దివ్యాంగులపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు గానూ ఐఏఎస్ స్మితా సబర్వాల్‌పై చర్యలు తీసుకోవాలని హైకోర్టులో పిల్ దాఖలైంది. సామాజికవేత్త వసుంధర పిటిషన్ దాఖలు చేశారు. స్మితా సబర్వాల్‌పై చర్యలు తీసుకోవాలని యూపీఎస్సీ చైర్మన్‌కు ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్‌లో ఆమె కోరారు. ఈ పిటిషన్‌పై హైకోర్టు విచారించింది. అయితే.. ఈ సందర్భంగా కోర్టు కొన్ని కీలక ప్రశ్నలు సంధించింది. పిటిషనర్‌కు ఉన్న అర్హతను హైకోర్టు ప్రశ్నించింది. పిటిషనర్ ఒక వికలాంగులారని అడ్వకేట్ తెలిపారు. పూర్తి వివరాలతో అఫిడవిట్ సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. దివ్యాంగులు ఐఏఎస్‌లుగా పని చేయలేరంటూ అవమానించేలా సోషల్ విూడియాలో పోస్టు పెట్టిన సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సబర్వాల్ బహిరంగ క్షమాపణలు చెప్పాలని సీఎస్ బీ ఐఏఎస్ అకాడవిూ చీఫ్, మాజీ ఐఏఎస్ మల్లవరపు బాలలత ఇటీవల డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వంలో కీలక పదవిలో ఉన్న ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఇలాంటి పోస్టు పెట్టడం దారుణమని, ఆమెపై సీఎం రేవంత్ రెడ్డి, చీఫ్ సెక్రటరీ శాంతికుమారి తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. స్మితా సబర్వాల్ చేసిన వ్యాఖ్యలు వ్యక్తిగతమా లేక ప్రభుత్వ అభిప్రాయాలా అని ప్రశ్నించారు. రిజర్వేషన్లు కల్పిస్తున్న రాజ్యాంగాన్ని, సుప్రీంకోర్టు తీర్పులను కూడా ఆమె వ్యతిరేకిస్తున్నారా? అన్నది చెప్పాలన్నారు. దివ్యాంగులు ఎక్కువ సేపు పని చేయలేరంటూ వారి సామర్థ్యాన్ని నిర్ణయించడానికి స్మితకు ఏం అధికారం ఉందని ప్రశ్నించారు. ఏ అంశాల ప్రాతిపదికగా ఆమె ఈ నిర్ణయానికి వచ్చిందో చెప్పాలన్నారు.‘స్మితా సబర్వాల్ కు, నాకు సివిల్స్ ఎగ్జామ్ పెట్టండి. ఎవరికి ఎక్కువ మార్కులు వస్తాయో చూద్దాం‘ అని బాలలత ఓపెన్ చాలెంజ్ చేశారు. ‘సీఎం రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టగానే తొలి ఉద్యోగం ఒక దివ్యాంగురాలికి ఇచ్చారు. ఆమె సామర్థ్యాన్ని చూసి ఇచ్చారా లేదంటే ఊరికే ఇచ్చారా అన్నది సీఎం స్పందించి తెలియజేయాల్సిన అవసరం ఉన్నది‘ అని ఆమె కోరారు.