Friday, November 22, 2024
spot_img

ఆదర్శవంతమైన రాజకీయం రేవంత్ సొంతం

Must Read

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతవారం ఓ ప్రభుత్వ కార్యక్రమంలో మాట్లాడుతూ “ఒకప్పుడు ప్రజల సమస్యల గురించి పోలీస్ స్టేషన్లో యస్.పి కి నేను వినతిపత్రం ఇచ్చేవాణ్ణి.ఇప్పుడు వారు ప్రజల సమస్యల గురించి నాకు వినతిపత్రాలు ఇస్తే తీసుకునే స్థాయిలో వున్నా.అందుకే మీరు కూడా ఓ లక్ష్యం పెట్టుకొని ఎన్ని అవాంతరాలు ఎదురైనా లక్ష్యం పై ఫోకస్ పెట్టి కష్టపడితే జీవితంలో ఏమైనా సాధిస్తారు” అన్నారు.2006 లో మిడ్జిల్ మండలం జడ్పీటీసి గా రాజకీయ జీవితంలోకి ప్రవేశించి 18 సంవత్సరాలు గా తన కష్టంతో అంచెలంచెలుగా ఎదిగి నేడు తెలంగాణ రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రి గా,దేశంలోనే కాంగ్రెస్ పార్టీలో కీలక నేతల్లో ఒకరిగా వుండటం వెనుక ఆయన ప్రయాణం స్ఫూర్తిదాయకమనే చెప్పాలి.

తెలుగుదేశం పార్టీలో చేరి,ప్రజల కోసం పనిచేసి స్వల్ప కాలంలోనే ప్రస్తుత నేటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు దగ్గరవ్వడమే కాకుండా తెలుగుదేశం కార్యకర్తల అభిమానం, మద్దతు పొందారు.ఇప్పటికీ తెలంగాణ లోని తెలుగుదేశం కార్యకర్తలు రేవంత్ పై వున్న అభిమానాన్ని అవసరమైనప్పుడు ఓట్ల రూపంలో చూపుతున్నారు.2023 అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ ముఖ్యమంత్రి అయిన సందర్భంగా తెలుగు దేశం జెండాలు రెపరెపలాడాయన్నది అందరికీ తెలిసిందే.తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగాక జరిగిన కొన్ని రాజకీయ పరిణామాల దృష్ట్యా రేవంత్ తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ లోకి వచ్చారు.అనతికాలంలోనే తన చతురతతో,కష్టంతో, వాక్ చాతుర్యంతో రాహుల్ గాంధీ దృష్టిలో పడ్డారు.కొందరి రాజకీయ అనూహ్య చర్యల వల్ల 2018 అసెంబ్లీ ఎన్నికల్లో యంఎల్ఎ గా ఓడినప్పటికీ వెంటనే జరిగిన 2019 సార్వత్రిక ఎన్నికల్లో కూకట్ పల్లి నుండి కాంగ్రెస్ యంపీగా గెలిచి తన సత్తా చూపారు.ఇక అక్కడి నుంచి ఆయన దూకుడు రాజకీయం ప్రజల సమస్యల్ని పాలకులతో ప్రశ్నించడం వల్ల జననాయకుడిగా ఎదిగారు.కాంగ్రెస్ అంతర్గత రాజకీయ పోరును బలంగా ఎదుర్కొని టిపిసిసి అధ్యక్షుడు గా నియమించబడి యావత్ తెలంగాణ రాష్ట్రంలో సంచలనం అయ్యారు.రాహుల్ గాంధీ ప్రోత్సాహంతో రాష్ట్ర కమిటీ నాయకులను సమన్వయం చేస్తూ ఆరు గ్యారంటీలతో కూడిన హామీలతో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయ అవాంతరాలను అధిగమించి సోనియాగాంధీ ఆశీస్సులతో తెలంగాణ రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రి గా అశేష జనసమూహం సాక్షిగా ప్రమాణస్వీకారం చేశారు.

2024 మే లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణ నుంచి కాంగ్రెస్ అభ్యర్థులుగా 8మంది ఎంపీలు గెలవడంలో ప్రముఖ పాత్ర పోషించారు.ఇక ఎన్నికల ఫలితాల తర్వాత రేవంత్ తన మార్క్ (మార్పు) రాజకీయాన్ని చూపిస్తున్నారు.ఒక ప్రక్క ప్రజల కిచ్చిన గ్యారంటీ హామీలు నెరవేర్చే కార్యక్రమాల్లో పాల్గొంటూనే,రాజకీయ కోణంలో చేరికలకు ప్రాధాన్యం ఇస్తున్నారు.ఆడవారికి ఉచిత బస్సు ప్రయాణం,200 యూనిట్లలోపు గృహాలకు ఉచిత విద్యుత్,₹500 కే సిలిండర్, ఆరోగ్యశ్రీ వంటి పథకాల అమలు,పథకాలకు అర్హులైన వారికి అందని విషయంలో సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నారు.

2024 సార్వత్రిక ఎన్నికల సందర్భంగా రైతులందరికీ ఆగష్టు 15 వరకు రెండు లక్షల రూపాయిలు రుణమాఫీ చేస్తానని ఇచ్చిన గ్యారంటీ హామీని నెరవేర్చే పనిలో ప్రస్తుతం లక్షరూపాయల రుణమాఫీ చేసి ముందడుగే వేసారని చెప్పవచ్చు.ఇంకా ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను కూడా ఆయన ప్రజాపక్షంగా ఎదుర్కొవాల్సి వుంది.డియస్సి, గ్రూప్-1, గ్రూప్ -2, గ్రూప్-3 ఉద్యోగ నియామక పరీక్షలకు సంబంధించిన అభ్యర్థుల ఆందోళనలను తగ్గించడానికి గ్రూప్ -2 పరీక్షల నిర్వహాణ తేదిని మారుస్తూ,డియస్సి పరీక్షను షెడ్యూల్ ప్రకారమే నిర్వహిస్తున్నారు.జాబ్ క్యాలెండర్ త్వరలోనే విడుదల చేస్తామని,మాది నిరుద్యోగులకు న్యాయం చేసే ప్రభుత్వమని సందేశాన్ని ప్రజలకు చెరవేస్తున్నారు.త్వరలోనే నిరుద్యోగులు ఉద్యోగ నియామకాల శుభవార్తలు జాబ్ క్యాలెండర్ రూపంలో వింటారనే నమ్మకాన్ని రేవంత్ కలగజేయడంలో కొంతమేరకు సఫలీకృతం అవుతున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.ఏదేమైనా రైతులు, నిరుద్యోగులు రేవంత్ ప్రభుత్వంపై చాలా ఆశలు పెట్టుకున్నారు.వివిధ ఉద్యోగ నియామక పరీక్షలు రాస్తున్న అభ్యర్థుల మరియు నిరుద్యోగుల సమస్యల్ని రాజకీయ కోణంలో మాత్రమే కాకుండా ప్రజాస్వామ్య పద్ధతుల ద్వారా పరిష్కరించడంలో రేవంత్ ప్రత్యేక శ్రద్ధ చూపాలి.అసెంబ్లీ సమావేశాల్లోను మరియు బడ్జెట్ కేటాయింపుల్లోను ప్రతిపక్షాల ఆలోచనలకు ప్రజాస్వామిక ప్రాధాన్యత ఇస్తూ,కక్ష్య, ద్వేష పూరిత రాజకీయాలకు దూరంగా వుండాలి.

పదేళ్ళు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వుంటుందని, రాహుల్ గాంధీ ని ప్రధానిని చేయడమే తన లక్ష్యమని పదే పదే చెబుతున్న రేవంత్ ప్రజల మద్దతుతో ప్రజా సమస్యల్ని పరిష్కరిస్తూ తెలంగాణ పునర్నిర్మాణంలో కీలక బాధ్యత పోషించాలి.రాష్ట్ర విభజన సమస్యలు, ఎన్నికల్లో ఇచ్చిన అన్ని హామీలు నెరవేర్చడం రేవంత్ ముందున్న పెద్ద సవాల్.ముఖ్యంగా వ్యవసాయం,విద్యా, వైద్యం, రంగాలకు ప్రాధాన్యత ఇస్తూనే పారిశ్రామిక పెట్టుబడులను కూడా పరుగులు పెట్టించటం రేవంత్ భవిష్యత్తు రాజకీయాలకు చాలా కీలకం.సాధారణ వ్యక్తి స్థాయి నుంచి ఎన్నో ఒడిదుడుకులతో, విమర్శలతో, రాజకీయ వివాదాలతో, న్యాయపరమైన కేసులతో అక్కడే ఆగకుండా నిత్యం పోరాడుతూ ముఖ్యమంత్రిగా ఎదిగిన రేవంత్ తన ఆత్మవిశ్వాసంతో ప్రజాపాలన అందిస్తూ తెలంగాణను భారతదేశానికి ముఖచిత్రంగా మార్చాలని, “నా తెలంగాణ కోటి రతనాల వీణ అన్న మహాకవి దాశరథి మాటల్ని నిజం చేస్తారని, మనమిచ్చిన పాలన బాధ్యతను సంపూర్ణంగా నిర్వర్తిస్తారని ఆశిద్దాం.

ఫిజిక్స్ అరుణ్ కుమార్
నాగర్ కర్నూల్
9394749536

Latest News

డిసెంబర్ 09 నుండి గ్రూప్ 02 హాల్ టికెట్లను డౌన్‎లోడ్ చేసుకోవచ్చు : టీజీపీఎస్సీ

డిసెంబర్ 09 నుండి గ్రూప్ 02 పరీక్షల హాల్ టికెట్లను డౌన్‎లోడ్ చేసుకోవచ్చని టీజీపీఎస్సీ తెలిపింది. డిసెంబర్ 15,16 తేదీల్లో గ్రూప్ 02 పరీక్షలు జరగనున్నాయి....
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS