- ప్రభుత్వ నిషేధిత భూమిలో ఓపెన్ స్పేస్ జోన్, గ్రీన్ బెల్ట్‌లో అనధికారికంగా నిర్మాణ అనుమతులు
- పార్కులు, ఆట స్థలాలు పబ్లిక్ ఉపయోగస్థలాలు స్వాహా..
- పారదర్శకంగా లేని టీఎస్ బి పాస్ వెబ్సైట్..
- మున్సిపల్ నిబంధనలు డోంట్ కేర్.. మహా అయితే కోర్టులో చూసుకుంటాం…!
- అవినీతి అధికారిపై , అవినీతిని ప్రోత్సహించిన వారిపై జోనల్ కమిషనర్ కేశవ్ పాటిల్, ఐ.ఏ.ఎస్ ఎందుకు చర్యలు తీసుకోరు..?
- అవినీతిపరులైన అధికార గణం తప్పులు కప్పిపుచ్చి లక్షలు కొల్లగొడుతున్నారు..
- ఈ అవినీతిపై జి.హెచ్.ఎం.సి పాలకవర్గం, మేయర్ స్పందించాలి..!
- కఠిన చర్యలు తీసుకునే బాధ్యత ‘‘హైడ్రా…దే’’ అంటున్న జి.హెచ్.ఎం.సి ఉన్నత అధికారగణం..
అవినీతి అధికారుల ఆటలు కట్టించడానికి ఎన్ని చట్టాలు తీసుకువచ్చిన, సమాజంలో చీడపురుగుల్లాంటి అవినీతి పరులను అడ్డుకోవడానికి ఎన్ని నిబంధనలు ఏర్పాటు చేసినా, మోసగాళ్లకు ఎక్కువ అన్నట్లు.. ఒక కారడవిలో సరైన తోవలో వెళ్ళేవాడికంటే అడ్డదిడ్డంగా వెళ్ళేవాడే గమ్యాన్ని చేరుకుంటాడు అన్న తరహాలో, ఇలాంటి వారికి రక రకాల ఐడియాలు వస్తుంటాయి. చట్టాలను, నిబంధనలను తప్పించుకుంటూ ఎన్నెన్నో కుయుక్తులు పన్నుతుంటారు. అవినీతి చెయ్యడంలో ఆరితేరిపోతుంటారు. వీరికి భయం ఉండదు, నీతి, నియమాలపై భక్తి ఉండదు. ఇలాంటి వారికి అడ్డుకట్ట వెయ్యకపోతే, వీరు అక్రమార్కులుగా మారడమే కాకుండా, సమాజాన్ని సైతం నిలువునా పాతేస్తుంటారు. ఈ కోవలోకే వస్తారు బడంగ్ పేట్ మున్సిపాలిటీలో విధులు నిర్వహిస్తున్న మేడంగారు శ్రీ ముంతాజ్ బేగం గారు.
పార్కులు ఆటస్థలాలు, ఓపెన్ స్పేస్‌లు, గ్రీన్ బెల్ట్ లు, నాలాలు, చెరువులు, ప్రభుత్వ ఆస్తులు కాపాడే బాధ్యత హైడ్రాది అని గంటా పథంగా చెబుతోంది కాంగ్రెస్ ప్రభుత్వం. అక్రమ నిర్మాణదారులనే టార్గెట్ చేసి నిర్మాణాలను కూల్చివేసి, సామాన్య జనానికి కన్నీరు తెప్పిస్తున్న హైడ్రా.. అవినీతికి పాల్పడిన అధికారులపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని అని సామాన్య ప్రజానీకం ప్రశ్నిస్తున్నారు. జిహెచ్‌ఎంసి, ఎల్బీనగర్ జోన్ పట్టణ ప్రణాళిక విభాగంలో అవినీతి తారాస్థాయికి చేరుకుందని వరస కథనాలు వ్రాసినా, ప్రభుత్వ అధికార గణం నిమ్మకు నీరు ఎత్తినట్లు వ్యవహరించడం అవినీతిని ప్రోత్సహిస్తున్నట్లు అని చెప్పకనే చెప్పవచ్చు. ఇది సరే ప్రభుత్వ అధికారులు పట్టించుకోవడం లేదు. కానీ జిహెచ్‌ఎంసి పాలకవర్గం అధ్యక్షురాలు అయిన మేయర్ నిద్రపోతున్నారా..? అంటున్నారు సామాజిక వర్గం. మేయర్ కి బాధ్యత లేదా..? లక్షల్లో, కోట్లలో అవినీతి జరుగుతుంటే.. అధికారులపై చర్యలు ఎందుకు తీసుకోరు..? అధికారులపై ఆజమాయిషి.. నాది కాదు అన్నట్లుగా ఎందుకు వ్యవహరిస్తున్నారు..? ఈ వార్త కథనంతోనైనా స్పందించి అవినీతి అధికారులపై చర్యలు తీసుకోవాలని సామాన్య జనం ఆవేదన వ్యక్తం చేస్తూ కోరుతున్నారు.. ప్రభుత్వ నిషేధిత స్థలంలో లక్షలు, కోట్లు లంచాలు తీసుకొని ప్రభుత్వ అనుమతులు మంజూరు చేసి, అవినీతిని ప్రోత్సహిస్తున్న ప్రభుత్వ అధికారులపై చర్యలు తీసుకున్న దాఖలాలు ఎక్కడో ఆ దేవునికే తెలియాలి..! అధికారులు తప్పులు చేయడం, అవినీతికి పాల్పడడం, చిన్నాచితక మెమోలు ఇవ్వడం వలన అవినీతికి పాల్పడే అధికారులకు భయం లేకుండా పోయి, బరితెగించి మరీ అవినీతికి పాల్పడుతూ.. లక్షల కోట్లు దండుకుంటున్నారు. ఈ విషయంపై నిఘా విభాగాలు, విజిలెన్స్ విభాగాలు చర్యలు తీసుకుంటున్నా.. అవన్నీ మేనేజబులే అంటూ లైట్ తీసుకుంటున్నారు అవినీతి ప్రభుత్వ అధికారులు. మహా అయితే కోర్టులో చూసుకుంటాం.. ఎవడూ ఏమీ పీకలేడు.. ఎంచక్కా తప్పించుకొని మళ్లీ తప్పులు చేస్తాం.. తప్పును ఒప్పు చేస్తాం కింద పడ్డా, పైన పడ్డాపై చేయి మాదే అంటున్నారు అడ్డగోలుగా సంపాదించి వెనుకేసుకున్న డబ్బున్న అవినీతి అధికారులు.
ఉమ్మడి ఆంధ్ర, తెలంగాణ మున్సిపల్ చట్టం తదుపరి కొత్త మున్సిపల్ చట్టం టి.ఎస్.బి పాస్.. కొత్త మున్సిపల్ చట్టం అవినీతి, అక్రమాలకు తావు లేకుండా చట్టాన్ని రూపొందిస్తే.. చట్టంలోని నియమ నిబంధనలను తుంగలో తొక్కి లక్షల్లో లంచం తీసుకుని ప్రభుత్వ నిషేధిత స్థలంలో అనుమతులు ఇస్తున్నారు టౌన్ ప్లానింగ్ అధికారులు. మరీ ముఖ్యంగా టీఎస్ బి పాస్ చట్టం పారదర్శకంగా లేకపోవడం.. ఎవరు ఏ తప్పు చేసినా తెలియకపోవడం, అవినీతి అధికారులకు వరంలా మారింది అనడంలో అతి శయోక్తి లేదు..
నాగోల్ బండ్లగూడ సర్వేనెంబర్ 40లో, అపార్ట్మెంట్లకు పదుల సంఖ్యలో పర్మిషన్లు ఇచ్చి ఉన్నారు.. ఇవే కాకుండా తప్పుడు ఎల్.ఆర్.ఎస్. లు పొందుపరిచి, ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా బహదూర్గుడా, లింగోజిగూడ డివిజన్ ప్రాంతంలో సర్వేనెంబర్ 49/5 బహదూర్గుడా, ప్రగతి నగర్ ప్రాంతంలో ప్రభుత్వ నిషేధిత స్థలంలో భారీ మొత్తంలో ముడుపులు తీసుకుని ఇచ్చిన పర్మిషన్ వివరాలు :
ఫైల్ నెంబర్ : 002274 / జి.హెచ్.ఎం.సి / 1083 /ఎల్బీఎన్ 2 / 2024 – బి.పి
పర్మిట్ నెంబర్ : 1060 / జి.హెచ్.ఎం.సి / ఎల్బీఎన్ / 2024 బి.పి / 10 మే, 2024
సర్వేనెంబర్ : 49/5బహదూర్ గూడ ప్రగతి నగర్
ఇలా పట్టణ ప్రణాళిక అధికారులు అవినీతికి పాల్పడుతూ.. లక్షలు దండుకుంటున్నారు. ఇవే కాకుండా పార్కు స్థలాల్లో, నాలాలపై అక్రమ పద్ధతిలో ఎన్నో పర్మిషన్లు ఇచ్చి ఉన్నారు.ముంతాజ్ మేడం గారు అవినీతికి పరాకాష్ట.. ఈమె గురించి చెప్పుకుంటూ పోతే తరగని గ్రంధమే అవుతుంది. అక్రమ పద్ధతిలో పలుమార్లు రిజెక్ట్ అయిన బిల్డింగ్ ఓసీలు, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లు, ఎన్‌ఓసీలు, తదుపరి కథనంలో కూలంకుషంగా చెప్పుకుందాం. పట్టణ ప్రణాళిక అధికారులు నిస్సిగ్గుగా తప్పు చేస్తున్నారు అంటే వీరి ఏకైక ధైర్యం టౌన్ ప్లానింగ్ టి ఎస్ బి పాస్ వెబ్సైట్ పారదర్శకత లేకపోవడమే అన్నది సుష్పష్టం అవుతోంది.. పూర్తి ఆధారాలతో రేపటి కథనంలో..