Friday, November 22, 2024
spot_img

దోచుకున్నోడికి దోచుకున్నంత..!

Must Read
  • ప్రతిష్టాత్మక వెబ్ సైట్ లో ఎన్నో లోపాలు.. ధరణి ధరిద్రంకన్నా ఎక్కువ పాపాలు
  • అధికారులకు కోట్ల వర్షం కురిపిస్తున్న టీఎస్.బీ పాస్
  • డి.పి ఎం.ఎస్‌ రద్దుచేసి టీఎస్.బీ పాస్ తీసుకొచ్చిన కేసీఆర్
    కొత్త మున్సిపల్ చట్టం టి.ఎస్‌.బి పాస్‌ తో అక్రమార్కులు, అధికారులకే లాభం
  • గత టీఆర్ఎస్ సర్కార్ హయాంలో ప్రారంభమైన ఆన్ లైన్ సర్వీస్
  • జీహెచ్ఎంసీ సహా జిల్లాల్లోని మున్సిపాల్టీ ఎంప్లాయిస్ కాసుల పంట
  • ఐఏఎస్ లాంటి ఉన్నతాధికారి పర్యవేక్షణ కరవు
  • సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్న ఆన్ లైన్ సిస్టం
  • తమకు అనుగుణంగా మార్చుకున్న నాటి పాలకులు
  • కొత్త సర్కార్ అయినా దృష్టిసారిస్తే ఎందరికో మేలు
  • పాత మున్సిపల్ చట్టమే బెటర్ అంటున్న నిపుణులు
  • పరిశోధనాత్మక పాత్రికేయులు ఎం. వేణుగోపాల్‌ రెడ్డి

గత టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన చట్టం కొత్త మున్సిపల్‌ చట్టం టి.ఎస్‌.బి పాస్‌. టి.ఎస్‌.బి.పాస్‌ కొత్త మున్సిపల్‌ చట్టాన్ని చట్టసభలో ప్రవేశపెట్టే ముందు గత మున్సిపల్‌ శాఖమంత్రి కేటీ రామారావు. తెలంగాణ భవిష్యత్‌ పట్టణ అభివృద్ధి భవిష్యత్‌ దృష్టిలో ఉంచుకొని ఇరుకు రోడ్లు ఇరుకు భవనాలు, నాలాల కబ్జా నియంత్రించాలని, బిల్డింగుల్లో ఫైర్‌ యాక్సిడెంట్లు జరగకుండా ఉండాలనే దృఢ సంకల్పంతో, అక్రమ నిర్మాణంపై ఫిర్యాదు చేసిన కొన్ని గంటల్లోనే నోటీస్‌ ఇవ్వకుండానే మున్సిపల్‌ సిబ్బంది ఆ అక్రమ నిర్మాణాన్ని గుర్తించి అక్రమ నిర్మాణంపై చర్యలు తీసుకోవాలి. అక్రమ నిర్మాణాన్ని నేలమట్టం చేయాలి, కూల్చివేయాలి అనే విషయాలను తెలియపరుస్తూ భవిష్యత్తు అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని బృహత్తరమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలనే మంచి ఉద్దేశంతో టి.ఎస్‌.బి పాస్‌ కొత్త మున్సిపల్‌ చట్టాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఇందులో ఏ మాత్రం సందేహం లేదు.

అసెంబ్లీ సాక్షిగా కేటీఆర్‌ మాట్లాడిన మాటలు అక్రమ నిర్మాణం చేపడితే ఎవరైనా సరే నోటీసు ఇవ్వకుండానే కూల్చివేస్తాం అన్న మాటలు ఉట్టి ప్రగల్బాలుగానే మిగిలిపోయాయి అనడంలో సందేహం లేదు.. కేటీఆర్‌ మాటలను, ఆయన మానస పుత్రిక టి.ఎస్‌.బి.పాస్‌ ను ఉత్తర ప్రగల్బాలుగా మార్చింది టీ.ఎస్‌.బి పాస్‌ పర్యవేక్షక మున్సిపల్‌ అధికారులు అనడంలో సందేహం లేదు.

తప్పులతడక టి.ఎస్‌.బి పాస్‌ కొత్త మున్సిపల్‌ చట్టం

తెలంగాణ స్టేట్‌ బిల్డింగ్‌ పర్మిషన్‌ అప్రూవల్‌ అండ్‌ సెల్ఫ్‌ అసెస్మెంట్‌ సిస్టం.. సామాన్యుడైనా, సంపన్నుడైన నిర్మాణం చేపట్టాలంటే, దళారులను ఆశ్రయించకుండా సొంతంగా టి.ఎస్‌.బి పాస్‌ ద్వారా నిర్మాణ అనుమతులు అప్లై చేసుకుంటే నిర్ణీత సమయంలో ఏ ప్రభుత్వ అధికారి ప్రమేయం లేకుండా అతి సులువుగా సామాన్యుడు గృహ నిర్మాణ అనుమతులు పొందాలని ఏర్పాటు చేసిన చట్టం టి.ఎస్‌.బి పాస్‌ కొత్త మున్సిపల్‌ చట్టం. దీనికి పూర్తి వ్యతిరేకంగా టి.ఎస్‌.బి పాస్‌ కొత్త మున్సిపల్‌ చట్టం కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. ఎవరైనా సరే టి.ఎస్‌.బి పాస్‌ లో నిర్మాణ అనుమతుల కోసం అర్జీ పెట్టుకుంటే ఎమ్మార్వో ఆఫీస్‌ నుండి రెవిన్యూ అధికారి, రెవిన్యూ ఇన్‌స్పెక్టర్‌ సైట్‌ విజిట్‌ చేసి అప్రూవల్‌ ఇవ్వాలి ఆయనకు డబ్బులు కట్టందే అప్రూవల్‌ ఇవ్వడు. ఆయన అప్రూవల్‌ ఇస్తేనే టౌన్‌ ప్లానింగ్‌ అధికారికి ఫైల్‌ ఆన్‌లైన్‌ ద్వారా చేరుతుంది. ఆయన గారికి టౌన్‌ ప్లానింగ్‌ అధికారికి ముడుపులు అందకుంటే.. లేటెస్ట్‌ ఈసీ లేదంటూ, మార్కెట్‌ వాల్యూ సర్టిఫికెట్‌ లేదంటూ, లింకు డాక్యుమెంట్లు సరితూగట్లేదు అంటూ లేనిపోని తప్పులు చూపించి ఏదో ఒక చిన్న తప్పిదం చూపి షార్ట్‌ ఫాల్‌ పెట్టడం జరుగుతుంది. ఇలా రెండు షాట్‌ ఫాలో పెడితే ఫైల్‌ రిజెక్ట్‌ అవుతుంది.. కట్టిన రుసుము కూడా తిరిగి రాదు.. ఇలా ఒక్కొక్క ఫైలు నాలుగు సార్లు రిజెక్ట్‌ అయిన దాఖలాలు కూడా ఉన్నాయి.రిజెక్ట్‌ అయిన ఫైళ్ళకు లక్షల్లో కట్టిన ఫీజులు వెనక్కి రాక వేలమంది బాధితులు కొన్ని నెలల నుండి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనిపై శాఖాపరమైన చర్యలు లేకపోవడం దుఃఖించదగ్గ విషయం.. ఈ విషయంపై టౌన్‌ ప్లానింగ్‌ పట్టణ ప్రణాళిక ఉన్నతాధికారులను ప్రశ్నిస్తే సామాన్య ప్రజానీకం డబ్బులు లూటీ అవుతున్నాయి. మీరు షార్ట్‌ ఫాల్‌ పెట్టడం వల్ల ఫైల్‌ రిజెక్ట్‌ అవుతే డబ్బులు వెనక్కి రావట్లేదు. దీనికి పరిష్కారం ఎలా అని అడగగా అది మా తప్పిదం కాదు టీ.ఎస్‌.బి పాస్‌ వెబ్‌సైట్‌లోనే లోపాలు ఉన్నాయి అని తప్పించుకుంటున్నారు.. (టి.ఎస్‌.బి పాస్‌) టీ.జీ బిపాస్‌ సైట్ ను పర్యవేక్షించే పట్టణ ప్రణాళిక అధికారులు వారికి అనుకూలంగా అప్డేట్‌ చేసుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. సిటిజన్‌ సర్చ్‌ పనిచేయకుండా చేయడం, మీరు ఇచ్చిన పర్మిషన్లు దొరకకుండా సమాచారాన్ని దాయడం వంటి పనులు చేస్తున్నారు.. కనీవినీ ఎరుగని అవినీతి ఈ పది సంవత్సరాల్లో జరిగింది అనడానికి ఎన్నో ఆధారాలు ఉన్నాయి.


టి.ఎస్‌.బి పాస్‌ రాకముందు డి.పి ఎం.ఎస్‌ లో ఎన్ని షార్ట్‌ ఫాల్స్‌ ఉన్నా కూడా అన్ని దస్త్రాలు న్యాయపరంగా ఉంటే అన్ని దస్త్రాలు సరి చూసి ఆ ప్రభుత్వ అధికారి కొన్ని రోజులకు ఫైల్‌ అప్రూవల్‌ చేసేవారు. కట్టిన పన్ను ప్రభుత్వానికి చేరేది. వ్యవస్థ అంతా బాగానే ఉన్నా ఇంకా పటిష్టం చేస్తాం అని కొత్త మున్సిపల్‌ చట్టాన్ని తీసుకొచ్చి సామాన్యునికి అందనంత దూరంగా చిక్కుముడిగా తయారు చేసిన ఘనత టి.ఎస్‌.బి పాస్‌ ప్రణాళిక పర్యవేక్షణ మున్సిపల్‌ అధికారులకేనా, గత మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ కు చెందుతుందా..!

ముడుపులు అందందే నిర్మాణ అనుమతులు పొందలేము..

నిర్మాణ అనుమతుల కోసం అర్జీ పెట్టుకున్న నిర్మాణదారుడు అన్ని దస్తావేజులు న్యాయపరంగా పొందుపరిచినా.. నో అబ్జెక్షన్‌ సర్టిఫికెట్‌ (ఎన్.ఓ.సీ) తీసుకురావాలంటూ ఎమ్మార్వో రెవెన్యూ శాఖ నుండి ఇరిగేషన్‌, యు.ఎల్.సీ ల్యాండ్‌ అక్విజేషన్‌ శాఖల నుండి నో అబ్జెక్షన్‌ సర్టిఫికెట్లు తేవాలంటే నిర్మాణదారుల్ని పంపి ముప్పు తిప్పలు పెట్టి కాలుకు పెడితే మెడకు, మెడకు పెడితే కాలుకు పెడ్తూ ముడుపులు చెల్లించండి మోక్షం రాదు అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. అవినీతి లాలూచీ కొందరు ప్రభుత్వ అధికారుల తంతు వర్ణనాతీతం.

జి.ఓ.ఆర్‌.టి నంబర్‌ 731 తేదీ 20/ /11/2017 మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ అండ్‌ అర్బన్‌ డెవలప్మెంట్‌, మున్సిపల్‌ శాఖ నుండి తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవో ఏం చెబుతుంది అంటే.. నిర్మాణ అనుమతుల కోసం అర్జీ పెట్టుకున్న నిర్మాణదారుడు ప్రమేయం లేకుండా ప్రభుత్వ టౌన్‌ ప్లానింగ్‌ ప్రణాళిక అధికారులే పలు శాఖల నుండి అనుమతులు తెప్పించుకుని.. నిర్మాణ అనుమతులు ఇవ్వాలని ఈ జీవో చెబుతున్న కూడా.. డబ్బులు ఇస్తేనే అనుమతులు లేకుంటే లేదు అన్నట్లుగా వ్యవహరిస్తూ ముక్కు పిండి ముడుపులు వసూలు చేస్తున్నారు ప్రభుత్వ అధికారులు.

మున్సిపల్‌ పట్టణ ప్రణాళిక అధికారుల జేబులు నింపుతున్న టి.ఎస్‌.బి.పాస్‌ కొత్త మున్సిపల్‌ చట్టం..

తెలంగాణ మున్సిపల్‌ శాఖలో, ఎం.ఏ అండ్‌ యు.డి, హెచ్‌.ఎం.డి.ఏ, జి.హెచ్‌.ఎం.సి, ప్రతి జిల్లాలలో ప్రత్యేక స్వయం ప్రతిపత్తి కలిగిన మున్సిపల్‌ కార్పొరేషన్లు మున్సిపాలిటీలు, గ్రామపంచాయతీలు ఇవి అన్నీ కూడా టి.ఎస్‌.బి పాస్‌ / టీ.జీ.బి పాస్‌ ద్వారానే ఆన్‌లైన్‌ పద్ధతిలో పనిచేస్తాయి. టి.ఎస్‌.బి.పాస్‌ కొత్త మున్సిపల్‌ చట్టం చాలా పటిష్టమైన దృఢమైన చట్టమే కావడం మున్సిపల్‌ పట్టణ ప్రణాళిక అధికారుల చేతిలో కీలుబొమ్మగా మారడం అధికారులకు వరంగా మారింది అనడంలో అతిశయోక్తి లేదు. టి.ఎస్‌.బి పాస్‌ కొత్త మున్సిపల్‌ చట్టం.. పర్యవేక్షణ అధికారులు దొంగలు కావడంతో దొంగలకే సద్ది కట్టే పరిస్థితి నెలకొంది. గత మున్సిపల్‌ చట్టం డి.పి.ఎం.ఎస్‌ సైట్‌లో అప్రూవ్‌ కానీ రిజెక్ట్‌ అయిన ఎన్నో తప్పులు ఉన్న వివాదాస్పదమైన ఫైల్స్ అన్ని నేడు మున్సిపల్‌ ఉన్నత స్థాయి అధికారులు అధిక మొత్తంలో ముడుపులు అందుకొని అప్రూవ్‌ చేసిన దాఖలాలు ఎన్నో ఉన్నాయి.

డి.పి.ఎమ్మెస్‌ పాత మున్సిపల్‌ నిర్మాణ అనుమతుల సైట్‌ లో రిజెక్ట్‌ అయిన ఫైళ్ల డాటా టి.ఎస్‌.బి పాస్‌ లో ఎంట్రీ చేస్తే ఎన్నో అక్రమాలు వెలుగులోకి వస్తాయి. డి.పి.ఎమ్మెస్‌లో రిజెక్ట్‌ అయిన ఫైల్స్ ను అధిక మొత్తంలో బేరం మాట్లాడుకుని అప్రూవ్‌ చేయడం అతి దారుణం. వీటిపై ఎన్నో కేసులు కోర్టులో పెండింగ్ లో ఉన్నాయి. హైకోర్టు, జిల్లా కోర్టు ఎన్నోసార్లు మొట్టెకాయలు వేసినా అధికారులకు బుద్ధి రాకపోవడం అధికారులపై దృఢమైన చర్యలు లేకపోవడం అవినీతి పరాకాష్టకు దారి తీసింది అనడంలో సందేహం లేదు. కొందరు మున్సిపల్‌ అధికారుల అవినీతి తంతు ఇంకా దారుణంగా ఉంది. ముడుపులు ఇస్తే ఎంతకైనా తెగిస్తామని.. టిడిఆర్‌ నిబంధనలను తుంగలో తొక్కి 20 ఫీట్లకు 25 ఫీట్ల రోడ్డుకు టి.డి.ఆర్‌ అన్వాయించి ఎక్కువ ఫ్లోర్లకు పర్మిషన్‌ ఇవ్వడం.. భవిష్యత్తులో ఆ బిల్డింగ్‌ ఫైర్‌ ప్రమాదాలకు గురికావడానికి ఆద్యం పోస్తున్నారు.

అధికారులకు ముడుపులిస్తే 30 ఫీట్ల రోడ్డును 60 ఫీట్లుగా చూపించి 11, 12 ఫ్లోర్లు నిర్మాణ అనుమతులు ఇస్తున్న వైనం.. మా ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తాం మమ్ముల్ని అడిగే వారే లేరు రోజుకు లక్షల్లో ముడుపులను సంపాదించి ఇంటికి తీసుకెళుతున్న వైనం. కోట్లకు పడగలెత్తిన అవినీతి అధికారులు.. ఎవరైనా ప్రశ్నిస్తే వారిపై ఇష్టమొచ్చినట్లుగా ఫీజుల మోత అడిగే వారు లేరనే ధీమాతో టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు వారికి నచ్చినట్లు ఎక్కువ మొత్తంలో ఉన్న దానికంటే ఎక్కువ ఫీజు వేసి ఎలాంటి ప్రమాణాలను పాటించకుండా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా నచ్చినంత అధిక మొత్తంలో ఫీజులు జులిపించి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఒక సామాన్యుడు 150 గజాల స్థలంలో రెండు అంతస్తుల పర్మిషన్‌ తీసుకుంటే 80 వేల నుండి లక్ష రూపాయల వరకు ఫీజు వస్తుంది. దీనిలో సి.ఆర్‌.ఎం.పి కాన్ఫరెన్సీ, రోడ్‌ మెయింటెనెన్స్‌ ప్రోగ్రాం కింద 150 గజాలకు పన్నులు వేయడం అవసరమా, ఇవన్నీ నచ్చని వారికే వేస్తున్నారు. ముడుపులు చెల్లిస్తే ప్రభుత్వానికి చెల్లించే ఫీజులో కూడా తక్కువ ఫీజు వేసి నీకు 10 లక్షలు తక్కువ చేశాము మాకు ఐదు లక్షలు ఇవ్వండి అని బేరం కుదుర్చుకొని నొక్కేసే ప్రయత్నాలు కోకొల్లలు. ఇవన్నీ కట్టడి చేసే ఉన్నత అధికారి లేకపోవడం దుఃఖించదగ్గ అంశం.

టి.ఎస్‌.బి.పాస్‌ కొత్త మున్సిపల్‌ చట్టం పర్యవేక్షించే కొందరు ఉన్నత స్థాయి అధికారులు.. హాస్పిటల్‌ నిర్మాణం చేపడితే హాస్పిటల్‌ అనుమతులు తీసుకోవాలి అని.. వారి నుండి భారీగా ముడుపులు తీసుకుని సెమీ కమర్షియల్‌ గా అనుమతులు ఇచ్చి ఎన్నో తప్పులు చేసి ఉన్నారు.. ఈ అవినీతి తంతులో భాగంగా పార్కు స్థలాలకు పర్మిషన్లు ఓపెన్‌ స్పేస్‌ స్థలాలకు పర్మిషన్లు నాలాలపై పర్మిషన్లు… ఇలా అక్రమంగా వేలల్లో పర్మిషన్లు ఇచ్చి ఉన్నారు.. వీర్ని అడిగే నాథుడు లేడు పర్యవేక్షణ కరువు.. అవినీతి అధికారి ఆడిందే ఆట, పాడిందే పాట. ఓ చిన్న స్థాయి టౌన్‌ ప్లానింగ్‌ ఉద్యోగి సేకరించిన ముడుపులు ఉన్నత స్థాయి అధికారి వరకు చేరుతున్నాయి అనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ మితిమీరిన అవినీతిపై ఐఏఎస్‌ స్థాయి అధికారులు దృష్టి సారించాలి.

టీ.ఎస్‌.బి.పాస్‌ కొత్త మున్సిపల్‌ చట్టంలో పారదర్శకత కరవు..

టీ.ఎస్‌.బి.పాస్‌ సైట్‌ నిర్వహణ అధికారుల చేతుల్లో కీలుబొమ్మగా మారడం ఉన్న స్థాయి అధికారులు ప్రభుత్వ పెద్దలు పాలకులకు దీనిపై అవగాహన లేకపోవడం, అధికారులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న తీరు అవినీతికి ఆద్యం పోస్తుంది అనడంలో అతిశయోక్తి లేదు. ఈ పాపాలకు మూల్యం ఎవరు చెల్లించుకుంటారు. పాపం కర్మ వెంటాడుతుంది అనే సత్యాన్ని గ్రహించాలి.. గతంలో నిర్మాణ అనుమతులు ఇచ్చే డి.పి.ఎ.మ్మెస్‌ సైట్లో ఏ నిర్మాణ అనుమతులు ఇచ్చినా ఎన్.ఓ.సీలు ఇచ్చినా ప్రతిదీ పొందుపరిచేవారు. పబ్లిక్‌ డొమైన్‌లో సిటిజన్‌ సర్చ్‌లో కనబడేది. కానీ, నేడు సిటిజన్‌ సర్చ్‌ను నామమాత్రానికే ఉంచి ఎలాంటి సమాచారం దొరకనివ్వకుండా అవినీతి అధికారులు జాగ్రత్త పడుతున్నారు అనే అభియోగం వాస్తవమైనదే.! ఆధారాలను దొరకనీయకుండా తప్పులు చేస్తున్నారు.. ఇష్టం వచ్చినట్లుగా ఒకరి భూమైతే ఇంకొక వ్యక్తి తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి నిర్మాణ అనుమతులకు వస్తే అధిక మొత్తంలో ముడుపులు ఇస్తే నిర్మాణ అనుమతులు లేఔట్‌ వెంచర్‌ అనుమతులు ఇస్తున్నారు.

ఫైర్‌ అండ్‌ సేఫ్టీ నిబంధనలు తుంగలో తొక్కి.. వేలల్లో నిర్మాణాలు, అక్రమ ఆక్యుపేన్సి సర్టిఫికెట్లు.. అక్రమ లేఅవుట్లు.. ఇన్ని అక్రమాలకు పారదర్శకత కరవు.. అయితే ఫిర్యాదు చేయొచ్చు న్యాయస్థానానికి వెళ్లొచ్చు అనే ప్రశ్నకు.. జవాబు మీరు ప్రత్యక్షంగా గ్రహించవచ్చు ఆర్టీఐ ద్వారా సమాచారం కోసం అర్జీ పెట్టుకుంటే తప్పుడు సమాచారంతో నెలల తరబడి అర్జీ దారిని ఇబ్బందులకు గురి చేయడం ఈ అవినీతి అధికారులకు పరిపాటిగా మారింది.. న్యాయస్థానాలను ఆశ్రయిస్తే ఎక్కువ కాలయాపన.. ఈ అవినీతిపై పోరాడే సామాజిక ఉద్యమకారులు అలసిపోయి ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు.

టీఎస్‌ బిపాస్‌ కొత్త మున్సిపల్‌ చట్టం పూర్తిగా అమలుకు నోచుకోలేదు.. ఎస్‌.టి.ఎఫ్‌ పూర్తిగా విఫలం..టీఎస్‌ బిపాస్‌ కొత్త మున్సిపల్‌ చట్టం ప్రకారం అక్రమ నిర్మాణం అక్రమ లేఔట్‌ లపై ఫిర్యాదు అందిన వెంటనే ఎస్‌.టి.ఎఫ్‌ స్పందించి నోటీసు ఇవ్వకుండానే ఆ నిర్మాణాన్ని లేఔట్‌ ని కూల్చేయాలి.. మొదట్లో కొందరు అధికారులు చురుకుదనాన్ని చూపించినా ఈ చట్టంలో ఎస్‌.టి.ఎఫ్‌ లో భాగంగా కలెక్టర్‌ స్థాయి అధికారి, పోలీస్‌ ఉన్నత స్థాయి అధికారి మున్సిపల్‌ కమిషనర్‌, ఫారెస్ట్‌ ఆఫీసర్‌, రెవెన్యూ ఆఫీసర్‌, ఫైర్‌ ఆఫీసర్‌, ఉన్నత స్థాయి అధికారులు భాగంగా ఉండాలి. కానీ, ఎవరు కూడా ఈ బాధ్యతలను స్వీకరించడానికి సుముఖంగా లేకపోవడంతో ఎస్‌.టి.ఎఫ్‌ ఉట్టిమాటగానే ఉండిపోయింది అనడంలో అతిశయోక్తి లేదు. ఈ విషయంపై కొందరు కోర్టును ఆశ్రయించగా టీ.ఎస్‌.బి పాస్‌ మున్సిపల్‌ చట్టం సవరించుకోవాలి అక్రమ నిర్మాణంపై చర్యలు తీసుకోవాలంటే 3 రాతపూర్వక నోటీసులో ఇచ్చి పూర్తి ఆధారాలను సేకరించి తర్వాతనే చర్యలు తీసుకోవాలనే కోర్టు ఆజ్ఞను జారీ చేసింది. ఈ విషయంపై టీ.ఎస్‌.బి పాస్‌ ప్రణాళిక పర్యవేక్షణ అధికారులు కిందిస్థాయి అధికారుల సమన్వయంతో న్యాక్‌ బృందాల సహాయంతో మూడు నోటీసులు ఇచ్చి వచ్చిన కాడికి దండుకొని అటువైపు కూడా చూడలేదనే ఆరోపణలు ఎన్నో ఉన్నాయి.

ఈ సమస్యలకు మోక్షం కలగాలంటే..

తెలంగాణకు ముఖ్యమైన ఆదాయ మార్గం హైదరాబాద్‌ మహానగరం. ఈ మహానగరం సవ్యంగా అభివృద్ధి చెందాలంటే సవ్యంగా ఆదాయం రావాలంటే పట్టణ ప్రణాళిక మున్సిపల్‌ వ్యవస్థ సవ్యంగా జరగాలి అంటే అధిక మొత్తంలో పన్నులను సేకరించే ఈ వ్యవస్థలపై సీఎం స్థాయి ఉన్నత పాలకవర్గం దృష్టి సారించాలి. టీ.ఎస్‌.బి పాస్‌ ను వెంటనే రద్దు చేయాలి. పటిష్టమైన మున్సిపల్‌ చట్టమైన చేయాలి. నేను ఈయల పాత డి.పి ఎమ్మెస్‌ సైట్ను పున: ప్రారంభించాలి.జీ.హెచ్‌.ఎంసి సి.సి.పి ఉద్యోగి, హెచ్‌ఎండిఏ డైరెక్టర్‌, డి.టి.సి.పి మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ పట్టణ ప్రణాళికలో ఉన్నత స్థాయి అధికారులను ఐఏఎస్‌ స్థాయి అధికారులతో నిర్వహిస్తేనే ఈ అవినీతికి చెక్‌ పెట్టే దారి దొరుకుతుంది. అనడంలో అతిశయోక్తి లేదు.టీ.జీ.బి పాస్‌ / టీఎస్‌ బిపాస్‌ స్కాంపై వరుసగా ప్రత్యేక కథనాలు తదుపరి.. సంచికల్లో..

Latest News

డిసెంబర్ 09 నుండి గ్రూప్ 02 హాల్ టికెట్లను డౌన్‎లోడ్ చేసుకోవచ్చు : టీజీపీఎస్సీ

డిసెంబర్ 09 నుండి గ్రూప్ 02 పరీక్షల హాల్ టికెట్లను డౌన్‎లోడ్ చేసుకోవచ్చని టీజీపీఎస్సీ తెలిపింది. డిసెంబర్ 15,16 తేదీల్లో గ్రూప్ 02 పరీక్షలు జరగనున్నాయి....
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS