- ఉద్యోగాల ఖాళీల అంచనా వేసి టీజీపీఎస్సీ ద్వారా పరీక్షలు
- డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క
తెలంగాణలో ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్లు జాబ్ కేలండర్ ఆధారంగా ఉంటాయని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క(Mallu Bhatti Vikramarka) తెలిపారు. ఉద్యోగాల ఖాళీలు అంచనా వేసి టీజీపీఎస్సీ ద్వారా పరీక్షలను నిర్వహిస్తామన్నారు. ప్రశ్నపత్రాల లీక్, మాల్ ప్రాక్టీస్ జరుగకుండా పారదర్శకంగా పరీక్షల నిర్వహణ చేపడుతున్నామని తెలిపారు. శాసన మండలిలో ఆయన మాట్లాడారు. ఉద్యోగాల భర్తీ కోసమే జాబ్ క్యాలెండర్ ప్రకటించామని దశలవారీగా భర్తీ చేస్తున్నామని వెల్లడిరచారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోస్టుల్లో నియామకాలు చేపడతామన్నారు. కాగా, ‘అదిగో జాబ్ క్యాలెండర్.. ఇదిగో జాబ్ క్యాలెండర్’ అంటూ నిరుద్యోగులను ఊరించిన రేవంత్‌రెడ్డి సర్కారు, ఈ ఏడాది ఆగస్టు 3న గత అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఖాళీల వివరాల్లేని.. నోటిఫికేషన్, పరీక్షల తేదీల్లేని జాబ్ క్యాలెండర్‌ను ప్రకటించి ఉసూరుమనిపించింది. జాబ్ క్యాలెండర్‌లో మొత్తం 20 రకాల షెడ్యూళ్లను ప్రకటించగా వీటిలో అర్హత పరీక్ష అయిన టెట్ రెండు సార్లు ఉన్నది.
మిగతా 18లో గ్రూప్-1, 2, 3 నోటిఫికేషన్లు గతంలో జారీ అయినవే కావడం గమనార్హం. పరీక్షలు మాత్రమే నిర్వహించాల్సి ఉన్న వీటిని కూడా కొత్త జాబ్ క్యాలెండర్‌లో ప్రకటించి కాంగ్రెస్ సర్కారు తన ఖాతాలో వేసుకున్నది. యూపీఎస్సీ ఏటా జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తుంది. నోటిఫికేషన్ తేదీ, దరఖాస్తు గడువు, రాత పరీక్ష తేదీ లాంటి పూర్తి వివరాలు అందులో పొందుపరుస్తుంది. కానీ రేవంత్ సర్కారు ప్రకటించిన జాబ్ క్యాలెండర్‌లో ఇవేవీ లేవు. కేవలం ఫలానా నెలలో నోటిఫికేషన్ ఇస్తాం.. ఫలానా నెలలో పరీక్ష నిర్వహిస్తామన్న వివరాలు మాత్రమే ప్రకటించారు.