Friday, September 20, 2024
spot_img

బి.ఆర్.ఎస్ హయాంలో, వందల కోట్ల భూములు హంఫట్

Must Read

( సీఎం రేవంత్ రెడ్డి సార్ జర వీళ్ళ స్కాంపై లుక్కేయండి.. )

  • హైదారాబాద్ కేంద్రంగా నకిలీ ఆధార్ కార్డుల తయారీ ముఠా
  • ఆధార్ లో వేలిముద్రలు, ఫోటోలతో సహా ముఠా సభ్యులకు అప్డేట్
  • మనుషులు బతికుండగానే చనిపోయినట్లు డెత్ సర్టిఫికెట్లు
  • మృతుడి కుటుంబ సభ్యులుగా లీగల్ హెయిర్ సర్టిఫికెట్ సృష్టించిన కేటుగాళ్లు
  • ప్రభుత్వ, లే అవుట్లలో పార్కుల స్థలాలు, చాలా ఏళ్ల క్రితం కొన్న ఫ్లాట్లే వీరి టార్గెట్
  • కాసులకు కక్కుర్తిపడి ముఠాకు సహకరించిన సంబంధిత సబ్ రిజిస్ట్రార్ లు
  • అమీన్ పూర్ ముఠాలో సభ్యుడైన రవిగౌడ్ జైలుకు వెళ్లి వచ్చి.. సస్పెండ్ అయి ఉన్న సీఐని ఏసీబీ ట్రాప్ చేయించడంలో మతలబేంటి..?
  • అక్రమాస్తుల చిట్టా బట్టబయలు కాకుండా మరో స్కెచ్ వేశాడా.?
  • సిబిఐ, ఏసీబీ అధికారులు దృష్టిపెడితే వేల కోట్ల విలువైన కబ్జా భూములకు చెక్

ఆధార్ కార్డులు నకిలీ వివరాలతో సృష్టిస్తారు… చనిపోయిన. వారిని బ్రతికిస్తారు.. కోర్టులను, ప్రభుత్వాన్ని మోసం చేస్తారు.. కోట్ల విలువైన స్థలాలను కాజేస్తారు.. అసలు ఇవి సాధ్యమేనా..? అన్న అనుమానం రాక మానదు. కానీ అమీన్ పూర్ లోని కేటుగాళ్లు అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు…అసలు ఏమి జరిగింది..? ఓ లుక్ వేద్దాం…

రాష్ట్రంలో భూముల ధరలకు రెక్కలొచ్చిన నేపథ్యంలో అందరికీ వాటిపైనే కన్నుపడింది. డబ్బులపై ఉన్న ఆశతో మనుషులు ఎంతకైనా దిగజారుతున్నారు. సొంత కష్టం మీద ఆధారపడే రోజులు పోయినయి ఏదోవిధంగా పైసలు సంపాదించాలనే ఆలోచనతో అమాయకుల్ని మోసం చేస్తున్నారు. సర్కారు భూములు, అసైన్డ్ ల్యాండ్స్, చెట్లు, పుట్టలు, ఏళ్లుగా పడావున్న జాగలు, పార్కులు, రోడ్లు, నాలాల వంటివి కనపడితే చాలు మింగేస్తున్నారు అక్రమార్కులు. హైదరాబాద్ కేంద్రంగా గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన భూ కబ్జాదారుల ముఠా వ్యవహారం చూస్తే కళ్ళు బైర్లు కమ్మాల్సిందే..

హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాలలో ప్రభుత్వ అనుమతి పొందిన లేఔట్లలో పార్కు స్థలాలు, మున్సిపాలిటీల పరిధిలో ఉన్నటువంటి ప్రభుత్వ ఖాళీ స్థలాలు, చాలా సంవత్సరాల క్రితం పైసా పైసా కూడా పెట్టుకుని కొనుగోలు చేసుకున్న ప్రైవేటు వ్యక్తి ప్లాట్ల పై కన్నెశారు కబ్జారాయుళ్ళు.. తొలుత నకిలీ డాక్యుమెంట్ సృష్టించుటకు ఆధార్, బోగస్ డెత్ సర్టిఫికెట్ల తయారు చేసే ముఠా ఆధార్ కార్డులలో ఫోటో వేలిముద్రలతో సహా మార్పులు చేసి, నకిలీ మరణ ధ్రువీకరణ పత్రాలను సృష్టించి, ఫేక్ లీగల్ హెయిర్ సర్టిఫికెట్లను తయారుచేసి, వాటి ఆధారంగా మనుషులు బతికి ఉండగానే చనిపోయినట్లు బోగస్ పత్రాలను సృష్టించి భూ కబ్జాలకు పాల్పడిన వ్యవహారం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది..

భూ కబ్జాలకు పాల్పడే ముఠా సభ్యులు చేసిన ఆగడాలు రాష్ట్ర ప్రభుత్వానికి సవాల్ గా మారాయి. అవినీతి, అక్రమాలే ద్యేయంగా భూ బకాసురులు అమాయకుల ప్లాట్లను ముఠా సభ్యుల పేరుపై మార్చుకొని రిజిస్ట్రేషన్ చేసుకుంటారు.. అట్టి ప్లాట్లను భూ యజమానికి తెలియకుండానే అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు.. గతంలో లే అవుట్ చేసిన వ్యక్తుల పేరిట ఉన్న ఆధార్ కార్డులను పసిగట్టి అదే పేరుతో ముఠాలో సభ్యుడు తన పేరుపై ఆధార్ కార్డు ఫోటో వేలిముద్రలతో సహా అప్డేట్ చేసుకొని ఇతరులకు ప్లాట్లతో సహా వందల కోట్ల విలువైన భూములను కొట్టేయడంతో రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయంశం అవుతోంది. ఈ యవ్వారం.. హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో ప్లాట్లు కొనాలి అంటే మధ్యతరగతి వ్యక్తులు జాగ్రత్త వహించకపోతే అంతే సంగతి. లింక్ డాక్యుమెంట్ లేకుండానే నకిలీ ఆధార్, బోగస్ మరణ ధ్రువీకరణ పత్రం, ఫేక్ లీగల్ హెయిర్ సర్టిఫికెట్లతో డాక్యుమెంట్ రైటర్లను ఆశ్రయిస్తారు ముఠా సభ్యులు.. డాక్యుమెంట్ రైటర్ల ద్వారా రిజిస్ట్రేషన్ వారి పేరుపై చేయుటకు డాక్యుమెంట్ తయారుచేసుకొని సంబంధిత సబ్ రిజిస్ట్రార్ లతో ములాఖత్ అయి, లోపాయికారీ ఒప్పందం చేసుకొని, ముడుపులు ముట్టచెప్పి దొడ్డి దారిన రిజిస్ట్రేషన్ చేసుకొని యజమానులుగా అవతారమెత్తుతారు.

అమాయకుల ప్లాట్లకు యజమానులు గా మారిన ముఠా అట్టి భూములను అమ్మి సొమ్ము చేసుకొని.. కొనుగోలుదారులను మోసం చేస్తూ కోట్ల రూపాయలు దండుకొని తమకేమీ తెలియదన్న చందాన వ్యవహరించడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఇటీవలే హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి ఇలాంటి వ్యవహారం తన దృష్టికి రావడంతో అక్రమార్కుల భారతం పట్టి కటకటాల పాలు చేసిన విషయం విదితమే.. అంతేకాకుండా సంగారెడ్డి జిల్లా ఎస్పీ రూపేష్ సార్ ఇటీవలే కొంతమంది నకిలీ ఆధార్ లతో భూ కబ్జాలకు పాల్పడిన ముఠాను జైలుకు పంపిన విషయం కూడా తెలిసిందే.. ఇక్కడ అసలు ట్విస్ట్ ఏమిటంటే.. జైలుకు పోయి వచ్చిన ముఠాలోని రవి గౌడ్ అనే వ్యక్తి తనను జైలుకు పంపిన సీఐ సస్పెండ్ లో వుండగా రూ. కోటి 50 లక్షలు లంచం అడిగినట్లు, 5 లక్షలు లంచం ఇస్తూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టించారు.

అవినీతి సొమ్ము కోసం ఆశపడ్డ అధికారిని ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. మరి జైలుకు వెళ్లి వచ్చి లంచం ఇవ్వడానికి సీఐకి ఎర వేయడంలో మతలబేంటి అన్నది ప్రశ్నార్థకంగా మారింది. మరి అవినీతి నిరోధక శాఖ అధికారులకు పిర్యాదు చేసిన వ్యక్తి జైలుకు ఎందుకు వెళ్ళాడు. ఎంతమంది భూములు కబ్జాకు ప్రయత్నించాడు.. ఎన్ని డాక్యుమెంట్లు ఎలా సృష్టించారు.. ఇతగాడికి ఎలా రిజిస్ట్రేషన్లు అయ్యాయి..?? అన్న విషయాన్ని గుర్తించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఇందుకు ఉదాహరణగా సంగారెడ్డి జిల్లాలోని అమీన్ పూర్ లో సర్వే నెంబర్ 174/ఏ మరియు 174/బీ లో ప్లాట్ నెంబర్ 25/8,9 యొక్క విస్తీర్ణం 400 గజాలు అగ్రిమెంట్ సెల్ కమ్ జీపీఏ యొక్క రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ నెంబర్ 19665/2023 చూస్తే మట్టపర్తి కరుణశ్రీ అలియాస్ వై కరుణశ్రీ అనే మహిళ కు సంబంధించిన స్థలంగా బోగస్ పత్రాలు క్రియేట్ చేసి, సదరు మహిళ నుండి బోనగిరి గీత భర్త వెంకటేశ్వర్లు గిర్మాజిపేట గ్రామం, వరంగల్ జిల్లాకు చెందిన మహిళకు ఏజిపీఏ చేసినట్లు డాక్యుమెంట్ పరిశీలిస్తే తెలుస్తోంది. బోనగిరి గీత పేరు నుండి అవినీతి నిరోధక శాఖ అధికారులకు సీఐనీ పట్టించ్చిన మెరుగు రవి గౌడ్ పేరు పైకి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ నెంబర్ 26395/2023 గా రిజిస్ట్రేషన్ చేసుకోవడంపై అవినీతి నిరోధక శాఖ అధికారులు విచారణ జరపకపోవడం గమనార్హం.

రాష్ట్ర ప్రభుత్వం దీనిపై దృష్టి సారిస్తే.. కోట్ల రూపాయల విలువైన భూములకు రక్షణ ఏర్పడటంతో పాటు సామాన్యులకు న్యాయం జరుగుతుందనేది వాస్తవం. అంతే కాకుండా అవినీతి నిరోధక శాఖ అధికారులకు సీఐకి లంచం ఇస్తూ పట్టించిన రవిగౌడ్ చేసిన అక్రమ ఆస్తుల చిట్టా బట్టబయలు కాకుండా మరో స్కెచ్ వేశాడా అన్నది అంతుచిక్కని అంశంగా మారింది..? ఈ డాక్యుమెంట్ల వ్యవహారంపై సదరు డాక్యుమెంట్ రైటర్ ను వివరణ కోరగా సంగారెడ్డికి సంబంధించిన డాక్యుమెంట్లు సూరారం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ పరిధిలో ఉన్న తన దగ్గర 10 నుండి 15 డాక్యుమెంట్లు తయారు చేపించారని తెలిపారు. కేసు నమోదు అయ్యాక డాక్యుమెంట్ రైటర్ దగ్గరకు వచ్చి అట్టి డాక్యుమెంట్లు తన కంప్యూటర్ లో నుండి డిలీట్ చేపించినట్లు పేర్కొన్నారు. తన ఫోన్ లో మాత్రం నాలుగు డాక్యుమెంట్లు ఉన్నాయని చెప్పారు. ఇదే తరహాలో దుందిగల్ మండలంలో మళ్లంపేట గ్రామ శివారులో ఉన్న లే ఔట్ లో పార్కు స్థలాలకు కబ్జా చేయుటకు ఏ.వి రామరాజు అనే వ్యక్తి పేరుతో వేలిముద్రలు ఫోటోలతో సహా ఆధార్ డేటాలో అప్డేట్ చేసుకొని, పార్కు స్థలాలు ప్రభుత్వ భూములకు కబ్జాలకు పాల్పడి ప్రభుత్వానికి సవాలు విసిరారు. గత ప్రభుత్వంలో కబ్జాలు చేసుకున్నోళ్ళకు చేసుకున్నంత అన్న చందాన అధికారులు వ్యవహరించడం, భారీగా ముడుపులు తీసుకొని సహకరించడంతో వందల కోట్ల విలువైన భూములు కబ్జాదారుల కబంధ హస్తాల్లో బందీగా ఉన్నాయి. గత ప్రభుత్వంలో జరిగిన ఈ అక్రమ వ్యవహారాలపై అవినీతి నిరోధక శాఖ అధికారులతో, సిబిఐ అధికారులు విచారణ జరిపే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ దృష్టి సారిస్తే రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు వందల కోట్ల ఆదాయం వస్తుందని, అంతేకాకుండా అన్యాక్రాంతమైన ప్రభుత్వ భూములను పరిరక్షించిన వారు అవుతారని, అమాయక ప్రజలు కబ్జాల ముఠా చేతుల్లో చిక్కకుండా ఉంటారని పలువురు సామాజికవేత్తలు డిమాండ్ చేస్తున్నారు.

హైదారాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా, సంగారెడ్డి జిల్లాలో జరిగిన ఈ అవినీతి వ్యవహారాలకు సంబంధించి మరో కథనం ద్వారా వెలుగులోకి తీసుకుని రానుంది ‘ఆదాబ్ హైదరాబాద్ ‘ ..’ మా అక్షరం అవినీతిపై అస్త్రం ‘..

Latest News

బీఆర్‌ఎస్,బీజేపీ పార్టీలకు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు

వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...
- Advertisement -spot_img

More Articles Like This