Friday, September 20, 2024
spot_img

ఉన్నత విద్యారంగంలో సంస్కరణలు వేగవంతం చేయాలి

Must Read

దేశవ్యాప్తంగా ప్రభుత్వ కళాశాలలు మరియు విశ్వవిద్యాలయాలలో విద్యా ప్రమాణాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. గణితం, సైన్స్‌, సోషల్‌ స్టడీస్‌, ఇంగ్లీష్‌లలో పదవ తరగతి విద్యార్థుల అభ్యసన సామర్థ్యం వరుసగా 32 శాతం, 35 శాతం, 37శాతం, 43శాతంగా నమోదయ్యాయని ‘నేషనల్‌ అచీవ్‌మెంట్‌ సర్వే’ పేర్కొన్నది. 2017నాటి జాతీయ సర్వేతో పోల్చితే, 2021సర్వేలో సగటు ఫలితాలు పడిపోయాయని తెలిపింది.ఆన్‌లైన్‌ ద్వారా సమాన విద్యావకాశాలు పూర్తిగా సన్నగిల్లాయి అని సర్వేలు చెబుతున్నా దిద్దుబాటు చర్యలకు ప్రభుత్వాలు పూనుకోవడం లేదు. భాషానైపుణ్యం, పర్యావరణ శాస్త్రం, సైన్సు, గణితం, సామాజిక శాస్త్రాలలో పిల్లలు వెనుకబడ్డారు అని అనేక నివేదికలు తెలియజేస్తున్నాయి.. తాజాగా కాగ్‌ నివేదిక ఐఐటీ, ఎన్‌ఐటీల్లో పీజీ, పీహెచ్‌డీ కోర్సుల్లో ఏటా సీట్లు భారీగా మిగిలిపోతున్నాయని వెల్లడిరచింది. ఆంధ్రప్రదేశ్‌లో సెకండరీ విద్య తర్వాత ముస్లిం విద్యార్థుల్లో ఎక్కువ మంది చదువుకు గుడ్‌బై చెబుతున్నారు. కర్నాటక, కేరళ రాష్ట్రాలు ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. బీహార్‌, జార్ఖండ్‌లో 20%కి పైగా డ్రాపవుట్లు నమోదవుతున్నాయి. రాజస్థాన్‌, హర్యానా, యూపీలో కూడా పరిస్థితి దాదాపు అలాగే ఉంది.
ఆంధ్రప్రదేశ్ లో సింగిల్‌ మేజర్‌ డిగ్రీ ప్రవేశపెట్టిన ఉన్నత విద్యామండలి, దానిపై అవగాహన కల్పించడంలో నూరుశాతం విఫలమైంది. అసలు ఏ కోర్సు ఎక్కడుంది? ఏది చదవాలి? అన్నదానిపై కనీస అవగాహన విద్యార్థులకు లేని పరిస్థితి నెలకొంది. ఫలితంగా జగన్‌ పాలనలో ఏటా వేలాది మంది ఇంటర్‌ తర్వాత చదువు ఆపేస్తున్నారు. 2020-21, 2021-22 విద్యా సంవత్సరాల్లో అయితే ఏటా లక్ష మందికి పైగా ఇంటర్‌ పూర్తయిన విద్యార్థులు ఉన్నత విద్యకు వెళ్లకుండా ఆగిపోయారు.

ఇక ఉన్నత విద్య కోసం విదేశాల బాట పడుతున్న భారతీయ విద్యార్థుల సంఖ్య ఏటా పెరుగుతున్నది. అత్యధికంగా విదేశాలకు వెళ్తున్న విద్యార్థుల సంఖ్యలో పంజాబ్‌, తెలంగాణ, మహారాష్ట్ర ముందువరుసలో ఉన్నాయి.ఇండియన్‌ స్టూడెంట్స్‌ మొబిలిటీ రిపోర్ట్‌-2023’ నివేదికను విడుదల చేశారు. 2019లో విదేశాల్లో 10.9 లక్షల మంది విద్యను అభ్యసించగా.. 2025 నాటికి ఈ సంఖ్య దాదాపు 20 లక్షలకు చేరుతుందని నివేదిక అంచనా వేసింది.

దీనిని బట్టి ఉన్నత విద్య ఎంతగా సన్నగిల్లుతుందో ఇట్టే అర్థమవుతుంది. సమాజం ఎదుర్కొనే సవాళ్లకు తగిన పరిష్కారాలను పరిశోధించి చెప్పవలసిన విశ్వవిద్యాలయాలు కేవలం డిగ్రీలను ప్రదానం చేసే పాత్రకే పరిమితమయ్యాయి. నాణ్యమైన బోధన, పరిశోధన గాలిలో దీపంలా ఉంది. పరిశోధనలో అంతర్జాతీయ ప్రమాణాలను నెలకొల్పిన ఉస్మానియా విశ్వవిద్యాలయం వరల్డ్‌ ర్యాంకింగ్‌లో పతనావస్థకు చేరుకున్నది. భౌతిక శాస్త్రంలో సూరిభగవంతం, అర్థశాస్త్రంలో సిహెచ్‌.హనుమంతరావు, సాహిత్యంలో సి.నారాయణరెడ్డిని అందించిన ఓయూ సంక్షోభంలోకి నెట్టబడింది.

పరిమాణాత్మకంగా ఇంతగా ఎదిగిన భారత దేశ విద్యా వ్యవస్థ నాణ్యత విషయంలో మాత్రం చాలా అథమ స్థాయిలో ఉండటం శోచనీయం. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ప్రపంచంలో కెల్లా అత్యున్నత నాణ్యత కలిగిన 200 విశ్వవిద్యాలయాల్లో కనీసం మన దేశానికి చెందిన ఒక్క విశ్వవిద్యాలయం కూడా లేకపోవడం గమనార్హం.

అయితే ఈ సమస్యకు పూర్తిగా ప్రభుత్వాలనే తప్పు పట్టలేం. విద్యాలయాలు అగ్రశ్రేణి సంస్థలుగా ఎదగడానికి నిధు లు కీలకం. ప్రభుత్వ గ్రాంట్ల పైనే ఆధారపడకుండా నిధుల సమీకరణపై దృష్టిసారించాలి.విద్య నాణ్యత పెరగాలంటే బోధన సిబ్బంది జవాబుదారీగా వ్యవహరించాలి. బోధన, పరిశోధన సిబ్బంది విధిగా పబ్లిక్‌ డొమేన్‌లో తాను నిర్వర్తించిన బాధ్యతలను, జరిపిన ఆవిష్కరణలను పొందుపరచాలి. శక్తివంతమైన, సమర్థవంతమైన అధ్యాపకుల ఎంపిక విద్యాసంస్థల విజయానికి కీలకం. అధ్యాపకుల నాణ్యత, ని బద్ధతే విజయానికి ఆయువుపట్టు. కాబట్టి ఈ తరం విద్యార్ధులను పరిశోధనలు, బోధన దిశగా ప్రోత్సహించాలి.

మనం మొత్తం విద్యపై పెట్టే ఖర్చు ఇంత వరకు మన జాతీయ ఉత్పత్తి(జిడిపి)లో 4 శాతం కంటే మించలేదు. అందులో కీలకమైన ఉన్నత విద్యపై 1.22 శాతం మాత్రమే మనం ఖర్చు చేస్తున్నాం.. అందుకే మన విద్యావ్యవస్థ అరకొర వసతుల మధ్య కొట్టుమిట్టాడుతున్నది. బోధన మరియు పరిశోధన రెండు కూడా మెరుగుపడాలంటే విద్యపై మన వ్యయం గణనీయంగా పెరగాలి.

భారత రత్న అబ్దుల్‌ ‌కలాం ప్రకారం ‘మన దేశ విద్యా వ్యవస్థ ఉద్యోగ అన్వేషనకులని తయారు చేయుస్తున్నది కాని ఉద్యోగాలను కల్పించే వారిని కాదు’. విద్య అందులో ముఖ్యంగా ఉన్నత విద్య విద్యార్థులను భవిష్యత్తులో వారి కాళ్లపై వారు నిలబడి ఎదిగే విధంగా తయారుచేయాలి. ఇలా జరగాలంటే మన విద్యా వ్యవస్థను మనం సమూలంగా మార్పు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ప్రపంచంలోని దేశాలన్నింటిలో ఉన్నత విద్యా వ్యవస్థ పరిమాణం దృష్ట్యా భారత దేశానికి మూడో స్థానముంది. మొదటి స్థానం అమెరికాదైతే, రెండోస్థానం చైనాది. ఒక దశాబ్ధం క్రితం మన దేశమే రెండో స్థానంలో ఉండేది. ఇంత పెద్ద వ్యవస్థ గల మన దేశం ఉన్నత విద్యా వ్యవస్థను పటిష్టపరచడం ద్వారా దేశ రూపురేఖలు మారుతాయనడంలో సందేహం లేదు.

సి.హెచ్.సాయిప్రతాప్,
బాచిలర్స్ ఇన్ జర్నలిజం & మాస్ కమ్యూనికేషన్స్( ఉస్మానియా),
ఫ్లాట్ నెంబర్ : 405 ,శ్రీ బాలాజీ డిలైట్స్,
రాహుల్ కోలనీ, ఎ ఎస్ రావు నగర్,
సాయి సుధీర్ కాలేజీ వద్ద,
హైదరాబాద్ 500 062,

Latest News

బీఆర్ఎస్,బీజేపీ పార్టీలకు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు

వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...
- Advertisement -spot_img

More Articles Like This