Friday, November 22, 2024
spot_img

ట్యాపింగ్‌.. ట్రాకింగ్ ఫియర్

Must Read
  • గులాబీ బాస్ కేసీఆర్ గుండెల్లో గుబులు
  • కేసును స్పీడప్ చేసిన సీఎం రేవంత్ రెడ్డి
  • సరికొత్త విషయాలు వెలుగులోకి
  • మాజీ డీసీపీ రాధాకిషన్ రావు, ప్రణీత్ రావు, మాజీ డీఎస్పీలు తిరుపతన్న, భుజంగ రావు అరెస్ట్
  • ఇంటలిజెన్స్ విభాగం మాజీ చీఫ్ టి. ప్రభాకర్ రావు అరెస్ట్ కు రెడ్ కార్నర్ నోటీసు స‌న్నాహాలు
  • కోర్ట్ లో ఛార్జ్ షీట్ దాఖలు చేసిన సిట్ అధికారులు
  • తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ దుమారం

ఫోన్ ట్యాపింగ్.. ఈ పేరు వింటేనే మాజీ సీఎం కేసీఆర్ ఉలిక్కిపడుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అనేక కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్) ఏర్పాటుచేసి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై దర్యాప్తు ప్రారంభించింది. ఇప్పటికే ఈ వ్యవహారంలో టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు, ఎస్ఐబీ ఇన్‌స్పెక్ట‌ర్ ప్రణీత్ రావు, ఇంటలిజెన్స్ విభాగం మాజీ డీఎస్పీలు తిరుపతన్న, భుజంగ రావులను అరెస్ట్ చేశారు. ఈ కేసులు అత్యంత కీలకంగా వ్యవహరించిన ఇంటలిజెన్స్ విభాగం మాజీ చీఫ్ టి. ప్రభాకర్ రావు విదేశాల్లో ఉన్నందున ఆయన అరెస్ట్ కోసం రెడ్ కార్నర్ నోటీసు పంపించేందుకు సిట్ సన్నాహాలు చేస్తోంది. ఈ మధ్యనే ఈ వ్యవహారానికి సంబంధించి దర్యాప్తు పూర్తయిన నేపథ్యంలో కోర్ట్ లో సిట్ అధికారులు ఛార్జ్ షీట్ దాఖలు చేసారు. అయితే ఛార్జ్ షీట్ తప్పుల తడకగా ఉండడంతో రెండు సార్లు కోర్ట్ తిప్పి పంపింది. మరోసారి తప్పులు సవరించిన అధికారులు కోర్ట్ కు సమర్పించారు.

వేగం తగ్గిందా..?

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని అత్యంత ప్రధాన అంశంగా భావించిన రేవంత్ ప్రభుత్వం తొలినాళ్లలో పూర్తిస్థాయిలో దృష్టిపెట్టి ఎప్పటికప్పుడు సమీక్షించింది. సిట్ ను ఏర్పాటు చేసి దర్యాప్తు తీరుపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టింది. హోమ్ మంత్రిత్వ శాఖా కూడా ముఖ్యమంత్రి వద్దే ఉండడం వల్ల ఆయనే స్వయంగా అధికారులను దర్యాప్తు తీరుతెన్నులపై అడిగి తెలుసుకుంటూ వచ్చారు. అయితే ఆ తర్వాత ఈ వ్యవహారంపై దృష్టి తగ్గిందనే అభిప్రాయం వ్యక్తమైంది. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో సీఎం సహా అధికార యంత్రాంగం మొత్తం దాదాపు రెండు నెలలపాటు ఎన్నికల ప్రక్రియలో నిమగ్నం కావడంతో సిట్ దర్యాప్తుపై దృష్టిపెట్టలేకపోయారని, ఇప్పుడు అన్ని ముగిసినందున మళ్ళీ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై పూర్తి దృష్టి పెడ‌తారా.. లేదా అన్న తెలియాల్సి ఉంది.. . రాష్ట్ర రాజకీయాలతో ముడిపడి ఉన్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం చివరికి ఏ మలుపు తిరుగుతుందో తెలియదు కానీ… సంచలనం సృష్టించిన ఈ వ్యవహారం అనేక కొత్త ప్రశ్నలకు, సంశయాలకు కారణమైంది. దేశ వ్యాప్తంగా చర్చకు దారితీసింది. అసలు ప్రభుత్వాలకు ఫోన్ ట్యాపింగ్ చేసే అధికారాలు ఉన్నాయా? ఏయే సందర్భాల్లో ఎవరి అనుమతితో చేయొచ్చు, ఫోన్ ట్యాపింగ్ చేసే విధానాలు, ఉపయోగించే యంత్రపరికరాలు తదితర అనేక ప్రశ్నలు ప్రజల మెదడులను తొలుస్తున్నాయి. ఇవన్నీ పక్కన బెడితే తెలంగాణలో తొమ్మిదిన్నరేళ్ళపాటు అధికారంలో ఉంది యథేచ్ఛగా ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడిన కేసీఆర్ ప్రభుత్వం.. ట్యాపింగ్ పరికరాలను ఎక్కడి నుండి ఎలా తెప్పించింది? ఎంత ఖర్చు చేసింది ? అనే వ్యవహారంపై ఆదాబ్ హైదరాబాద్ ప్రత్యేకంగా పరిశోధన చేపట్టింది. ఆదాబ్ పరిశోధనలో విస్మయ పరిచే అనేక అంశాలు తెలిసాయి. వ్యవస్థలను గుప్పిట పట్టిన కేసీఆర్ ప్రభుత్వం అన్ని నిబంధనలను, రాజ్యాంగం ప్రజలకు కల్పించిన హక్కులను కాలరాస్తూ ఒక ముఠాగా వ్యవహరించినట్లు తేలిపోయింది. పరిశోధనలో వెల్లడైన అంశాలను పాఠకులకు ప్రత్యేకంగా అందిస్తోంది ఆదాబ్…

టార్గెట్ చేసిన వాళ్ళ ఇంటిదగ్గరే…

ట్యాపింగ్ చేయడానికి ముందు సదరు వ్యక్తి యొక్క ఇంటి పరిసరాలు పరిశీలిస్తారు. ఇంటి సమీపంలోనే వ్యాన్ లాంటి వాహనంలో లేదంటే అనువైన రహస్య ప్రదేశంలో ట్యాపింగ్ యంత్రాన్ని అమరుస్తారు. ముందుగా ట్యాపింగ్ కోసం ఎంచుకున్న వ్యక్తి ఫోన్ నెంబర్, టెలికాం సంస్థ (నెట్ వర్క్ ప్రొవైడర్) వివరాలు, వ్యక్తి ఉపయోగించే స్మార్ట్ ఫోన్ ఐఎంఈఐ నెంబర్ వివరాలు సేకరిస్తారు. నగరాల్లో అయితే ప్రతి ప్రాంతంలో మూడు ఫోన్ సిగ్నలింగ్ టవర్స్ కు ఫోన్ నంబర్లు అనుసంధానమై ఉంటాయి. ఎంచుకున్న వ్యక్తి ఫోన్ నెంబర్ ఏ టవర్ నుండి ఎక్కువ సిగ్నల్ చూపిస్తుందో అదే టవర్ కు అనుసంధానంగా ఉన్నట్లుగా గుర్తిస్తారు. టవర్ నిర్ధారణ తర్వాత తాము సేకరించిన వివరాలు సరిచూసుకుంటారు. ఆ తర్వాత ట్యాపింగ్ ప్రక్రియను ప్రారంభిస్తారు. ఎన్ని గంటలు ట్యాప్ చేయాలి, ఎన్ని రోజులు చేయాలి అనే విషయంపై ఎప్పటికప్పుడు స్పష్టత తీసుకుంటూ అందుకు అనుగుణంగా టాస్క్ కొనసాగిస్తారు. ఐఎంఈఐ నుండి సేకరించిన సీడీఆర్ (కాల్ డేటా రికార్డు) ను ఇంటర్నేషనల్ మొబైల్ సబ్ స్క్రయిబర్ ఐడెంటిటీ (ఐఎంఎస్ఐ) లో స్కాన్ చేసి వివరాలన్నీ పరిశీలించుకుంటారు. ఆ తర్వాత ట్యాపింగ్ యంత్రాన్ని (ఇంటర్ సెప్టర్) రన్ చేస్తారు. దీంతో ఎంచుకున్న వ్యక్తి ఎవరికీ ఫోన్ చేసినా యంత్రం రికార్డు చేస్తుంది. తేదీ, సమయం, మాట్లాడిన నిడివి పూర్తి వివరాలు కూడా నమోదవుతాయి.

నెలల తరబడి ట్యాపింగ్ చేయాల్సిన అవసరమున్న చోట దాదాపుగా ఎంచుకున్న వ్యక్తి ఇంటి చుట్టుపక్కల ఉండే ఇల్లు, ఫ్లాట్, ఏదైనా కమర్షియల్ అవుట్ లెట్ లను ఎంపిక చేసుకుంటారు. మొత్తంగా ఈ వ్యవహారమంతా అంత్యంత గోప్యంగా కొనసాగేలా చూసుకుంటారు.

చెక్ రిపబ్లిక్ నుండి ట్యాపింగ్ యంత్రాలు తెప్పించారా..?

వివిధ రకాల ఫోన్ ట్యాపింగ్ యంత్రపరికరాలు అంతర్జాతీయ మార్కెట్లో లభిస్తున్నాయి. అయితే వాటిలో నాణ్యత ప్రమాణాలు లేనివే ఎక్కువ! దీంతో మంచి నాణ్యత కలిగిన యంత్రపరికరాల కోసం చాలా రోజులే అన్వేషించింది నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం! వివిధ మార్గాల్లో కొనసాగిన అన్వేషణలో చెక్ రిపబ్లిక్ దేశానికి చెందిన ఓ వ్యాపారి వివరాలు తెలిసాయి. అన్ని నిర్ధారణ చేసుకున్న తర్వాత అతని వద్ద ట్యాపింగ్ పరికరాలు కొనుగోలు చేయడానికి నిర్ణయించింది. చెక్ రిపబ్లిక్ లోని మకచకాల ప్రాంతానికి చెందిన శాంసుదినోవ్ జమాల్ మాముడినోవిక్ ( ప్రోయేక్ట్ సర్వీసెస్ ఎండీ) అనే వ్యాపారితో అనుకున్న ప్రకారం సుమారు మూడు కోట్లకు ఒక యంత్రం చొప్పున కొనుగోలుకు ఒప్పందం కుదుర్చుకున్న‌ట్లు గుస‌గుస‌లు విన‌ప‌డుతున్నాయి. గత పదేళ్లలో దాదాపు ఏడెనిమిది యంత్రాలు కేసీఆర్ ప్రభుత్వం కొనుగోలు చేసినట్లు సమాచారం! ఈ వ్యవహారంలో నాటి యువరాజు, అయన అనుచరులు, ఎన్నారైలు కీలకపాత్ర పోషించినట్లు తెలిసింది. ట్యాపింగ్ యంత్రాల కొనుగోలు నుండి తరలింపు వరకు యువరాజు సన్నిహితుడు అన్ని వ్యవహారాలను పర్యవేక్షించినట్లు వినికిడి..

యంత్రాల వివరాలు ఇవే..!

జీఎం 900 ఏ – పీజీఎంయూ 4 డీఎక్స్ మోడల్ ట్యాపింగ్ యంత్రాలు. మన దేశంలో గతంలో సీడీఎంఏ, జీఎస్ఎం నెట్ వర్క్ ఫోన్ లను ఉపయోగించేవారు. కానీ ఇపుడు సీడీఎంఏ నెట్ వర్క్ కనుమరుగైపోయింది. జీఎస్ఎం నెట్ వర్క్ మాత్రమే ఉపయోగంలో ఉంది. ఈ నేపథ్యంలో అందుకు అనుగుణంగా ఉండే జీఎస్ఎం ఇంటర్ సెప్టర్.. జీఎం 900 ఏ – పీజీఎంయూ 4 డీఎక్స్ మోడల్ ట్యాపింగ్ యంత్రాలు కొనుగోలు చేసినట్లు సమాచారం!

కస్టమ్స్ కు దొరక్కుండా యంత్రపరికరాలు విడదీసి..!

చెక్ రిపబ్లిక్ వ్యాపారి నుండి కొనుగోలు చేసిన ట్యాపింగ్ యంత్రాన్ని హైదరాబాద్ కు తరలించేందుకు అనేక జాగ్రత్తలు తీసుకుంటూ.. ఒక్కో యంత్రాన్ని ఒక్కో సారి యువరాజు దళం తరలించినట్లు స‌మాచారం. ఎయిర్ పోర్ట్ లో పట్టుబడకుండా ప్రతి యంత్రంలోని పరికరాలను ఎక్కడికక్కడ విడదీసి ఒక్కొక్కటిగా తరలించినట్లు తెలుస్తుంది. దీన్నే సాంకేతిక వ్యవహారిక పరిభాషలో అసెంబుల్డ్ సీకేడీ ( కంప్లీట్ నాక్డ్ డౌన్ ) అసెంబుల్డ్ ఎస్కెడీ (సెమి నాక్డ్ డౌన్ ) అంటారు. ఈ క్రమంలో దేశంలోని వివిధ ప్రధాన నగరాల్లోని ఎయిర్ పోర్ట్ లను ఉపయోగించుకున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ, ముంబై, బెంగుళూరు, చెన్నై ఎయిర్‌పోర్టులకు వేరువేరుగా విమానాలలో తరలించి… అక్కడినుండి హైదరాబాద్ కు రోడ్డు మార్గంలో వాహనాల్లో తరలించినట్లుగా సమాచారం! తరలింపు కార్యంలో యువరాజు నమ్మకమైన అనుచరులు పాల్గొన్నట్లు తెలుస్తోంది!..

ఈ ఫోన్ ట్యాపింగ్ క‌థ‌కు ముగింపు ఎప్పుడో తెలియ‌దు.. కానీ ఇందులో కొత్త కొత్త మ‌లుపులు తిరుగుతూ.. ఎంద‌రెంద‌రో బ‌డా నాయ‌కులు, అధికారులు, ఐఏఎస్‌, ఐపీఎస్ ల‌పేర్లు బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి.. దీంతో వారంద‌రికి ఫోన్ ట్యాపింగ్ ఉచ్చు బిగుసుకుంటుంది…

Latest News

డిసెంబర్ 09 నుండి గ్రూప్ 02 హాల్ టికెట్లను డౌన్‎లోడ్ చేసుకోవచ్చు : టీజీపీఎస్సీ

డిసెంబర్ 09 నుండి గ్రూప్ 02 పరీక్షల హాల్ టికెట్లను డౌన్‎లోడ్ చేసుకోవచ్చని టీజీపీఎస్సీ తెలిపింది. డిసెంబర్ 15,16 తేదీల్లో గ్రూప్ 02 పరీక్షలు జరగనున్నాయి....
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS