మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారానికి తెరపడింది. రేపు మహారాష్ట్రలో 288 అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతలో ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 4,136 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. వీరిలో 2,086 మంది స్వతంత్ర అభ్యర్థులు ఉన్నారు. మహారాష్ట్రలో 9,63,69,410 మంది ఓటర్లు ఉండగా వీరికోసం రాష్ట్రవ్యాప్తంగా 1,00,186 పోలింగ్ బూత్‌లను కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది.
మహారాష్ట్ర ఎన్నికల నేపథ్యంలో నాయకులు ప్రచారాన్ని హోరెత్తించారు. ప్రధాని మోదీ, కేంద్రమంత్రులు, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ, ఇండియా కుటమిలోని ముఖ్యనేతలు ప్రచారంలో పాల్గొన్నారు. అధికార కూటమి మహాయుతిలో భాగమైన బిజెపి 149 స్థానాల్లో అభ్యర్థులను నిలిపింది. ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన 81 మందిని బరిలోకి దింపింది. విపక్ష కూటమి మహావికాస్ అఘాడీ (ఎంవీఏ) లో భాగంగా కాంగ్రెస్ పార్టీ 101 మంది అభ్యర్థులను బరిలో నిలిపింది. శివసేన యూబీటీ 95 మందిని, ఎన్సీపీ శరద్ పవార్ పార్టీ 86 మందిని పోటీలోకి దింపింది.