- సర్వాయిపేటను టూరిజం సర్కిల్ గా మారుస్తాం
- సర్వాయి కోట అభివృద్ధి శంకుస్థాపనలో రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
సర్దార్ సర్వాయి పాపన్న(Sarvai Papana) చరిత్రను దేశానికి చాటి చెపుతామని, కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం సర్వాయిపేట గ్రామంలోని సర్వాయి కోటను టూరిజం సర్కిల్ గా అభివృద్ధి చేస్తామని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ అన్నారు. సైదాపూర్ మండలం సర్వాయిపేట గ్రామంలో రూ.4 కోట్ల 70 లక్షలతో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ కోట పర్యాటక అభివృద్ధికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా సర్వాయిపేట కోటగుట్టపై సర్వాయి పాపన్న విగ్రహానికి పూలమాల వేసి జోహార్లు అర్పించారు. అనంతరం ఇక్కడ ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ రాబోయే తరాలు సర్దార్ పాపన్న తెలివి, ధైర్యం, తెగువను ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. అరాచకానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి సామాజిక న్యాయం కోసం పోరాడిన సర్వాయి పాపన్న నేలనీ అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇక్కడి హనుమంతుని గుడి, మహమ్మదాపూర్ గుట్ట, మహాసముద్రం గండినీ అభివృద్ధి చేసి ఈ ప్రాంతాన్ని టూరిజం సర్కిల్ గా మారుస్తామని తెలిపారు. సర్వాయి కోట పనులు పూర్తయ్యాక ముఖ్యమంత్రితో ప్రారంభోత్సవం చేస్తామని, మరిన్ని నిధులతో మరో దశ అభివృద్ధినీ కొనసాగిస్తామని తెలిపారు. ఇక్కడి ప్రాంత ప్రజల జీవన స్థితిగతులను మరింత మెరుగుపరుస్తామని తెలిపారు. జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి మాట్లాడుతూ టూరిజం శాఖ నుండి సర్వాయి పాపన్న కోట అభివృద్ధికి నాలుగు కోట్ల 70 లక్షల రూపాయలు మంజూరు అయ్యాయని అన్నారు. టూరిజం అభివృద్ధి అయితే చుట్టుపక్కల గ్రామాలు అభివృద్ధి చేందుతాయని తెలిపారు.
వెన్నంపల్లిలో సహకార సంఘ భవనం, గోదాం ప్రారంభం
వెన్నంపల్లిలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం భవన కార్యాలయం ప్రారంభించిన అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ విద్యార్థి విభాగం నుంచి వచ్చిన తాను సహకార రంగంలో సేవ చేశానని అన్నారు. రైతు బిడ్డనైన తనకు రైతు అవసరాలు తెలుసని అన్నారు. రాజకీయాలకు, సహకార సంఘాలకు సంబంధం లేదని, సహకార సంఘాల అభివృద్ధికి అన్ని విధాలుగా సహకరిస్తానని తెలిపారు. వరద కాలువ ఫేస్ 2 ద్వారా సైదాపూర్, చిగురుమామిడి మండలాలకు సాగునీరు అందించనున్నని తెలిపారు. గౌరవెల్లి నుండి భీమదేవరపల్లి మండలానికి, దేవాదుల ద్వారా ఎల్కతుర్తి మండలానికి నీరు అందిస్తామని వివరించారు. రెండు లక్షల రూపాయల లోపు ఉన్న రైతు రుణాలన్నీ మాఫీ చేశామని, రెండు లక్షల పైన ఉన్న రుణాలన్నీ మాఫీ చేస్తామని తెలిపారు. పంట వేసినా వేయకుండా రైతు భరోసా అందిస్తామని, ఇల్లు లేని వారందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని తెలిపారు. హుస్నాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి అట్టి విధాలా కృషి చేస్తానని, ఏ సమస్య ఉన్నా తన వద్దకు తీసుకురావాలని కోరారు.
మోడల్ స్కూల్ అభివృద్ధికి రూ.60 లక్షలు
సైదాపూర్ లోని మోడల్ స్కూల్లో అభివృద్ధి పనులకు 60 లక్షల రూపాయలు మంజూరు చేసినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. శుక్రవారం మోడల్ స్కూల్ ని సందర్శించిన మంత్రి విద్యార్థులతో మాట్లాడారు. గతంలో వచ్చిన వరదను దృష్టితో ఉంచుకొని మోడల్ స్కూల్ కాంపౌండ్ వాల్ కోసం రూ.48 లక్షలు, వంట గది, టాయిలెట్ల నిర్మాణానికి రూ.12 లక్షలు మంజూరు చేస్తున్నామని అన్నారు. కరీంనగర్ జిల్లా యంత్రాంగం తరపున ఇప్పటికే విద్యార్థులందరికీ సులు పంపిణీ చేసినట్లు తెలిపారు. డైట్ చార్జీలు కాస్మోటిక్ చార్జీలు పెంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని హాస్టలలో కామన్ డైట్ మెనూ అమలు చేస్తున్నామని అన్నారు. విద్యార్థులు చదువుకొని వివిధ రంగాల్లో రాణించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, అడిషనల్ కలెక్టర్ ప్రపుల్ దేశాయి, ట్రైనీ కలెక్టర్ అజయ్ యాదవ్, సహకార సంఘం అధ్యక్షులు వెంకటరెడ్డి, తిరుపతి రెడ్డి, తెలంగాణ గౌడ్ సంఘం అధ్యక్షులు భువనగిరి యాదగిరి గౌడ్, బత్తిని శ్రీనివాస్ గౌడ్, బేరాల గోపాలరావు, ప్రభాకర్ రెడ్డి, సుధాకర్, రాజు తదితరులు పాల్గొన్నారు.