- సోమవారం నుండి ప్రారంభంకానున్న వర్షాకాల పార్లమెంటు సమావేశాలు
- మంగళవారం ఆర్థిక బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్
- పలు కీలక బిల్లులతో పాటు,జమ్ముకాశ్మీర్ బడ్జెట్ కూడా..
- కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం
- సమావేశాలు సజావుగా సాగేందుకు సహకరించాలని కోరిన కేంద్రం
- నీట్ సమస్యను సభలో చర్చించాలని కాంగ్రెస్ డిమాండ్
- కేంద్ర దర్యాప్తు సంస్థలను బీజేపీ దుర్వినియోగం చేస్తుందంటూ విపక్ష నేతల ఫైర్
- ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కల్పించాలి : వైసీపీ ఎంపీలు
సోమవారం నుండి వర్షాకాల పార్లమెంటు సమావేశాలు జరగనున్నాయి.సమావేశంలో భాగంగా మొదటి రోజు ఆర్థిక సర్వేను సభలో సమర్పించి,మంగళవారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ పూర్తిస్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు.డిజాస్టర్ మేనేజ్‌మెంట్ బిల్లు-2024,బాయిలర్ బిల్లు-2024,ఇండియన్ ఎయిర్‌క్రాఫ్ట్ బిల్లు-2024,కాఫీ (ప్రమోషన్ అండ్ డెవలప్‌మెంట్) బిల్లు-2024 , రబ్బర్ (ప్రమోషన్ అండ్ డెవలప్‌మెంట్) బిల్లులను కూడా బడ్జెట్ సెషన్ లో ఆమోదించడానికి కేంద్రప్రభుత్వం ప్రయత్నిస్తుంది.ఈ బిల్లులతో పాటు కేంద్రపాలిత ప్రాంతమైన జమ్ముకాశ్మీర్ బడ్జెట్ ను కూడా సమర్పించనుంది.
కేంద్ర దర్యాప్తు సంస్థల దాడుల పై చర్చించాలని విపక్ష నాయకుల డిమాండ్ :
పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జరగనున్న నేపథ్యంలో ఆదివారం ఢిల్లీలో కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం జరిగింది.ఈ సమావేశానికి కేంద్ర మంత్రులు రాజ్ నాథ్ సింగ్,కిరణ్ రిజిజు,జేపీ నడ్డా,అర్జున్ రామ్ మేఘ్‌వాల్‌తో పాటు వివిధ పార్టీల పార్లమెంటరీ పక్ష నేతలు పాల్గొన్నారు.పార్లమెంట్ సెషన్‌లో ప్రభుత్వ ఎజెండా, ప్రవేశపెట్టబోయే బిల్లుల గురించి ప్రభుత్వం రాజకీయపార్టీలకు తెలియజేసింది.పార్లమెంట్ సమావేశాలు సజావుగా సాగేందుకు సహకరించాలని ఈ మేరకు విపక్ష నాయకులను ప్రభుత్వం కోరింది.ఇదిలా ఉండగా,నీట్ సమస్య పై సభలో చర్చించాలని కాంగ్రెస్ తో పాటు ఇతర విపక్ష పార్టీల నేతలు పట్టుబట్టారు.లోక్ సభ డిప్యూటీ స్పీకర్ పదవిను విపక్షాలకు కేటాయించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది.బీజేపీ కేంద్ర దర్యాప్తు సంస్థలైన ఈడీ,సీబీఐ ను దుర్వినియోగం చేస్తుందని విపక్ష నేతలు విమర్శించారు.దర్యాప్తు సంస్థలు చేస్తున్న దాడులపై కూడా చర్చించాలని వారు పట్టుబట్టారు.
ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కల్పించాలి
ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కల్పించాలని వైసీపీ నేతలు పట్టుబట్టారు.కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించయని,అందుకు రాష్ట్రపతి పాలన విధించాలని కోరారు.వైసీపీ పార్టీ నుండి ఎంపీలు విజయసాయి రెడ్డి,మిథున్ రెడ్డి అఖిలపక్ష సమావేశానికి హాజరయ్యారు.
మరోవైపు బీహార్ కు ప్రత్యేక స్టేటస్ ఇవ్వాలని జేడీయూ,ఒడిశా రాష్ట్రానికి ప్రత్యేక హోదా కేటాయించాలని బీజేడీ నేతలు డిమాండ్ చేశారు.కన్వర్ యాత్రపై యూపీ ప్రభుత్వం ఆంక్షలు విధించడాన్ని సమాజ్ వాదీ పార్టీ ప్రస్తావించింది.కాంగ్రెస్ నుంచి జైరామ్ రమేశ్,కె. సురేశ్,టీడీపీ నుంచి లావు శ్రీకృష్ణ దేవరాయలు,బీఆర్ఎస్ నుండి కే.ఆర్ సురేశ్ రెడ్డి,ఎంఐఎం నుంచి అసదుద్దీన్ ఓవైసీ,లోక్ జనశక్తి నుంచి చిరాగ్ పాశ్వాన్,జనసేన నుంచి బాలశౌరి తదితరులు హాజరు కాగా తృణమూల్ కాంగ్రెస్ నుండి ఎవ్వరూ కూడా ఈ సమావేశానికి హాజరు కాలేదు.ఉభయ సభలు సజావుగా సాగేందుకు విపక్ష నాయకులు సహకరించాలని కిరణ్ రిజిజు కోరారు.దేశవ్యాప్తంగా ఉన్న సమస్యలను లేవనెత్తడానికి ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వాలని గౌరవ్ గోగోయ్ కోరారు.తినుబండారాల యజమానుల పేర్లను ప్రదర్శించాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం వివాదాస్పద ఆదేశాన్ని సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ రామ్ గోపాల్ యాదవ్ తప్పుబట్టారు.ఈ సమావేశంలో అన్ని పార్టీలకు ఈ బిల్లులన్నింటికి సంబంధించిన సమాచారాన్ని కేంద్ర ప్రభుత్వం అందించింది.