ టోనర్లను స్వాధీనం చేసుకున్నారు. అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS