Tuesday, December 3, 2024
spot_img

పుస్తకం పఠనమే విశ్వ విజ్ఞాన దర్శనం..!

Must Read
  • 06 సెప్టెంబర్‌ ‘జాతీయ పుస్తక పఠన దినం’ సందర్భంగా

పుస్తకం హస్తభూషణమే కాదు మస్తష్క వికాస సాధనం కూడా అని మనకు తెలుసు. పుస్తక పఠనం ఓ చక్కని అలవాటు. జ్ఞాన భాండాగారంగా పూజించబడే పుస్తకాలను సరస్వతి రూపాలుగా కొలుస్తాం. పుస్తకం విశ్వాన్ని పరిచయం చేస్తుంది, వింతలు విడ్డూరాలను విప్పి చూపుతుంది. పుస్తకం మానవాళి మేధోశక్తిని పోషిస్తుంది. పుస్తకం అక్షరాల కుప్ప కాదు,జ్ఞాన జ్యోతిని వెలిగించే ఇంధనం. పుస్తకం మనో నేస్తం, సమాజోద్ధరణకు ఊతం. ప్రపంచాన్ని పరిచయం చేస్తూ, నూతన ఆవిష్కరణాగ్నికి ఆజ్యం పోసేది పుస్తక పఠనమే. లోక రీతులు, శాస్త్ర ప్రగతులు, సాంకేతిక జిలుగులు, అజ్ఞానాన్ని పారద్రోలే మహోజ్వల వెలుగులను నింపగల మహాశక్తివంతమైన సాధనం పుస్తకమే కదా. జ్ఞాన లోతులను పరిచయం చేస్తూ, ప్రపంచ సమస్యలకు సరైన సమాధానం ఇవ్వగల మోధో నిధి పుస్తకమే. పుస్తక ప్రాధాన్యతను గుర్తించి పుస్తక పఠనానికి జీవనశైలిలో సింహభాగం కేటాయించాడాన్ని ప్రోత్సహించే కృషిలో భాగంగా ప్రతి ఏట 06 సెప్టెంబర్‌ రోజున ప్రపంచవ్యాప్తంగా “జాతీయ పుస్తక పఠన దినోత్సవం (నేషనల్‌ రీడ్‌ ఏ బుక్‌ డే)” పాటించుట జరుగుతోంది.

జ్ఞాన భాండాగారాలుగా గ్రంథాలయాలు :

గ్రంధాలయాల సందర్శన, వ్యక్తిగత గ్రంధాలయాన్ని నిర్మించుకోవడం, పుస్తక పఠన స్వచ్ఛంద సంఘాలను ఏర్పాటు చేసుకోవడం,విలక్షణ పుస్తకాల సేకరణ చేసే అభిరుచిని కలిగి ఉండడం, స్నేహితులు పుస్తకాలను మార్చుకుంటూ చదువుకోవడం,పుస్తక పఠన ప్రాధాన్యతలను వివరించడం,పుస్తక పఠన పోటీల నిర్వహణ,పాఠశాలల్లో పుస్తక పఠనాన్ని ఆదరించడం,పుస్తకాన్ని జీవితకాల నేస్తంగా భద్రపరుచుకోవడం,గ్రంధాలయాలను సందర్శించడం లాంటి అంశాలను జాతీయ పుస్తక పఠన దిన వేదికల్లో విద్యార్థుల ముందు చర్చించాలి.1990లో హోవర్డ్‌ బెర్గ్‌ రికార్డు స్థాయిలో నిమిషానికి 25,000 పదాలు చదవడంతో అత్యంత వేగంగా చదివిన వ్యక్తిగా గిన్నీస్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్‌లో చోటు దక్కించుకున్నారు.సాధారణ పాఠకులు నిమిషానికి 300 వరకు పదాలు చదువగలుగుతారు.‘అన్నీ జోన్స్’‌ అనబడే పాఠకురాలు ‘హారీ పోట్టర్’‌ పుస్తకాన్ని నిమిషానికి 4,200 పదాల వేగంతో 47 నిమిషాల్లో చదివి ప్రపంచ పఠన బహుమతిని గెలుచుకున్నారు.మన పిల్లలు ఘన కార్యం చేసినపుడు ఓ మంచి పుస్తకాన్ని బహుమతిగా ఇవ్వడాన్న తల్లితండ్రులు పాటించాలి. పుస్తక పఠనాభిరుచితో మోధో వ్యాయామం జరిగి చురుకుగా తయారవుతారు.వాడవాడలా పుస్తక క్లబ్‌లు ఏర్పాటు చేయాలి.

పుస్తక పఠన ప్రయోజనాలు :

పుస్తకాలు అపూర్వ వినోద, విజ్ఞాన కోవెలలుగా భావించబడాలి. పుస్తకాన్ని పది మందికి అందుబాటులో ఉంచుట ద్వారా విజ్ఞాన వితరణకు దోహదపడిన వారమవుతాం. జ్ఞాపకశక్తిని పెంపొందించుట, ఏకాగ్రతను సాధించుట, మానసిక ఒత్తిడిని కలిగించుట, కాస యంత్రంగా పని చేయుట లాంటి ఇతర ప్రయోజనాలు పుస్తక పఠనంతో కలుగుతాయి.పుస్తక పఠనంతో జీవన సంక్లిష్టతలను అధిగమించడం, మేధావిగా రాణించడం, సృజనను పెంపొందించడం,జ్ఞాపకశక్తిని పెంచడం,అనుమానాలను/అజ్ఞానాన్ని తరిమేయడం,పదకోశాలను పెంచుకోవడం,జీవన లక్ష్యాలను అధిగమించడం, జీవనోపాధిని పొందడం, కుటుంబ సభ్యులను విద్యావంతులుగా మార్చడం, సహానుభూతిని పోషించడం,నిద్ర సమస్యలు తొలగడం, వినోద విందులు చేసుకోవడం, విద్యావంతుడిగా గుర్తింపు పొందడం, మెదడు చురుకుదనం పెరగడం, ప్రేరణ కలిగించడం,నైపుణ్యాలను పొందడం,పలు ప్రశ్నలకు సమాధానాలు లభించడం,మంచి స్నేహితులను పొందగలగడం లాంటి అనేక ప్రయోజనాలు కలుగుతాయి.

నేటి నానో,డిజిటల్‌ విప్లవ యుగంలో పుస్తక పఠనాభిరుచి పలుచబడుతోంది. చదవడం మానేసి టివి/గూగుల్‌ సైట్స్‌ చూసే కల్చర్‌ను అలవర్చుకుంటున్నాం. బుక్‌ కల్చర్‌ను నిర్లక్ష్యం చేస్తూ లుక్‌ కల్చర్‌కు అలవాటు పడుతున్నాం.గూగులమ్మ కన్న పుస్తక సరస్వతే మిన్న అని విద్యార్థులకు వివరిద్దాం. జ్ఞాన సంపదను తరతరాలకు అందజేస్తున్న పుస్తకాలు మనకు అపూర్వ ఆస్తులుగా నిలవాలి. పుస్తకాన్ని నమ్మిన వారు పుణీతులైనారు. అక్షరాలు కొలువైన పుస్తకాలను సమాజ ప్రగతి రథాలుగా మార్చుకోవాలి. ప్రపంచ మానవాళిని అక్షరాస్యులుగా,విద్యావంతులుగా మార్చగలిగే నిశ్శబ్ద శక్తిరూపం పుస్తకమే అని గమనించి పుస్తక పఠనాన్ని మహత్తర మహాయజ్ఞంగా కొనసాగిద్దాం.

డా: బుర్ర మధుసూదన్ రెడ్డి
9949700037

Latest News

నకిలీ కెనాన్ టోనర్లను స్వాధీనం చేసుకున్న బెంగళూరు పోలీసులు

బెంగళూరు పోలీసులు మంగళవారం మై ఛాయిస్ ఐటీ వరల్డ్ పై దాడి చేసి నకిలీ కెనాన్ ప్యాక్డ్ టోనర్లను స్వాధీనం చేసుకున్నారు. అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS