- బాధితులను బయటకు తీసుకొచ్చేందుకు శ్రమిస్తున్న 11 సంస్థలు
టన్నెల్‌లో చిక్కుకున్న 8మందిని కాపాడేందుకు ఎన్నో ప్రయత్నాలు సాగుతున్నాయి. షిఫ్టుకి వందమందికి పైగా పనిచేస్తున్నారు. నాలుగు రోజులుగా నిరంతరాయంగా పనులు కొనసాగుతున్నాయి. అందర్నీ సజీవంగా తీసుకొచ్చేందుకు 11 సంస్థలు శ్రమిస్తున్నాయి. గంటలు గడుస్తున్న కొద్దీ టెన్షన్ పెరిగిపోతున్న నేపథ్యంలో.. వీలైనంత త్వరగా లోపలికి చేరుకునేందుకు యుద్ధప్రాతిపదికన పనులు జరుగుతున్నాయి. ముఖ్యంగా రెస్క్యూ సిబ్బందికి టీబీఎం చాలెంజింగ్‌గా మారింది. ప్రమాదం జరిగిన దగ్గర టీబీఎం ముక్కలై దాని విడిభాగాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. దీంతో అక్కడ రెస్క్యూ చేయాలంటే చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఓవైపు బురద, ఇంకోవైపు సీపేజ్ వాటర్, మరోవైపు టీబీఎం ముక్కలతో అత్యంత ప్రతికూల పరిస్థితులు కనిపిస్తున్నాయి. గ్యాస్ కట్టర్లను ఉపయోగించి తీసేసే ప్రక్రియను జరపాలన్నా.. ఉబికి వస్తున్న నీరు ప్రతిబంధకంగా మారింది. ఇక రెస్క్యూ ఆపరేషన్లో ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ పాలుపంచుకుంటున్నాయి. జియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, ర్యాట్ హోల్ మైనర్స్, సింగరేణి, హైడ్రా టన్నెల్ ఎక్స్‌పర్ట్స్ మరికొన్ని కంపెనీలు తమ సేవలను అందిస్తున్నాయి. మొత్తం 11 ఏజెన్సీలు నిరంతరం కోఆర్డినేషన్ చేసుకుంటూ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు.