- శబరిమల వెళ్ళలేని మంజుమాతలు (మహిళా భక్తులు) కోసం అనాదిగా వస్తున్న ప్రత్యేక ఆచారం
- ప్రతి సంవత్సరం జనవరి 21న ఇక్కడ అవే తిరువాభరణాలను అలంకరిస్తారు
- శబరిమల నుండి తిరుగు ప్రయాణంలో ఇక్కడ ఒక రోజు జాతర ముగిసిన తర్వాతనే పందలం చేరుకుంటాయి
- “ఆదాబ్” కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చిన శబరిమల ఆచార సంరక్షణ సమితి సెక్రటరీ జి పృథ్వీపాల్
- అన్ని తానై చూసుకుంటూ అద్భుత అడ్మినిస్ట్రేషన్ ప్రదర్శిస్తున్న డిప్యూటీ కలెక్టర్ శ్రీమతి రాజ్యలక్ష్మి
పెరునాడ్. ఇది కేరళలోని(Kerala) పట్టణం తిట్ట జిల్లాలో ఉన్నది. ఇక్కడ ఉన్న శ్రీధర్మశాస్త వారి ఆలయం మహా మహిమాన్వితమైనది, అతి పవిత్రమైనది. మణికంఠుడి తండ్రివారైన రాజరాజశేఖర పాండ్యన్ మహారాజు కట్టించిన ఆలయం ఇది. భక్తులకు ఆనందం కలిగించే విషయం ఏమిటంటే, శబరిమల లోని శ్రీ అయ్యప్ప స్వామికి(AYYAPPA SWAMY) అలంకరించిన తిరువాభరణాలు ఇక్కడ ఉన్న శ్రీధర్మ శాస్త వారికి కూడా అలంకరిస్తారు. పందల రాజ పుణ్య దంపతులు చేయించిన వజ్ర వైడ్యూర్యాలు, బంగారు ఆభరణాలను మకర సంక్రాంతి రోజు శబరిమల అయ్యప్ప స్వామికి అలంకరిస్తానన్న విషయం తెలిసిందే. అక్కడ దాదాపు జనవరి 19 లేదా 20 వరకు స్వామికి అలంకరణగా ఉంచుతారు. ఆ తరువాత తిరుగు ప్రయాణం అయ్యేటప్పుడు “రాన్ని పెరు నాడు”లోని శ్రీ అయ్యప్ప స్వామి ఆలయంలోని మూలవిరాట్ కి అవే ఆభరణాలను అలంకరిస్తారు. ఇలా చేయడం వెనుక ఒక గొప్ప విశేషం ఉన్నది. మంజు మాత (మహిళలు) శబరిమల ఆలయం సందర్శించాలంటే కొన్ని నియమాలు ఉన్నాయి. అక్కడ వెళ్లలేని భక్తులకు, ముఖ్యంగా మహిళా భక్తుల కోసం, ఈ సదుపాయం అనాదిగా, ఆచారంగా వస్తున్నది. శబరిమల వెళ్లలేదన్న బాధ లేకుండా మహిళా భక్తులు (మంజు మాతాలు) ఇక్కడ స్వామివారిని తిరువాభరణలంకరణలో చూసి మంత్రముగ్ధులవుతారు.
ఒకప్పుడు శబరిమలకు బేస్ క్యాంప్ గా ఉన్న పెరునాడు: పృథ్వి పాల్, శబరిమల ఆచార సంరక్షణ సమితి సెక్రటరీ.
మనము శబరిమల గురించి తెలుసుకునే ముందు, పందల రాజ వంశస్తుల గురించి రెండు మాటలు చెప్పుకుందాం. వీరు ఒకప్పుడు తమిళనాడు ప్రాంతంలోని మధురై కి చెందిన వాళ్లు. మధుర మీనాక్షమ్మ వీరి కులదేవత. ప్రతిక్షణం ఏదో ఒక యుద్ధంలో పాల్గొనాల్సి వచ్చేటిది. ఆ వంశంలోని ఒకానొక కుటుంబం వారు అసలు ఎందుకు ఈ పగలు, కోపాలు, యుద్ధాలు అని ఆలోచించారు. ప్రపంచ శాంతికై ప్రసన్నమైన ప్రాంతం కోసం వెతికారు. వందల సంవత్సరాలుగా పాలిస్తున్న రాజ్యమును వదిలి ఆ ప్రశాంతమైన వాతావరణంలోకి చేరుకున్నారు. ఆ ప్రాంతమే పందలం. అన్ని రకాల మనుషులకు, అన్ని వర్గాలకు సమతా భావానికి పెట్టింది పేరుగా ఈ ప్రాంతం వాళ్లకు అనిపించింది. వారికి లభించిన వారే మణికంఠుడు. ప్రపంచ శాంతిని తేగలిగే కలియుగ దైవమే వారికి లభించారు. స్వామివారి బాల్యం, విద్యా వగైరా అయిన తర్వాత ధ్యానంలోకి వెళతానని తల్లిదండ్రులకు చెప్పిన మాట మనందరికీ తెలిసిందే. ఆ ధ్యాన యోగ స్థానమే శబరిమల. శబరిమల ఆలయం నిర్మించడానికి ఇప్పుడున్న పెరునాడు ప్రాంతాన్ని బేస్ క్యాంపుగా రాజావారు ఉపయోగించారు. ఆ తరువాత ఈ పెరునాడులో స్వామివారికి ఆలయం కూడా కట్టించారు. అటుపక్కనే మాలికాపురోత్తమ లోక దేవి శ్రీ మంజుమాత వారి ఆలయం సైతం కట్టించారు. ఆ మాలికాపురోత్తమ ఎవరో కాదు, సాక్షాత్తు రాజ వంశస్థుల కులదేవత అయిన మధుర మీనాక్షమ్మ వారి అవతారం. పందలంలో అనుసరింపబడే ప్రతి నియమాలు రాజావారు ఇక్కడ స్థాపించారు. సర్వ ధర్మ సమ భావన కోసం పాటుపడాలని గురుస్వాములకు ఆదేశించారు. మధురై లో ఉన్న విధంగానే ఇక్కడ కూడా అతి ఎత్తైన గోపురాలు కట్టించారు. ఒక్కొక్క గోపురం దాదాపు 185 అడుగులు ఉంటుంది. అలాంటివి తొమ్మిది వరకు మనము ఈ ప్రాంతంలో చూడవచ్చు. శబరిమల లోకి వెళ్లాలంటే దీక్ష వ్రతం చేసి ఇరుముడి తో మాత్రమే వెళ్లాలి. అలా వెళ్లలేని వారు ముఖ్యంగా నియమాలు వర్తించే మహిళలు (మంజమాతలు) ఇక్కడ శ్రీధర్మశాస్త వారిని దర్శించుకుంటారు. ఇది పందల రాజు వారు ఆదేశించిన విధంగా నేటికీ జరుగుతున్నది.
గత 30 సంవత్సరాలుగా మన మహబూబ్ నగర్ గురుస్వాముల తో అనుబంధం
ఒకప్పుడు ఉమ్మడి పాలమూరు జిల్లా. ఇప్పుడు నారాయణపేట జిల్లా. ఇక్కడి అయ్యప్ప స్వామి బృందం ని తయారు చేసింది జాజాపూర్ సిద్ది రామప్ప, గందె చంద్రకాంత్ (ప్రస్తుత మున్సిపల్ చైర్మన్), పోషల్ నారాయణ గురుస్వాములు తదితరులు. వీరందరూ గత 30 సంవత్సరాల క్రితమే ఇక్కడ పెరునాడులో ఒక అయ్యప్ప స్వామి ఆలయం ఉన్నదని తెలుసుకొని, ఆ మహిమాన్విత కోవెల యొక్క గొప్ప చరిత్రని ప్రచారం చేశారు. ఆ కాలంలో ఇక్కడ ఎలాంటి సదుపాయాలు ఉండేవి కాదు. గురుస్వాముల బృందం అంతా ఆర్థికంగా విరాళాలు సమకూర్చి అప్పట్లో ఈ గొప్ప ఆలయానికి ఒక షెడ్డు, మిగతా సేవా కార్యక్రమాలు చేశారు. అప్పట్లో ఒకరిద్దరితో ప్రారంభమైన ఈ బృందం నేడు 200కు పైగా ఈ ఊరి నుండి బయలుదేరి శబరిమల స్వామి దర్శనమైన తర్వాత ఈ గుడిలో నాలుగు రోజులు సేద తీరుతారు. ప్రతి సంవత్సరం జనవరి 21న పందలంలోని తిరువాభరణాలను ఇక్కడ ఆలయంలో స్వామికి అలంకరించిన తర్వాత మహిళా భక్తుల ఆనందానికి అవధులు లేకుండా ఉంటాయి. ఆరోజు ఇక్కడ ఒక పెద్ద జాతర.