- బెయిల్ రద్దు పటిషన్ తిరస్కరించిన ధర్మాసనం
- కేసును బదిలీ చేయాల్సిన అవసర లేదని వ్యాఖ్య
- సుప్రీం తీర్పుతో రఘురామ పిటిషన్ ఉపసంహరణ
సుప్రీం కోర్టులో ఆంధప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి(YS JAGANMOHAN REDDY)కి భారీ ఊరట లభించింది.. వైఎస్ జగన్ బెయిల్‌ను రద్దు చేయాలంటూ.. మరోవైపు జగన్ పై ఉన్న కేసులను మరో రాష్ట్రానికి బదిలీ చేయాలంటూ ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణం రాజు గతంలో వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది.. రఘురామ కృష్ణంరాజు పిటిషన్ పై జస్టిస్ నాగరత్న, జస్టిస్ సతీష్ చంద్ర శర్మల ధర్మాసనం విచారణ జరిపింది.. చివరకు ఆ పిటిషన్‌ను డిస్మస్ చేస్తున్నట్టు వెల్లడించింది. ఇక, జగన్ బెయిల్ ను రద్దు చేయాలంటూ వేసిన పిటిషన్ ను ఉపసంహరించకున్నారు పిటిషనర్.. ఈ పరిణామాలతో వైసీపీ అధినేత వైఎస్ జగన్‌కు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించినట్టు అయ్యింది.. అయితే కేసులకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. జగన్‌ను కేసులను రోజు వారీ విచారణ చేపట్టాలని న్యాయస్థానం ఆదేశించింది. జగన్ కేసుల బదిలీకి నిరాకరించిన సుప్రీంకోర్టు, తెలంగాణ హైకోర్టులో జగన్ అక్రమాస్తుల కేసు పర్యవేక్షణ నేపథ్యంలో వేరే రాష్టాన్రికి బదిలీ చేయాల్సిన అవసరం లేదని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది. అలాగే జగన్ బెయిల్‌ను రద్దు చేయాలన్న పిటిషన్‌పై కూడా ప్రత్యేకంగా విచారణ అవసరం లేదని చెప్పింది. గతంలో సుప్రీంకోర్టు ఎమ్మెల్యే, ఎంపీల కేసుల విషయంలో ఇచ్చిన తీర్పు ఈ కేసుకు కూడా వర్తిస్తుందని సుప్రీం ధర్మాసనం తేల్చిచెప్పింది. ట్రయల్ కోర్టు… రోజు వారీ విచారణకు తీసుకోవాలని, హైకోర్టు కూడా పర్యవేక్షణ చేయాలని అందువల్ల మరో రాష్టాన్రికి బదిలీ చేయాల్సిన అవసరం లేదని జస్టిస్ నాగరత్న, జస్టిస్ సతీష్ చంద్ర మిశ్రా ధర్మాసనం తేల్చిచెప్పింది. దీంతో పిటిషన్‌ను వెనక్కి తీసుకుంటామని రఘురామ తరఫు న్యాయవాది బాలాజీ సుబ్రహ్మణ్యం కోర్టుకు తెలిపారు. వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం జగన్ బెయిల్ రద్దు, కేసుల ట్రయల్ విచారణ ధర్మాసనం మార్పు చేయాలని రఘురామకృష్ణరాజు సుప్రీం కోర్టులో ఓ పిటిషన్ వేశారు. గతంలో ఈ పిటిషన్‌ను జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ పంకజ్ మిత్తల్ ధర్మాసనం విచారించగా.. ఆ తర్వాత జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ సతీష్ చంద్రశర్మ ధర్మాసనం ముందుకు వెళ్లింది. గత 12 ఏళ్లుగా ట్రయల్ ఒక్క అడుగు కూడా ముందుకు కదల్లేదని.. ఒక్క డిశ్ఛార్జ్ అప్లికేషన్ కూడా డిస్పోజ్ చేయలేదని రఘురామ తరఫు న్యాయవాది బాలాజీ సుబ్రహ్మణ్యం కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. బదిలీ సాధ్యం కాదని సుప్రీంకోర్టు గత విచారణలోనే చెప్పిందని.. తాము ఇప్పుడు కేసు మానిటరింగ్ పూర్తి స్థాయిలో జరగాలని కోరుతున్నామని తెలిపారు.