- మలక్‌పేట్ సర్కిల్-6 లో అవినీతి జలగ
- శానిటరీ విభాగాన్ని గుత్తాపట్టేసిన వైనం
- ట్రేడ్ లైసెన్స్‌లో భారీ గోల్‌మాల్
- శానిటరీ సూపర్‌వైజర్ పాశం గోవిందారెడ్డి చేతివాటం
- 3 ఏళ్ల పాటు శానిటరీ అసిస్టెంట్, లైసెన్ అధికారిగా విధులు
- అప్పుడే భారీ అవినీతికి తెర
- దొంగ చలాన్స్ పేరుతో గోవిందా రెడ్డి దోపిడి
- గోవిందా రెడ్డికి డిప్యూటీ కమిషనర్ అండ
- సమగ్ర దర్యాప్తు జరిపితే భారీ స్కాం బయట పడే అవకాశం
జీహెచ్ఎంసీ మలక్‌పేట్ సర్కిల్-6లో ఓ అవినీతి జలగ చేసిన కంపు మామూలుగా లేదు. ఉన్నది ఇంచార్జ్ పోస్టులోనే అయినా.. మూడేళ్ల పాటు మొత్తం సదరు విభాగాన్నే దున్నేశారు. నవ్విపోదురుగాక నాకేంటి సిగ్గన్నట్లు.. ఒరిజినల్.. డ్యూబ్లికేట్, ట్రిబ్యుకేట్ చలాన్ల వ్యవహారంతో ఎన్‌ఫోర్స్‌మెంట్ చాలన్ జారీ ప్రక్రియలో ఓ భారీ స్కాంకే తెర తీశారు.
బల్దియాలోని మలక్‌పేట్ సర్కిల్ శానిటరీ విభాగంలో ప్రస్తుతం సూపర్ వైజర్‌గా విధులు నిర్వర్తిస్తున్న పాశం గోవిందా రెడ్డి.. కొన్నాళ్ల క్రితం వరకూ అదే విభాగంలో అసిస్టెంట్ లైసెన్ ఆఫీసర్ అండ్ ఇంఛార్జ్ అధికారిగా 3 సంవత్సరాల పాటు పనిచేశారు. శానిటరీ విభాగంలో అసిస్టెంట్ లైసెన్ ఆఫీసర్ ఉద్యోగం అనేది అత్యంత కీలకమైన పోస్టు. మీ సేవ ద్వారా ట్రేడ్ లైసెన్స్‌ను పొందిన వారు.. నిబంధనలను పాటించకపోతే వాటిని పునః పరిశీలించే అధికారం అసిస్టెంట్ లైసెన్ ఆఫీసర్‌కు ఉంటుంది. సదరు షాపుల యాజమానులు రూల్స్ ప్రకారం షాప్ప్‌లకు సరైనా రుసుము కట్టకున్నా.. నిబంధనలకు పాతరేసినా అసిస్టెంట్ లైసెన్ ఆఫీసర్ చలాన్ల ద్వారా ఆ సోమ్మును కట్టించుకుంటారు. ఇది ఆయా షాపులు, కమర్షియల్ కాంప్లెక్స్‌లు,హోటల్స్ యొక్క విస్తీర్ణాన్ని బట్టి రుసుము ఉంటుంది. అంతేకాక జీహెచ్ఎంసీ నిబంధనలు ఎవరైనా అతిక్రమించి ట్రేడ్ లైసెన్స్ పొందినట్లయితే రీ వెరిఫికేషన్ చేసే అధికారం అసిస్టెంట్ లైసెన్ ఆఫీసర్‌కు ఉంటుంది. ఇదే అదునుగా భావించి, షాప్ యాజమానులను భయబ్రాంతులకు గురి చేసి, అధిక మొత్తంలో ఎస్ఎఫ్‌టి ఉన్నకూడా మీరు తక్కువ రుసుము చెల్లించి ట్రేడ్ లైసెన్స్ తీసుకున్నారని, నిబంధనల ప్రకారం మీరు చెల్లించిన దానికంటే, ఎక్కువ మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుందని బెదిరింపులకు దిగేవారు. ఈ వసూలకు గోవిందా రెడ్డి నియమించుకున్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులను పంపించి, సెటిల్‌మెంట్ చేపించుకొని ఫోన్ పే ద్వారా నిధులు మళ్లించుకొని, అనుచరగణానికి కొంత మొత్తాన్ని ఇచ్చేవాడు. మిగతా మొత్తాన్ని గోవిందా రెడ్డి, డిప్యూటి కమిషనర్లు జేబులు నింపుకునేవారు. జీహెచ్ఎంసీ ఖజానాకు మాత్రం భారీ గండీ కొడుతుండడం శోచనీయం.

మలక్‌పేట సర్కిల్‌లో అసిస్టెంట్ లైసెన్ ఆఫీసర్‌గా విధులు నిర్వర్తించిన గోవిందా రెడ్డి తన చేతివాటాన్ని ప్రదర్శించారు. ఒరిజినల్, డ్యూబ్లికేట్, ట్రిబ్లికేట్లలో గోల్‌మాల్‌కు తెర లేపి మూడేళ్లలో కోట్లు కొల్లగొట్టారు. వాస్తవానికి చలాన్ కట్టించుకునేటప్పుడు ఒరిజినల్ పేపర్ కింద కార్బన్ పేపర్ పెట్టాల్సి ఉంటుంది. గోవింద రెడ్డి షాపుల యాజమానుల నుంచి ఎన్‌ఫోర్స్‌మెంట్ చలాన్ కట్టించుకునే సమయంలో వారికి నిర్ణీత మొత్తానికి సంబంధించిన రశీదునే ఇచ్చేవారు. కానీ, ఆ తర్వాతే అసలు కథను నడిపించే వారు. షాపుల యాజమానులు గోవిందా రెడ్డికి ఇచ్చిన దాంట్లో కేవలం 10 నుంచి 20 శాతం మొత్తాన్నే కట్టినట్లు కార్బన్ పేపర్ పెట్టి డ్యూబ్లికేట్, ట్రిబ్యుకేట్ చలాన్లు రాసేవాడు. ఉదాహరణకు చలాన్ రిసిపిట్ నెం. 1595 సిరియల్ నెం. 159438 తేది 18/06/2024 1955 జీహెచ్ఎంసీ ఆక్ట్ సెక్షన్ 402, 596 ప్రకారం ముసారంబాగ్ మెయిన్‌రోడ్డులోని ఓ షాప్ యాజామాని వద్ద నుండి రూ. 5000 వసూలు చేశారు. కానీ, జీహెచ్ఎంసీకి మాత్రం రూ. 500 చెల్లించినట్లు రసీదులో పేర్కొన్నాడు. ఈ విధంగా గోవిందా రెడ్డి విధుల్లో ఉన్నంత కాలం అనేక చలాన్ వేయడం జరిగింది. ఈ వ్యవహారంలో ఆయనకు అత్యంత్య సన్నిహితులైన ఎస్ఎఫ్ఏ దేవేందర్, కామాటి రాము, జవాన్ యాదయ్య భాగస్వాములు..
మలక్‌పేట సర్కిల్‌లో మూడేళ్లు ఆయన పనిచేసిన కాలంలో కోట్లు దండుకోవడం గమనార్హం. అయితే గోవిందారెడ్డి చేసిన ఈ మొత్తం వ్యవహారానికి డిప్యూటి కమిషనర్ అండదండలు కూడా పుష్కలంగా ఉన్నట్లు తెలుస్తోంది. అందువల్ల ఈ మొత్తం వ్యవహారంపై జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు దృష్టి పెట్టి విచారణకు ఆదేశిస్తే ఓ భారీ అవినీతి బయటకు వచ్చే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.
పూర్తి ఆధారాలతో మరో కథనం ద్వారా గోవిందా రెడ్డి చేసిన అక్రమ వసూల దందా మీముందుకు తీసుకురానుంది.. ఆదాబ్ హైదరాబాద్.. మా అక్షరం.. అవినీతిపై అస్త్రం..