- మీసారాలో పెట్టుబడులు పెడుతున్నారా తస్మాత్ జాగ్రత్త
- అమాయకులను బురిడి కొట్టించడంలో మీసారా దిట్ట
- ఫ్రీ లాంచ్ పేరుతో కోట్ల రూపాయలు దండుకుంటున్న వైనం..
- పర్మిషన్స్ లేకుండా జోరుగా కొనసాగుతున్న వ్యాపారం..
- ప్రభుత్వ పెద్దల మద్దతు ఉందంటూ కోతలు కలర్ ఫుల్ బ్రోచర్లతో కలరింగ్
- వారి మాయలో పడ్డారా బ్రతుకులు మాయమైనట్టే
- కోట్ల రూపాయలు దండుకోవడానికి మీసారా ఇన్ఫ్రా ఎండి మారెళ్ళ పెంచల సుబ్బారెడ్డి స్కెచ్..
హైదరాబాద్ లో వేగంగా విస్తరిస్తున్న రంగాల్లో రియల్ ఎస్టేట్ కూడా ఒకటి. నగరంలో ఈ రంగం ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందో అంతే వేగంగా మోసగాళ్లు కూడా పుట్టుకోస్తున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా ఇష్టం వచ్చినట్టు తమ సంస్థలను నెలకొల్పి కోట్ల రూపాయలను దండుకుంటూ అమాయక ప్రజలను బురిడికొట్టిస్తున్నారు. ఇప్పటికి ఎన్నో రియల్ ఎస్టేట్ సంస్థలు చేస్తున్న మోసాలను వెలుగులోకి తీసుకువచ్చిన ఆదాబ్ హైదరాబాద్ తాజాగా మరో రియల్ ఎస్టేట్ సంస్థ చేస్తున్న మోసాన్ని వెలుగులోకి తెచ్చింది.
వివరాల్లోకి వెళ్తే…హైదరాబాద్ లోని కొల్లూరులో రియల్ ఎస్టేట్ కు డిమాండ్ ఎక్కువ. చాలా మంది ఇక్కడ తక్కువ ధరకు అపార్ట్మెంట్, విల్లాస్ కొనుగోలు చేయడానికి ఆరాటపడుతుంటారు. ఇదే అదునుగా మధ్యతరగతి ప్రజల బలహీనతను ఆసరాగా చేసుకొని మీసారా ఇన్ఫ్రా డెవలపర్స్(Mesara Infra Developers) మోసాలకు పాల్పడుతుంది. ఈ సంస్థ చేస్తున్న మోసాలను ఆదాబ్ హైదరాబాద్ దినపత్రిక గత నెల 11న ‘‘ఫ్రీ లాంచ్ తో ఫ్రీగా మోసం’’ అనే పేరుతో ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది.
ఈ సంస్థ చేస్తున్న మోసాలపై మరింత లోతుగా దర్యాప్తు చేపట్టిన ‘‘ఆదాబ్ హైదరాబాద్ ‘‘ప్రతినిధి మరిన్ని సంచలన నిజాలను వెలుగులోకి తీసుకురావడం జరిగింది.
అసలు ఈ సంస్థను స్థాపించిన డైరెక్టర్లకు రియల్ ఎస్టేట్ రంగంలో ఎలాంటి అనుభవం లేదు. సంస్థను స్థాపించి.. అమాయక ప్రజలను మాయమాటలతో బురిడి కొట్టించి.. కోట్ల రూపాయలను దండుకోవాలనే ఉద్దేశంతో మూడు నెలల క్రితం ఈ సంస్థను స్థాపించడం జరిగింది.
మరోవైపు కొల్లూరులో డెవలప్మెంట్ కోసం రైతుల వద్ద నుండి 30 ఎకరాల భూమి తీసుకున్నామని చెప్పుకుంటున్నారు. కానీ వీరు చెబుతున్నటువంటి 30 ఎకరాల స్థలం లో ఇదివరకే జిపి లే అవుట్ చేసి, అనేక మంది కస్టమర్లకు ప్లాటు చొప్పున అమ్మడం జరిగింది. అయితే ప్లాట్లు కొనుగోలు చేసిన వారు ఎల్‌ఆర్‌ఎస్ కట్టలేదు. ఇదిలా ఉండగా ఆన్లైన్లో రైతులు పేరు మీద కొంత భూమి ఉండటం గమనించిన సుబ్బారెడ్డి, స్కాం చేయడానికి ప్రణాళిక రచించాడు. ఎవరి పేరు మీద భూమి ఉందొ, రైతులను సంప్రదించి.. వారికి కొంత మొత్తంలో డబ్బును సమకూర్చి… వారి వద్ద నుండి దర్జాగా డెవలప్మెంట్ అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది.
ఇక ప్లాన్ ప్రకారం, మాదాపూర్ లో నామ మాత్రంగా ఒక కార్యాలయాన్ని నెలకొల్పి.. తమ కంపెనీ పేరు మీద మొత్తం 30 ఎకరాలలో మెగా గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టు నిర్మాణం చేపడుతున్నామని ప్రచారం చేసుకున్నాడు.
అంతే కాకుండా పది ఎకరాల్లో విల్లాస్ డెవలప్మెంట్, పది ఎకరాల్లో అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్షన్, మరొక ఏడు నుంచి ఎనిమిది ఎకరాలలో కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మిస్తున్నామని జోరుగా ప్రచారం చేసుకుంటూ వస్తున్నాడు.
పెద్ద ఎత్తున ఎజెంట్లను నియమించుకొని.. వారికి అతిపెద్ద మొత్తంలో కమిషన్ ఏరా చూపి..వారి చేత అమాయక కస్టమర్లను టార్గెట్ చేసి.. ఇప్పటివరకు సుమారుగా 50 కోట్ల వరకు దండుకున్నాడు.
ఈ సంస్థ చేస్తున్న మోసాలను బట్టబయలు చేయడానికి ఆదాబ్ హైదరాబాద్ ప్రతినిధి కస్టమర్ రూపంలో మీసారా ఇన్ఫ్రా కార్యాలయాన్ని సంప్రదించగా, ప్రాజెక్ట్ గురించి పొంతన లేని సమాధానాలు చెప్పడం జరిగింది. ‘‘ఇప్పుడు ఎలాంటి పర్మిషన్స్, రేరా అవసరం లేదు..ముందు డబ్బులు కట్టండి.. అతి తక్కువ ధరకే మేము మీకు స్థలం ఇస్తామని చెప్పడం జరిగింది.
అంతే కాకుండా, ఆదాబ్ హైదరాబాద్ దినపత్రికలో వచ్చిన కథనం గురించి అడగగా, ‘‘అధికారులు కానీ, మీడియా వారు కానీ..మమ్మల్ని ఏమీ చేయలేరు.. ఎందుకంటే మాకు ప్రభుత్వ పెద్దల నుండి సపోర్ట్ ఉందని… మీడియాపై కేసులు పెడతాం అంటూ చెప్పడం గమనార్హం.
మీసారా ఇన్ఫ్రా డెవలపర్స్ సంస్థ డైరెక్టర్ ఈ సుబ్బారెడ్డికి ప్రభుత్వ పెద్దల నుండి ఎలాంటి సపోర్ట్ ఉంది..?? వీరికి ఇంతగా సపోర్ట్ చేస్తున్న ఆ వారు ఎవరు..??దీని వెనక ఉన్న శక్తులు ఎవరు?? వీరు చెబుతున్న స్థలంలో అపార్ట్మెంట్స్ కోసం స్థలం బుక్ చేసుకున్న వారి పరిస్థితి, జిపి లేఔట్ లో ఫ్లాట్లు కొన్న వారి పరిస్థితి ఏమిటి?? ఇలా మరెన్నో వివరాలను మీ ముందుకు తీసుకురానుంది ఆదాబ్ హైదరాబాద్.